50 దేశాలు.. 1,750 కంపెనీలు.. 10 లక్షల మంది! భారత్‌లోనే గ్లోబల్ ఆటో షో!
భారత్‌ను గ్లోబల్ ఆటోమొబైల్, మోబిలిటీ తయారీ రంగానికి ప్రపంచ కేంద్రంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. ఢిల్లీలోని భారత్ మండపం, ద్వారకలోని యశోభూమి వేదికలుగా 'భారత్ మోబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2027' మూడో ఎడిషన్‌ను 2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 'స్మార్టర్ మోబిలిటీ ఫర్ బెటర్ టుమారో' అనే స్పెషల్ థీమ్‌తో ఈ అంతర్జాతీయ ఆటో ప్రదర్శన జరగనుంది.
1,750కి పైగా ఎగ్జిబిటర్లు.. 10 లక్షల మంది సందర్శకులు!
ఈ ప్రపంచ స్థాయి ఆటో ప్రదర్శనలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ తైవాన్ సహా 50కి పైగా దేశాల నుంచి దాదాపు 1,750కి పైగా ఆటోమొబైల్ కంపెనీలు, వాహన తయారీదారులు, టెక్నాలజీ దిగ్గజాలు, పెట్టుబడిదారులు పాల్గొననున్నారు. సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విశాలమైన విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రదర్శనకు 10 లక్షల మందికి పైగా సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భారత్ మండపంలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు, యశోభూమిలో ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

ఒకే వేదికపై 11 ప్రత్యేక ప్రదర్శనలు
కేవలం కార్లు, బైకులకే పరిమితం కాకుండా ఆటోమొబైల్ రంగానికి చెందిన వివిధ విభాగాలను కలుపుతూ మొత్తం 11 షోలను ఒకేసారి నిర్వహించనున్నారు. వీటిలో ఆటో ఎక్స్పో-మోటార్ షో, ఇండియా ఇంటర్నేషనల్ టైర్ షో, భారత్ బ్యాటరీ షో, ఇండియా సైకిల్ షో, మోబిలిటీ టెక్ పవిలియన్, స్టీల్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్ పవిలియన్, కంపోనెంట్స్ అండ్ టెక్నాలజీ షోలతో పాటు కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, అగ్ని మోబిలిటీ, ఎయిర్ మోబిలిటీ, మాస్ ట్రాన్సిట్ ఎక్స్‌పోలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
గ్లోబల్ మార్కెట్‌పై భారత్ దృష్టి: పీయూష్ గోయల్
ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఈ మహోత్సవం ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ తన సత్తా చాటుకోవడానికి ఓ సువర్ణావకాశమని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోకు వచ్చే 10 లక్షల మందిలో కనీసం 25,000 మంది అంతర్జాతీయ సందర్శకులు ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. భారత ఎగుమతుల వృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం దిశగా దేశం పయనిస్తోందని, తొలి ఆరు నెలల్లోనే 480 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయని వెల్లడించారు. యూరప్ యూనియన్‌తో పాటు పలు ఇతర దేశాలతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాల ద్వారా త్వరలోనే భారతీయ కంపెనీలకు ప్రపంచ జీడీపీలో 75 శాతానికి పైగా ఉన్న మార్కెట్లలో ప్రాధాన్యత లభిస్తుందని వివరించారు. దేశీయంగా ఏటా ఒక కోటి ప్యాసింజర్ వాహనాల విక్రయ లక్ష్యాన్ని ఆటోమొబైల్ రంగం నిర్దేశించుకోవాలని ఆయన సూచించారు.













Click it and Unblock the Notifications
