ప్రాధాన్యతా ప్రాజెక్టులు, డెడ్ లైన్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు..!!
రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్‌కు పునరుద్ధరణ పరిధిలో ఉన్న 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులన్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను పరిశీలించి, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
ఏపీలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో 789 ఎత్తి పోతల పథకాల పునరుద్ధరణకు రూ.632.07 కోట్లు అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. వీటి పునరుద్ధరణ ద్వారా 7.49 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటి సదుపాయం కల్పించవచ్చని తెలిపారు. ఇక ఎత్తిపోతల పథకాల నిర్వహణకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణ బాధ్యతను జలహారతి కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జలవనరుల శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న 5,565 ఎకరాల భూమిలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 4,061 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 877.3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో 84 ప్రాంతాలను గుర్తించగా, వాటిలో 110 ఎకరాలను సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టుల పూర్తి పై మార్గనిర్దేశం
కాగా.. దీని ద్వారా 25.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. మొత్తంగా 4,171 ఎకరాల భూమిని సౌర విద్యుత్ ప్లాంట్లకు వినియోగించడం ద్వారా 903.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు వివరించారు. కేవలం భూములకే పరిమితం కాకుండా కాలువలపై కూడా సౌర విద్యుత్, జలవిద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలోనే జలవనరుల రంగంలోనూ వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా తీసుకున్న 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన సీఎం... నిర్దేశించుకున్న గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.













Click it and Unblock the Notifications
