స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల రద్దు- ఈ విద్యా సంవత్సరం అంతా..!
ఏపీలో ఈ మధ్య వరుస తుఫానులు బీభత్సం సృష్టించాయి. తుఫానుల ధాటికి సూళ్లకు అసాధారణంగా సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పాఠశాలలు ఏటా పనిచేయాల్సిన పని దినాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు రెండో శనివారాల సెలవుల్ని విద్యాశాఖ అధికారులు రద్దు చేస్తున్నారు. వరుసగా ఐదు నెలల పాటు ప్రతీ నెలా రెండో శనివారాలు రద్దు చేస్తూ పలు జిల్లాల్లో విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోనూ స్కూళ్లకు (Srikakulam Schools) రెండో శనివారం సెలవులు రద్దు చేసారు.
అర్నబ్ తుఫాన్ బారిన పడిన శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు ఈ నెల నుంచి మార్చి వరకూ రెండో శనివారాల సెలవును రద్దు చేస్తూ విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాన్, భారీ వర్షాల కారణంగా ఈ మధ్య ప్రకటించిన సెలవులకు బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఏయే తేదీల్లో ప్రకటించిన సెలవులకు పరిహారంగా ఏయే రెండో శనివారాల సెలవుల్ని రద్దు చేస్తున్నారో జాబితా కూడా విడుదల చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 23, 24, అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. వీటికి బదులుగా ఇప్పుడు ఈనెల రెండో శనివారమైన 14వ తేదీన పాఠశాలలు పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే డిసెంబర్ 12న కూడా రెండో శనివారం స్కూల్స్ పనిచేయాలని ఆదేశించారు. జనవరిలో మాత్రం రెండో శనివారం సంక్రాంతి సెలవుల్లోకి రావడంతో దాన్ని వదిలేశారు. ఇక ఫిబ్రవరి 13, మార్చి 13వ తేదీల్లో వచ్చే రెండో శనివారాల్ని సైతం ఇలా సెలవు రద్దు చేశారు. చివరిగా ఐదో సెలవు దినాన్ని ఏప్రిల్ లో ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు సహా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు.














Click it and Unblock the Notifications
