జేబులో రూ.25 వేలు తీసుకెళ్లొచ్చు! భారత కరెన్సీకి బిగ్ రిలీఫ్..
సరిహద్దులు దాటి నేపాల్ వెళ్లే భారతీయ పర్యాటకులకు, అలాగే వ్యాపార నిమిత్తం భారత్‌కు వచ్చి వెళ్లే నేపాల్ పౌరులకు ఆ దేశ కేంద్ర బ్యాంక్ భారీ ఊరటనిచ్చింది. ఇరుదేశాల మధ్య నిత్యం సాగే ప్రయాణాలు, వ్యాపార లావాదేవీలను మరింత సులభతరం చేసేలా కరెన్సీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
చేతిలో రూ.25 వేల వరకు తీసుకెళ్లొచ్చు!
కొత్త నిబంధనల ప్రకారం.. భారత్, నేపాల్ పౌరులు ఎవరైనా సరే తమ వెంట గరిష్టంగా 25,000 రూపాయల వరకు భారత కరెన్సీని నేపాల్‌లోకి తీసుకెళ్లడానికి లేదా అక్కడ నుంచి బయటకు తీసుకురావడానికి అనుమతి లభించింది. 2016 నవంబర్ 9 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ.200, రూ.500 నోట్లకు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుంది. ఇకపై సరిహద్దుల్లో నోట్ల విషయమై ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

ఆ పాత పెద్ద నోట్లపై మాత్రం ఆంక్షలు యథాతథం
ఈ సడలింపులు కొత్త నోట్లకు మాత్రమే వర్తిస్తాయని నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (NRB) స్పష్టం చేసింది. 2016 నవంబర్ 9న భారత ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్లను నేపాల్‌లోకి తీసుకురావడంపై ఉన్న నిషేధం యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. పాత పెద్ద నోట్లను తీసుకువస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
మూడో దేశానికి తీసుకెళ్తే కుదరదు!
నేపాల్ పౌరులకు సంబంధించి ఈ నిబంధనలో ఒక చిన్న షరతు విధించారు. నేపాల్ వాసులు కేవలం భారతదేశం నుంచి మాత్రమే ఈ ఇండియన్ కరెన్సీని తమ దేశానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా, నేపాల్ నుంచి ఇతర మూడో దేశానికి (థర్డ్ కంట్రీ) వెళ్లేటప్పుడు ఈ భారతీయ రూపాయిలను వెంట తీసుకెళ్లడానికి వీలులేదు. ఈ లావాదేవీలు కేవలం భారత్-నేపాల్ సరిహద్దు వ్యాపారానికి, ప్రయాణాలకు మాత్రమే పరిమితం.
పర్యాటక రంగానికి, సరిహద్దు వ్యాపారానికి బూస్ట్
ఈ నిర్ణయం వల్ల భారత్ నుంచి నేపాల్ వెళ్లే వేలాది మంది టూరిస్టులకు, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం భారత్‌లో ఉండే నేపాల్ వాసులకు ఎంతో మేలు జరుగుతుందని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అధికార ప్రతినిధి గురు ప్రసాద్ పౌడేల్ తెలిపారు. అలాగే ఇరుదేశాల మధ్య ఓపెన్ బోర్డర్ ఉండటం, వ్యాపార సంబంధాలు బలంగా ఉండటంతో ఈ కరెన్సీ సడలింపులు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరింత ఊతాన్నిస్తాయని భావిస్తున్నారు.
డాలర్ల మార్పిడికి కూడా క్లారిటీ
మరోవైపు విదేశీ కరెన్సీకి సంబంధించి కూడా నేపాల్ ప్రభుత్వం నిబంధనలను స్పష్టం చేసింది. ఇతర విదేశీ కరెన్సీ లేదా డాలర్లను వెంట తెచ్చుకునేవారు 5,000 అమెరికన్ డాలర్ల (లేదా దానికి సమానమైన ఇతర కరెన్సీ) వరకు ఎలాంటి కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా నేపాల్‌లోకి తెచ్చుకోవచ్చు. ఆ పరిమితి దాటితే మాత్రం విమానాశ్రయం లేదా బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications