అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే!... సినీ ఇండస్ట్రీ తీరు
తెలంగాణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంతపై చేసిన వ్యాఖ్యలు క్షమించరానవి. దీనిపై పరిశ్రమ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతి ఒక్కరూ సురేఖపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకు సురేఖ సమంతను క్షమించని అడిగి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించింది. అయినప్పటికీ ఆమెపై విమర్శల దాడి మాత్రం ఆగడంలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఏమిటనేది తెలియరావడంలేదు.
తగిన గౌరవం కూడా ఇవ్వలేదు
ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి కోసం సినీ పెద్దలంతా కలిసి జగన్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో చిరంజీవికి జరిగిన అవమానం సంగతి తెలిసిందే. జగన్ ప్రవర్తించిన తీరు అభ్యంతకరంగా ఉండటంతోపాటు చిరంజీవి పెట్టిన నమస్కారాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయనకు గౌరవం ఇవ్వకుండా పంపించారు. వారిచ్చిన వినతిపత్రాన్ని బుట్టదాఖలు చేశారు. ఆ సమయంలో సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా ఖండించలేదు. ఒక్కరి నోరు కూడా పెగల్లేదు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలిరావడానికి ప్రధాన కారకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన కుమార్తెపై నిండు సభలో అవమానించడంతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఒక్కరి నోరు పెగల్లేదు
ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇది తప్పు అని ఎవరూ ఖండించలేదు. చంద్రబాబునాయుడు కూడా సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేశారనే విషయాన్ని కూడా సినీ పెద్దలు మరిచిపోయారు. జగన్ అంటే భయం ఉండటంవల్ల మాట్లాడలేదేమో అనుకున్నారు. పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవిని తూలనాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారు. అయినా నోరు పెగల్లేదు. సినీ పరిశ్రమ హైదరాబాద్ లో ఉంది. ఇక్కడ కేసీఆర్ పాలిస్తున్నాడు. థియేటర్లు ఏపీలో ఉన్నాయి.
అక్కడ కేసీఆర్ మిత్రుడు జగన్ ఉన్నాడు. ఇద్దరికీ కోపం రాకుండా చూసుకోవడానికి స్పందించాల్సిన సమయంలో కూడా స్పందించలేదు. అప్పుడు తెరవని నోళ్లు ఇప్పుడు తెరుస్తున్నాయి. సురేఖ వ్యాఖ్యలు క్షమించరానివే అయినప్పటికీ సందర్భాన్ని బట్టి సినీ పెద్దలు స్పందిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి స్వేచ్ఛగా మాట్లాడగలిగే అవకాశం ఉంది. ఆరోజు అటువంటి స్వేచ్ఛ లేదుగా.












Click it and Unblock the Notifications