ఓటీటీలో సత్తా చాటుతున్న ‘డార్క్ సీక్రెట్స్’.. అమెజాన్ ప్రైమ్ కొనుగోళ్ల జాబితాలో నంబర్ 1 స్థానం
ఒక్కప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లలో సరైన ఆదరణ దక్కడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ విప్లవంతో కథాబలమున్న చిత్రాలకు ఓటీటీల రూపంలో రాజమార్గం సుగమమైంది. ఆ దిశగా వచ్చిన సరికొత్త ప్రయోగమే తెలుగు ఆంథాలజీ చిత్రం 'డార్క్ సీక్రెట్స్'. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లోని "Top 10 Purchases in India" జాబితాలో ఈ సినిమా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాన్-ఇండియా సినిమాల హోరాహోరీ పోటీ మధ్య ఒక చిన్న తెలుగు చిత్రం అత్యధిక కొనుగోళ్లు సాధించి అగ్రస్థానంలో నిలవడం ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరుస్తోంది.
కథలోని అసలు మర్మమేంటి?
"పైకి సాధారణంగా కనిపించే ప్రతి మనిషి లోపల ఎవరికీ చెప్పలేని ఓ చీకటి రహస్యం దాగి ఉంటుంది. ఒకవేళ ఆ గుట్టు రట్టయితే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి?" అనే ఆలోచన నుంచే ఈ చిత్రం పుట్టుకొచ్చింది. మానవ మనస్తత్వం, అనుబంధాల్లోని సంక్లిష్టతలు, నిషేధిత భావోద్వేగాలు, ఒంటరితనం, సామాజిక ఒత్తిళ్లను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కించిన సస్పెన్స్ డ్రామా ఇది. ఇందులో ప్రతి కథా వేర్వేరు పాత్రలు, సందర్బాలతో సాగుతూనే.. విధి ఆడే విచిత్రమైన ఆటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.

ప్రతిభ చాటిన సాంకేతిక బృందం
దర్శకుడు అవినాష్ కొకటి విభిన్న భావోద్వేగాలున్న కథలను ఒకే థీమ్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది. 'టచ్‌వుడ్ టేల్స్' బ్యానర్‌పై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం కంటెంట్‌ను మాత్రమే నమ్ముకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ ప్రధాన పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ సినిమాపై విస్తృతమైన చర్చ జరుగుతుండటంతో వీక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కథాబలం ఉంటే చిన్న సినిమాలకు సైతం ఓటీటీలు ఏ స్థాయి గుర్తింపును ఇస్తాయో 'డార్క్ సీక్రెట్స్' సాధించిన ఈ అరుదైన ఘనతే నిదర్శనం.














Click it and Unblock the Notifications