విజయ్ సేతుపతి 'స్లమ్ డాగ్' గ్లింప్స్ రిలీజ్.. పూరి జగన్నాథ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే..!!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరు పూరి జగన్నాథ్. పూరి సినిమా వస్తుందంటే అప్పట్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉండేది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తన సొంత టాలెంట్ తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ ఇలా ప్రతి స్టార్ హీరో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఆరాటపడుతుంటారు. మహేష్ బాబుతో పోకిరి సినిమా తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత దేశముదురు, చిరుత లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తీశారు. ఆ తర్వాత బిజినెస్ మాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్, లైగర్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. కానీ డబుల్ ఇస్మార్ట్, లైగర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే తాజాగా పూరి జగన్నాథ్ 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే సినిమా చేస్తున్నారు.
'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' మూవీలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి కాంబోలో సినిమా కావడంతో మూవీపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. స్లమ్ డాగ్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహబ్.. జుబైదా అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జుబైదాగా జరీనా వహాబ్ అంటూ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తి రేపుతోంది. మొత్తం ఒక నిమిషం 17 సెకన్ల పాటు రన్ టైమ్ ఉన్న ఈ గ్లింప్స్ పూర్తిగా ఎమోషనల్ గా సాగింది. ఒక్కో డైలాగ్ లో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.

నాంపల్లి స్టేషన్ కు వెళ్లి రైలు కింద తల పెట్టి చచ్చిపోదాం అనుకున్నాను.. కానీ ధైర్యం సరిపోలేదు.. అనే పవర్ ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆకలి ముందు అన్నీ ఓడిపోతాయి రా.. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద.. అన్నీ మంటగలిసిపోతాయి.. కానీ బేటా.. ఆకలి ప్రాణాలను తోడేస్తుంటే నాకు తెలియకుండానే నా చేతులు అడుక్కోవడం మొదలు పెట్టాయి. అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు అనే డైలాగ్ చివరగా పూరి జగన్నాథ్ చెప్పారు. మొత్తానికి గ్లింప్స్ పూర్తి ఎమోషనల్ గా సాగింది. ఈ మూవీ త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కానీ రిలీజ్ డేట్ ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications
