జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఎన్టీఆర్ మనవడు కాదు: టీడీపీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించిన తర్వాత తిరిగి రాజకీయాలవైపు తొంగిచూడలేదు. కాలక్రమేణా ఆ పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబుకు, ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరం జరిగారు. ప్రస్తుతం బాలకృష్ణ ఓవైపు, ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ మరోవైపు నిలిచారు. ఒకరకంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. తన అన్న కోసం కల్యాణ్ రామ్ కూడా ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు దూరమయ్యారు.
పార్టీ నిలదొక్కుకుందే చంద్రబాబు వల్ల
చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో స్పందించకపోవడం, కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటి తన అనుచరులను అదుపులో పెట్టకపోవడంలాంటివన్నీ పార్టీకి, తారక్ కు మధ్య భారీగా అంతరాన్ని పెంచాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న తారక్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, బాలయ్యతోపాటు దేవాన్ష్ నాయకత్వంలోనైనా పనిచేస్తాకానీ జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో మాత్రం పనిచేయనని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకుందే చంద్రబాబువల్ల అని, ప్రస్తుతం పార్టీకి ఇంత ఊపు తీసుకురావడానికి కారణం నారా లోకేష్ అని బుద్ధా వెంకన్న అన్నారు.

ఎన్టీఆర్ కు చాలామంది ఉన్నారు
జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఎన్టీఆర్ మనవడు కాదని, ఆయనకు చాలామంది మనవళ్లు ఉన్నారని బుద్ధా వెంకన్న అన్నారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీ కోసం తారక్ పనిచేశాడని, అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని గుర్తుచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడు జూనియర్ అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీయే ఎన్టీఆర్ ను కావాలనే దూరం పెట్టిందని, చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యుల కోసమే క్రమేణా తారక్ ను దూరంగా జరుపుతూ వచ్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications