• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'గ్రేటర్' కెసిఆరే?

By కె నిశాంత్
|

K Chandrasekhar Rao
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు దెబ్బ పడినట్లే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మరుక్షణం నుంచి ఒక విధమైన ఆందోళకరమైన పరిస్థితి నెలకొని ఉంది. దానికితోడు, మెదక్ జిల్లాలోని లక్ష్మీనగర్ లో అసైన్డ్ భూముల కబ్జాపై తెరాస చేపట్టిన ఆందోళన తీరు కూడా తెలంగాణేతర ప్రాంత ప్రజల్లో ఆందోళనాపూరితమైన వాతావరణం చోటు చేసుకుంది. ఇదంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ పై ప్రభావం చూపిన దాఖలాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మందకొడి పోలింగ్ జరగడానికి, పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ఇదొక ప్రధాన కారణం.

కాంగ్రెసు, తెలుగుదేశం, మజ్లీస్ పార్టీలు సెటిలర్ల రక్షణకు పెద్ద యెత్తున హామీ ఇచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లో వారి రక్షణకు హామీ ఇవ్వడం ద్వారా వారి వోట్లను పొందడానికి ప్రయత్నించాయి. కానీ అది పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు. పోలింగ్ రోజు సోమవారం, అంతకు ముందు ఆదివారం రెండు సెలవులు రావడంతో శనివారం సెలవు పెట్టుకుని తెలంగాణేతరులంతా తమ తమ ప్రాంతాలకు తరలిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్లు తక్కువ పోల్ కావడానికి ఇది కూడా కారణం. నిజానికి, తెలంగాణ పేరిట లొల్లిని సాధారణ తెలంగాణేతర ప్రజలు ఇష్టపడడం లేదు. చాలా మంది తెలంగాణేతరులు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వాస్తవ పరిస్థితిలు తెలియని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల లాంటి కుహనా మేధావులు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల ప్రయోజనాలు తెలంగాణతో ముడిపడి ఉండడం వల్ల, వాస్తవ పరిస్థితులు తెలియక రాష్ట్రం విడిపోతే ఏదో విపత్తు సంభవించినట్లుగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల లాంటి విద్యావంతులు ఆలోచించడం వల్ల మాత్రమే సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది.

సాధారణ ప్రజల గొంతు ఎప్పుడు కూడా పెద్దగా వినిపించదు. కొద్ది మంది గొంతు మాత్రమే బయటకు వినిపిస్తూ ఆదే ప్రజాభిప్రాయంగా తప్పుడు అవగాహనకు లోనవుతూ ఉంటాం. పైగా, బతకడానికి వచ్చిన తెలంగాణేతర ప్రజలతో తమకు పేచీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ఇతర నాయకులు పదే పదే చెబుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి, సాధారణ ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా చేయడానికి లాబీ ఒక్కటి నిరాకరిస్తూ వస్తున్నది. దానికి తోడు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రియల్టర్లు, అధికార కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందుతున్న కొద్ది మంది మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది సాధారణ ప్రజానీకం తెలంగాణ ఏర్పాటును కోరుకుంటున్నారు. వీరంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి నిరాసక్తత ప్రదర్శించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో స్థానికత కనిపించకపోవడం ఓటర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు హైదరాబాద్ ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నతస్థాయి అవినీతిని ప్రధానాంశం చేసుకుని ప్రచారం చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రచారాల్లో ఎక్కడ కూడా హైదరాబాదీ సంస్కృతి, నడత కనిపించలేదు. దాంతో వారు హైదరాబాద్ ప్రజల గుండెలు దోచుకోలేకపోయారు. సీనీస్టార్లు మాత్రమే హైదరాబాద్ ప్రజలకు హితబోధలు చేసే స్థితిని కల్పించారు. ఇదంతా హైదరాబాద్ సంస్కృతికి, జీవన విధానానికి వ్యతిరేకమైంది. కాంగ్రెసులోని కొద్ది మంది నాయకులు మాత్రమే స్థానిక ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అది వారి పుట్టుక వల్ల వచ్చింది. అందువల్ల వారు ఏదో మేరకు హైదరాబాద్ ప్రజల వోట్లను కాంగ్రెసు వైపు తిప్పడానికి ప్రయత్నించారని చెప్పవచ్చు.

తెరాస పోటీలో లేకపోవడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు హైదరాబాద్ స్థానికత కనిపించకుండా జరిగిపోయాయి. కెసిఆర్ ఆమరణ దీక్ష చేపడితే సంభవించే పరిణామాల పట్ల సెటిలర్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెటిలర్ల కోసం ఏర్పడిన సంఘాలు వారికి విశ్వాసాన్ని అందించలేకపోతున్నాయి. రాజకీయ పార్టీల మాటలను నమ్మడానికి వీలు లేదని వారు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. చంద్రబాబు, చిరంజీవి లాంటి నాయకులు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడుతారనే అభిప్రాయం బలంగా నాటుకుని ఉంది. ఈ స్థితిలో రాజకీయ పార్టీల వైఫల్యం, కెసిఆర్ ఎత్తుగడ మాత్రమే ఈ ఎన్నికల్లో పనిచేశాయని చెప్పవచ్చు. ఒక రకంగా ఇది కెసిఆర్ సాధించిన విజయంగా పరిగణించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X