ఒకే రోజు హీరోగా.. విలన్ గా.. ఎవరీ రాగ్ మయూర్..?
దర్శకుడు శంకర్, యాక్షన్ హీరో అర్జున్ కాంబోలో వచ్చిన 'ఒకే ఒక్కడు' మూవీలో అర్జున్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అందర్నీ అలరిస్తాడు. ఇప్పుడు యువ నటుడు రాగ్ మయూర్ కూడా ఒకే రోజు హీరోగా.. విలన్ గా అలరించాడు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా..? ఆయన నటించిన సివరపల్లి వెబ్ సిరీస్, గాంధీ తాత చెట్టు సినిమా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాల్లో వైవిధ్యభరితమైన నటనతో ఆకట్టుకున్నాడు రాగ్ మయూర్. ఆ మూవీస్ విశేషాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ప్రస్తుతం టాలీవుడ్ లో యువనటుడు రాగ్ మయూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. "సినిమా బండి"తో మొదలైన రాగ్ మయూర్ ప్రస్థానం అంచలంచెలుగా సాగుతోంది. తాజాగా రిలీజైన "సివరపల్లి" వెబ్ సిరీస్ లో ఆయన హీరోగా మెరిశారు. "పంచాయత్" అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా తెలుగులో "సివరపల్లి" అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇది రీమేక్ అయినా.. ఎక్కడా హిందీ సీన్లు రిపీట్ కాకుండా జాగ్రత్తగా తీశారు. తెలంగాణలో ఓ పల్లెలో జరిగిన కథగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాల్సిన ఓ యువకుడు పంచాయతీ కార్యదర్శిగా మారితే..? సివరపల్లి అనే గ్రామంలో ఆ యువకుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేదే కథ. ఈ వెబ్ సిరీస్ లో పంచాయతీ కార్యదర్శిగా రాగ్ మయూర్ నటన ఆకట్టుకుంది. ఆయన చాలా సహజంగా నటించి నవ్వులు పూయించాడు.
ఇక అదే రోజు "గాంధీ తాత చెట్టు" మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలోనూ రాగ్ మయూర్ గ్రే క్యారెక్టర్ తో మెప్పించాడు. ఇండస్ట్రీయలిస్ట్ గా రాగ్ మయూర్ నటన అందర్నీ ఆకట్టుకుంది. మూవీలో ఆయన నిడివి తక్కువే అయినా క్లైమాక్స్ లో ఆయన సీన్స్ ఉండటంతో బాగా ప్లస్ అయింది. ఇలా ఒకేరోజు రిలీజైన సినిమాల్లో భిన్న పాత్రలతో రాగ్ మయూర్ అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాగ్ మయూర్ ఓ మూవీ చేస్తున్నారు. దీనితోపాటు "పరదా", "గరివిడి లక్ష్మీ" సినిమాలూ చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications