టాలీవుడ్‌లో 8 వారాల ఓటీటీ రూల్?
టాలీవుడ్ థియేటర్ల భవిష్యత్తును మార్చే దిశగా నేడు సినీ పరిశ్రమలో ఓ కీలక అడుగు పడింది. ఓటీటీ విడుదలకు సంబంధించి గత కొంతకాలంగా సాగుతున్న చర్చలపై నేడు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ కీలక సమావేశం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ యజమానులు, డిస్ట్రీబ్యూటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సినిమాలో త్వరగా ఓటీటీలో విడుదల కావడం. సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ విడుదలకు మధ్య గ్యాప్‌ను పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
సురేష్ బాబు నేతృత్వంలో ప్రత్యేక కమిటీ:
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. నేడు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ కమిటీ సమావేశమై ఓటీటీ విడుదల గడువుపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోపే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి.థియేటర్ బిజినెస్‌ను కాపాడుకోవడానికి ఈ గడువును 6 నుండి 8 వారాలకు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నారు.

కొత్త సినిమాలకే ఈ రూల్?
ఈ సమావేశంలో వచ్చిన ప్రధాన ప్రతిపాదనల ప్రకారం.. ఇకపై షూటింగ్ ప్రారంభం కాబోయే కొత్త సినిమాలకు ఈ '8 వారాల రూల్' వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల్లో "సినిమా ఓటీటీలోకి రావడానికి చాలా సమయం పడుతుంది" అనే భావన కలిగి, వారు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే..
అయితే ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఓటీటీ సంస్థలతో కుదుర్చుకున్న పాత ఒప్పందాలు, నిర్మాతల ప్రయోజనాలు, డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను బేరీజు వేస్తూ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. వచ్చే కొన్ని వారాల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించి.. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక స్పష్టమైన పాలసీని ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications