వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పత్రికా స్వేచ్ఛకు బాసట -నగ్నమునిరాజకీయ నాటకరంగంలో యిటీవల కొత్త అంకానికి తెరలేచింది. వివరాలలోకి వెళ్లే ముందు గతంలోకి వెళ్లి వర్తమానంలోకి వస్తాను.భారతదేశమంటే ఒకప్పుడు పాశ్చాత్యులు అనాగరిక దేశంగా, అడవులతో, విషసర్పాలతో, పులులు, సింహాలు వంటి క్రూర మృగాలు సంచరించే దేశంగా భావించేవాళ్లు. ఇది మొదటి దశ.బ్రిటిషువారు ఆక్రమించి పరిపాలన పగ్గాలు చేపట్టినప్పుడు భారతదేశమంటే కులాల దేశంగా పేర్కొనేవాళ్లు. దీనివల్ల, తమ సామ్రాజ్యం నిరాటంకంగా కొనసాగడానికి, తమ ప్రభావం గాఢంగా వ్యాపించడానికి భారత సమాజాన్ని ఏకం కాకుండా ఆరని చిచ్చురేపి, విభజించి పాలించడానికి కొత్త వ్యూహాలు రచించవలసిన అవసరం లేదని వాళ్లకు తెలిసిపోయింది. ఎవరూ భారతీయుల్ని చీల్చవలసిన అవసరం లేదు. వీళ్లకు వీళ్లే తమను తాము కులాలుగా ఎప్పుడో చీల్చుకున్నారు. ఈ విధంగా తమను తామే తింటూ బతికే సంస్కృతి ఈ దేశ, సమాజ దేహంలోనే వుంది. అంటే, స్వీయ దేహభక్షక సంస్కృతి అన్న మాట. అంటే తన శరీరాన్ని తానే తింటూ బతకడమన్నమాట. ఇక్కడ మనం చెప్పుకునే అభివృద్ధి అనే దానిలోనే యీ లక్షణం వుంది. పాలకులు పాలితులను భక్షిస్తూ పరిపాలిస్తున్నామంటూ అంటుంటారు. అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామంటూ వుంటారు. దీనివల్ల బ్రిటిషువారు రాజ్యంపైనే గాక, సమాజంపై పట్టు సాధించడానికి ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా పోయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే పాలితులను పీల్చి పిప్పి చెయ్యడం సులభమైంది. ఇది రెండవ దశ.ఈ లక్షణాలతో ఎటువంటి మార్పూ తీసుకురాకుండా, దానికి వుద్దేశించకుండా మనం స్వాతంత్య్రం సాధించాం. స్వపరిపాలన ప్రవహసనం యథాతధంగా ప్రారంభించాం. పాలకుల మనస్తత్వంతో పాలకులు, బానిస మనస్తత్వంతో పాలితులతో పాలన ప్రారంభమైందన్నమాట. దీనివల్ల, ముక్కలు ముక్కలుగా చీలి వున్న సమాజం, స్వీయదేహ భక్షణా సంస్కృతి అలాగే కొనసాగాయి. ఇది మూడవ దశ. స్వీయ దేహ భక్షణకు ఆయా కాలాల్లో పదాలు మాత్రం మారాయి. సారం మాత్రం ఒకటే. సమాజం నుంచి రాజ్యం పుడుతూ, సమాజాన్ని తింటూ మనుగడ సాగించడమన్నమాట. ఈ భావనల నేపథ్యంలోంచి చూస్తే యివాళ భారతదేశమంటే అనాగరిక, క్రూర జంతువుల దేశంగా మాత్రమే గాక, కుంభకోణాల దేశంగా మారింది.స్వీయ దేహ భక్షణా లక్షణం వల్ల పేదలు మరింత పేదలవుతారు. ధనికులు పాలకవర్గంలో భాగమై మరింత ధనికులవుతారు. ఈ ప్రక్రియ ఒకప్పుడు చాప కింద నీరులా నెమ్మదిగా జరిగేది. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన అవిష్కరణల వల్ల యీ రాక్షస దోపిడీ వేగంగా జరిగే పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభుత్వ ఖజానాను పట్టపగలు కొల్లగొట్టడానికి దగ్గరదారే కుంభకోణం. ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రజాధనాన్ని, సంపదను రాచమార్గంలో దొంగిలించే పనే కుంభకోణం.మన రాష్ట్రంలో తాజా వుదాహరణ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సందర్భం. టౌన్‌షిప్పులు, హార్డ్‌వేర్‌ పార్కు, విస్తరణ మొదలైన సాంకేతిక సాకులు చూపించి పంట చేలపైకి, సన్నకారు చిన్నకారు రైతుల పైకి, పల్లె సీమల జనావాసాలపైకి, పాలకవర్గంలోని పెద్దలు కంబంధ హస్తాలతో దూకి, మొదట అభివృద్ధి మంత్రంతో భూసేకరణ నోటీసులు ఇచ్చి, భయపెట్టి, మధ్యలో కొందరు ప్రవేశించి అతి తక్కువ ధరకు భూములను కొని, ఆ తర్వాత భూసేకరణ నోటీసులు వుపసంహరించి, అలైన్‌మెంట్లు మార్చి కోట్లకు కోట్లు దుండుకోవడం జరిగింది.