తిరుమలలో శ్రీనివాసుడు మొదటగా కాలు మోపిన చోట అరుదైన ఘట్టం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. శనివారం నాడు 84,488 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 37,061 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.78 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.28 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.74 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,789 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

కాగా.. తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆదివారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక స్వాములు ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల మధ్య ఆలయ మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు.
అనంతరం శ్రీవారి పాదాలకు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో గాలుల తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. వీటి నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications