నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !!
నేషనల్ క్రష్ "రష్మిక మందన్నా".. స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్స్‌తో దూసుకుపోతుంది. తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగులో నాగశౌర్యతో చేసిన 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' చిత్రం ఆమెకు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది.
అలానే రణబీర్ కపూర్ సరసన నటించిన 'యానిమల్', విక్కీ కౌశల్ తో చేసిన 'ఛావా' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది. అలానే సల్మాన్ ఖాన్ తో చేసిన 'సికందర్' ప్రేక్షకులను నిరాశ పరిచింది. రీసెంట్ గానే ఆమె నటించిన 'కుబేరా', 'థామా' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి.

మొత్తానికి భాషతో సంబంధం లేకుండా నెలకి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇన్నాళ్లు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో సత్తా చాటిన ఆమె.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటుతూ సరికొత్త చరిత్ర సృష్టించింది.
కాగా జపాన్ వేదికగా ప్రతిష్టాత్మక 'క్రంచీరోల్ యానిమే అవార్డ్స్' నిర్వహించనున్నారు. అయితే వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా ఎంపికై ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రష్మిక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల వేడుక మే 23న టోక్యోలో అంగరంగ వైభవంగా జరగనుంది. 2024లో కూడా రష్మిక ఈ వేదికపై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరోసారి హాలీవుడ్ దిగ్గజాలతో కలిసి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.
ఇక రష్మిక ప్రస్తుతం మైసా, రణబాలి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు గత ఫిబ్రవరి నెలలో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications