తెలంగాణకు వైయస్ కొర్రీలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల హైదరాబాదులో ఉంటున్న ఇతర ప్రాంతాలవారెవరూ తరలిపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని వారు కావాలనే విస్మరిస్తున్నారు. కడప, అనంతపురం జిల్లాలకు చెందిన చాలా మంది తమ పెట్టుబడులను బెంగుళూరులో పెట్టారు. అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. జెసి దివాకర్ రెడ్డి వ్యాపారాలన్నీ బెంగుళూరులో ఉన్నాయని, అందుకే అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని అంటున్నారని రాయలసీమకు చెందిన సిపిఐ నాయకుడు రామకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా ప్రజలు కర్ణాటకలో కలవాలని కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. అంటే, రామకృష్ణ మాటల్లో ఏదో మేరకు సత్యం ఉందనే భావించాలి కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బెంగుళూరులో తమ వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తున్నట్లుగానే హైదరాబాదులోనూ కొనసాగించవచ్చుననే విషయాన్ని వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇలా అంగీకరించకపోవడానికి వారి అధిపత్య ధోరణే కారణం. హైదరాబాదులోనూ, తెలంగాణ జిల్లాల్లోనూ ఉంటున్న తెలంగాణేతర ప్రజలు, నాయకులు, వ్యాపారవేత్తలు ఇక్కడి ప్రజలతో కలిసి పోలేదు. ఒక రకంగా ఈ ప్రాంతాన్ని తమ లాభాలకు, ప్రయోజనాలకు వేదికగా మార్చుకున్నారు. దీంతో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజల మధ్య భావ సమైక్యత సాధ్యం కాలేదు. భావ సమైక్యత సాధ్యమై తమంతా తెలుగువారమని, కలిసి ఉండాలనే భావన ఏర్పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండులో ఇది కూడా ఒక ప్రధానాంశం.
ఇకపోతే, రాజశేఖర రెడ్డి తెలంగాణను అడ్డుకోవడానికి మజ్లీస్ ను వాడుకుంటున్నారు. తమ నిర్ణయాన్ని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వీలు లేదని మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓవైసీ జాతీయ భద్రతా మండలి సమావేశంలో చేసిన ప్రసంగ పాఠం ప్రతిని మీడియాకు ఎపి భవన్ నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రభుత్వమే విడుదల చేసింది. దీన్ని బట్టి రాజశేఖర రెడ్డి కుట్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టినవారి అభిప్రాయాలను, ముస్లింలను అభిప్రాయాలను తీసుకుని మాత్రమే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వాదిస్తున్నారు. నిజానికి, ఈ వాదనలో పస లేదు. గతంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఇటువంటి అభిప్రాయాలేవీ తీసుకోలేదు. ఇంతకు ముందు సిపిఎం బూచీని చూపిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మజ్లీస్ ను అడ్డం పెడుతున్నారని అనుకోవాలి. మజ్లీస్ కూడా కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించడానికే సిద్ధపడింది. గతంలో సలావుద్దీన్ ఓవైసీ కాసు బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా నిలిచినట్లుగానే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ రాజశేఖర రెడ్డి పంచన చేరారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వాదిస్తున్నారు. ఆయన మాటల్లో పూర్తి సత్యం ఉంది. అయితే, మజ్లీస్ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ విధంగా వ్యవహరిస్తోందనేది అందరూ ఎరిగిన సత్యమే.
మొత్తంగా, ఇప్పుడు కాంగ్రెస్ సమస్య తెలంగాణకు చుట్టుకుంది. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు అనుకూలంగా వ్యవహరిస్తున్న సమయంలో కాంగ్రెస్ మాత్రమే ఎటూ తేల్చడం లేదు. అలా తేల్చకపోవడం అది వచ్చే ఎన్నికల్లో తగిన ఫలితం అనుభవించక తప్పదు.












Click it and Unblock the Notifications