విధ్వంసం: 'దేవర' అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు? పంపిందెవరు?
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటిస్తుండటంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దీన్ని తట్టుకోవడం సినిమా యూనిట్ కే కష్టమవుతోంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు పోటెత్తడంతో నిర్వాహకులు వేడుకను రద్దు చేశారు.
రూ.33 లక్షల నష్టం
వేడుక రద్దవడంతో నోవాటెల్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. తోపులాట జరగడంతో హోటల్ అద్దాలు పగిలిపోయాయి. జరిగిన నష్టాన్ని తమకు చెల్లించాలంటూ హోటల్ యాజమాన్యం దేవర నిర్మాతలను కోరింది. రూ.33 లక్షల నష్టం వాటిల్లినట్లు లెక్క కట్టిన హోటల్ యాజమాన్యం అంత కట్టాల్సిందేనని భీష్మించుక్కూర్చుంది. ధ్వంసమైన కుర్చీలకే రూ.7 లక్షలైంది. వీటితోపాటు ఎలివేటర్ గ్లాస్, తలుపులు, మెయిన్ గ్లాస్ ఒకటి ధ్వంసమైంది. అయితే బిల్లును తగ్గించాలంటూ నిర్మాతలను హోటల్ యాజమాన్యాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

రద్దు వెనక ఉంది ఎవరు?
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనక ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. హోటల్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అంతమంది అభిమానులు తరలివస్తారని నిర్వాహకులు ఊహించలేకపోయారా? అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి అభిమానులైతే వేడుక రద్దయిందంటే సైలెంట్ గా వెళ్లిపోతారు. అలా కాకుండా విధ్వంసానికి తెగబడ్డారంటే వారు అభిమానులు కాదని, అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు హోటల్ లోకి ప్రవేశించాయని తెలుస్తోంది. ఇలా ముందస్తు ప్రణాళిక ప్రకారమే వీరంతా వచ్చారా? వీరి వెనక ఎవరు ఉన్నారు? ఇలా చేయాలని ఎవరైనా ముందస్తుగా ఆదేశాలిచ్చారా? ఈవెంట్ జరగకుండా ఉంటే ఎవరికి లాభం?.. తదితర ప్రశ్నలకు నిర్మాతలు సమాధానాలు వెతుకుతున్నారు. హీరో, నిర్మాతలు, దర్శకుడి అంతరంగిక చర్చల్లో దీన్నిగురించే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులను ఆశ్రయించాలా? లేదంటే హోటల్ యాజమాన్యానికి డబ్బులు చెల్లించి ఇంతటితో వదిలేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications