కలెక్షన్ల జాతర.. అన్ని రికార్డులూ పాతర.. 6 రోజుల్లో ఏకంగా..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదలైన ఈ దృశ్య కావ్యం విడుదలైన కేవలం 6 రోజుల్లోనే రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లను అందుకున్న రామాయణ మూవీ.. రెండో వారంలోనూ అదే జోరును కొనసాగించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రామాయణం కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ నాటికి రూ. 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను సునాయాసంగా అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ లో ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా 'బాహుబలి 2', 'ధురంధర్ 2', 'పుష్ప 2' ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా 'దంగల్' ఉంది. రామాయణ మూవీ వాటి రికార్డులను బ్రేక్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. రామాయణ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవాలంటే రూ. 2వేల నుంచి రూ. 2,500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఇప్పటి వరకూ సాధించిన వసూళ్ల కంటే మరో రూ. 1500 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఇదే జోరును కొనసాగిస్తుందా..? లేక రానున్న రోజుల్లో డౌన్ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇక రామాయణ మూవీకి తెలుగులో పెద్దగా ఆదరణ లేదని స్పష్టం అవుతోంది. ఈ మూవీకి తెలుగులో ఇప్పటివరకూ రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నార్త్ లో మాత్రం రామాయణ మూవీకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ హిందీ బెల్ట్, ఓవర్సీస్ లో దుమ్మురేపుతోంది. రామాయణ మూవీలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించారు. సీతగా సాయి పల్లవి నటించారు. ఇక రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడి క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు. అలాగే లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించారు. అలాగే డీఎన్ ఈజీ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చేపట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఫ్రైమ్ స్టూడియోస్, మాన్ స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందనున్న రెండో భాగాన్ని మేకర్స్ వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