దీనిని పత్రికలు సర్వే నెంబర్లు, పేర్లతో సహా అన్ని వివరాలతో వార్తలు ప్రచురించడం జరిగింది. ఇందులో ప్రధాన పాత్రధారులు పాలకవర్గానికి చెందినవారిగా, జరిగిన తతంగమంతా వివరించడం జరిగింది. ఈ విషయంలో ఒకానొక పత్రిక ఎక్కువ వివరాల్తో ఎక్కువ నిశితంగా ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వివరాలు మొత్తం రాష్ట్రంలో గగ్గోలు పుట్టించే స్థాయిలో వున్నాయి. వాస్తవాలు అనుకున్నవి వూహించలేనంత స్థాయిలో వున్నాయి. రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది.ఇటువంటి సమయంలో పాలకవర్గం వారు తమకు యీ కుంభకోణంతో ఎలా సంబంధం లేదో ప్రజలకు చెప్పవలసి వుంటుంది. పత్రికల ద్వారా పూర్తిగా వివరాల్తో ప్రముఖులను, అన్ని పార్టీలకు చెందినవారిని ఆ ప్రాంతానికి తీసికెళ్లిగాని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి తద్వారా గాని, ఏ పద్ధతిలోనైనా సరే అత్యంత శీఘ్రంగా తాము చేసిన దాంట్లోని న్యాయాన్ని, తమకు ప్రజాధనం కాపాడే విషయంలో వున్న బాధ్యత, నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి. ఆయా పత్రికల రాతల్లో దాగి వున్న దుర్మార్గాన్ని వాస్తవాలతో బట్టబయలు చెయ్యవలసి వుంటుంది. ప్రజాస్వామికంగా అన్ని పద్ధతుల్లో సత్యాన్ని ప్రజల ముందుకు తీసికెళ్లడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఎక్కడయినా, ఏదయినా తప్పు జరిగి వుంటే దానిని సరిదిద్ది, యీ కుంభకోణం అనే దానివల్ల దెబ్బ తిన్నారనుకుంటున్న సామాన్యులకు బాసటగా నిలబడవలసి వుంటుంది.కాని, పాలకవర్గం వారు అటువంటి ప్రయత్నానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపించదు. పైగా దౌర్జన్యానికి దిగడం జరిగింది. తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి ఆ పత్రిక ప్రతులను తగులబెట్టించడం ఘోరం. ప్రజాస్వామ్యంలో ప్రతివారికీ తమ భావాలను ప్రకటించే స్వేచ్ఛ వుండాలి. దానిని కాపాడడంలో ప్రభుత్వమే ముందు వుండాలి. ఒకవేళ ఆ పత్రిక తప్పుదారిలో, తప్పుడు లక్ష్యంతో వెడుతున్నదనుకుంటే దానిని ప్రజల ముందు నిరూపించాలి.ఈ పత్రిక ఒకానొక మతం విశ్వాసాలను కించపరిచే రాతలు ప్రచురించలేదు. సమాజవర్గాల మధ్య చిచ్చుపెట్టే రచనలు ప్రచురించలేదు. ఈ కుంభకోణం అని పిలువబడే దానిలో సామాన్యులు ఎలా దెబ్బ తిన్నారో, పల్లెసీమలు, పంటపొలాలు ఎలా దొంగమార్గంలో కబళించడం జరిగిందో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా పాలక, ధనిక వర్గాలకు, సామాన్యులకు చెందిన విషయం. దీనివల్ల ప్రభుత్వంపై మచ్చ పడుతున్నప్పుడు అత్యంత సమర్థవంతమైన, నిజాయితీ గల చర్యలు తీసుకుని ప్రజాస్వామికంగా ఈ మొత్తం విషయం సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా పత్రిక ప్రతులు తగులబెట్టడం వంటి దౌర్జన్యపూరిత పద్ధతులు అనుసరించడం తప్పుడు సూచనలు యిచ్చినట్టు అవుతుంది. అన్ని పార్టీలకు, సమాజంలోని అన్ని వర్గాలకు యిదే ఒక వరవడిగా మారే ప్రమాదం వుంది. తద్వారా అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం వుంది. అంటే, ఏ రాజకీయ పార్టీ, ఏ సామాజిక వర్గం ఫలానా పత్రిక, ఫలానా విషయంపై తమకు అనుకూలంగా రాయలేదనుకున్నప్పుడు ఆ పత్రిక ప్రతులను బాహాటంగా తగులబెట్టే దౌర్జన్యానికి పూనుకోవచ్చు. ఇటువంటి తిమిర సంస్కృతి, అనాగరిక సంస్కృతి పెచ్చరిల్లే ప్రమాదం వుంది. ఇది దుష్ట సంప్రదాయం.పాలకవర్గం వారు ముందు దీనిని ఆపుచేయించి, పత్రికా స్వేచ్ఛకు బాసటగా నిలిచి, తమ నిజాయితీని నిరూపించుకోవడానికి తీవ్రంగా కృషి చెయ్యాలి. లేకపోతే పత్రికా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, ప్రజాస్వామ్య విలువలకు అర్థం లేకుండా పోతుంది. ఈ కుంభకోణం ఒక సంఘటన మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. ప్రజాస్వామ్య విలువలను తగులబెట్టవద్దు.

By Staff
|
Google Oneindia TeluguNews

దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X