తెలంగాణలో ఎన్నికలు జరిగితే-ఎవరికి ఎన్ని సీట్లు ? పోల్ ట్రాకర్ తాజా సర్వే..!
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోపు రాష్ట్రంలో రాజకీయం ఎలా మారుతోంది?, కాంగ్రెస్ పరిస్ధితి ఏంటి? బీఆర్ఎస్ పుంజుకుందా ? భారీ ఆశలతో ఉన్న బీజేపీని ప్రజలు ఆదరిస్తారా? ఇలా పలు చర్చల మధ్య పోల్ ట్రాకర్ సంస్థ తన తాజా సర్వే రిపోర్ట్ ను (Poll Tracker Survey) విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశాన్ని ఈ సర్వేలో అంచనా వేసింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని పోల్ ట్రాకర్ అంచనా వేస్తోంది. అసెంబ్లీలోని 119 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 68 సీట్లు గెల్చుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపింది. విపక్ష బీఆర్ఎస్ 31 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. అలాగే బీజేపీకి 12 సీట్లు, ఎంఐఎంకు 7 సీట్లు లభిస్తాయని తన సర్వే నివేదికలో తెలిపింది. అలాగే ఈ ఫలితాల వెనుక కారణాలను కూడా పోల్ ట్రాకర్ సంస్ధ వెల్లడించింది.

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు బాగా పనిచేస్తున్నట్లు పోల్ ట్రాకర్ తెలిపింది. ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలు, పేద కుటుంబాలకు ఇవి ఉపయోగపడుతున్నట్లు తెలిపింది. అలాగే పట్టణాల్లో చూస్తే హైదరాబాద్ లో చెరువుల రక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు, మహిళలకు ఉచిత బస్సు పథకం, తెలంగాణ రైజింగ్ కార్యక్రమాలు ప్రభుత్వ ఇమేజ్ పెంచినట్లు చెబుతోంది. విపక్ష బీఆర్ఎస్ విషయానికొస్తే.. కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండిపోవడం ఓటర్లలో అసంతృప్తిని పెంచుతున్నట్లు విశ్లేషించింది. దీని వల్ల ఓటర్లలో బీఆర్ఎస్ గతంలోలా దూసుకుపోలేకపోతోందని తెలిపింది.












Click it and Unblock the Notifications
