• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు సినిమా వేర్వేరు

By కె. నిశాంత్
|

Nagarjuna
సినీ పరిశ్రమ రాజకీయాలకు అతీతమని అనడంలో అర్థం లేదు. సినీ పరిశ్రమ వల్ల తెలంగాణ ప్రాంతానికి మేలు జరుగుతోందని చెప్పడంలో అర్థ సత్యం మాత్రమే ఉంది. తెలంగాణ ఉద్యమం వల్ల తెలుగు సినీ పరిశ్రమ చెన్నైకి తరలిపోతుందని ముఖ్యమంత్రి రోశయ్య మాటల వల్ల ఇక్కడ బెదిరే విషయాలు ఏమీ లేవు. ముఖ్యమంత్రి రోశయ్య ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ ఆందోళనకారులపై కనిపించకుండా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమాల వల్ల పరిశ్రమలు తరలిపోతున్నాయని, సినీ పరిశ్రమం తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడం తప్ప మరోటి కాదు. తెలుగు సినీ పరిశ్రమ కలిసికట్టుగా, ఒక్కటి ఉందనే మాటలో కూడా ఏ మాత్రం నిజం లేదు. సినీ పరిశ్రమ కులపరంగా, రాజకీయ పరంగా ఇప్పటికే విడిపోయి ఉంది. సినీ పరిశ్రమలో కోస్తాంధ్ర ఆధిపత్యం కొనసాగుతుండడంతో స్ఫష్టంగా ప్రాంతాలవారీగా విడిపోలేదు. కానీ దర్శకుడు శంకర్ లాంటి వాళ్లు స్పష్టంగా సమైక్యనినాదాన్ని వ్యతిరేస్తున్నారు.

రాష్ట్ర విభజనపై సినీ ప్రముఖులు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాల్సిందేనని, కళ రాజకీయాలకు అతీతం కాదని ఆయన ఒక టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో అన్నారు. బలవంతం దాంపత్యం కుదరదని, రాష్ట్రం విడిపోవాల్సిందేనని ఆయన అన్నారు. చిరంజీవి, మోహన్ బాబుల తీరును ఆయన తప్పు పట్టారు. మోహన్ బాబు రాయలసీమ ప్రజల కష్టనష్టాల గురించి మాట్లాడుతారని తాను భావించానని, దురదృష్టవశాత్తు సమైక్యాంద్ర నినాదం ఇచ్చారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలివెళ్లదని, తాము ఉపాధి కోసం, వ్యాపారం కోసం వచ్చామని, తాము ఇక్కడే ఉంటామని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా రంగానికి వచ్చిన ఈ కష్టం తాత్కాలికమేనని శంకర్ తో పాటు భరద్వాజ కూడా అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి సినీ రంగంలోని కొంత మంది ప్రముఖులు ఎంత నిర్హేతుకంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది.

కాగా, సినీ పరిశ్రమ కులపరంగా కమ్మ, కాపు వర్గాలుగా విడిపోయిన విషయం రహస్యమేమీ కాదు. అదే విధంగా, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పరంగా విడిపోయిన విషయం కూడా అందరీకి తెలిసిందే. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల తరఫున పలువురు సినీ ప్రముఖులు ఎన్నికల్లో పోటీ చేశారు, ప్రచారాలు చేశారు. అందువల్ల సినీ పరిశ్రమ రాజకీయాలకు అతీతంగా ఉంటుందనేది నిజం కాదు. నాగార్జున, రాజశేఖర్ వంటి హీరోలు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని పడరాని కష్టాలు పడ్డారు. అదే విధంగా, నాగార్జున, మురళీ మోహన్ వంటి సినీ ప్రముఖులు కోస్తాంద్ర ఆధిపత్య పాలక వర్గాల వెంట ఉంటూ హైదరాబాదులో, హైదరాబాదు చుట్టుపక్కల భూవ్యాపారాలు సాగిస్తున్నారు. కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా వారు రాజకీయాల్లోనూ, తెలంగాణ సహజ వనరులను కొల్లగొట్టడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి, మోహన్ బాబు వంటి వారు నేరుగా సమైక్యాంద్ర పేరు మీద ఒక ప్రాంతం ప్రయోజనాలను కాపాడడానికి సిద్ధపడ్డారు.

సినీ రంగంలో తెలంగాణవారు ఉన్నప్పటికీ వారు కొద్ది మంది మాత్రమే. వారు కూడా ఎన్నో అవమానాలకు గురి కావాల్సి వస్తున్నదనేది బయటకు తెలిసిన విషయమే. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ తెలంగాణకు చెందిన ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డిని

సినారే భళారే

అన్నిట్లో హుషారే

సినిమా రెడీ మేడ్ సరుక్కీ

తయారే - అని ఎద్దేవా చేశాడు. విప్లవోద్యమం తలకెత్తుకున్న శ్రీశ్రీ సినిమా రంగానికి తన శక్తినంతా ధారపోస్తూ పాటలు, మాటలు, డబ్బింగులు చేస్తూ పోతే ఫరవా లేదు గానీ ఈ సిద్ధాంతాలూ లేని సి. నారాయణ రెడ్డి సినిమాలకు పాటలు రాస్తే తప్పై పోయినట్లుగా మాట్లాడడం తెలంగాణవారిని అవమానించడమే అవుతుంది. తెలంగాణవారిని ఏదో రకంగా దెబ్బ కొట్టడమే వారి ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఒకే పని చేస్తున్న సి. నారాయణరెడ్డికి, శ్రీశ్రీకి విలువల్లో, గౌరవాల్లో తేడా ఉండడాన్ని బట్టి వివక్ష, పక్షపాతం ఏమిటో అర్థమవుతుంది. తెలుగులో ప్రయోజనాత్మక సినిమాలను, ఆర్ట్ సినిమాను ఇప్పటికీ నిలబెడుతున్న ఒకే ఒక్కడు తెలంగాణకు చెందిన బి. నరసింగరావు. ఆయనకు తెలుగు సినిమా పరిశ్రమ ఇచ్చే గౌరవం, మర్యాద అందరికీ తెలిసిందే. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. కానీ తెలుగు సినీ రంగంలో ఆయనకు అంత ప్రాధాన్యం లేదు.

సినీ పరిశ్రమ తెలంగాణకు ఒరగబెడుతున్నదేమీ లేదు. సినీ హీరోలు, ఇతర ప్రముఖులు తమ ఇమేజ్ తో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి మోసం చేయడానికి పనికి వస్తున్నారు. రెండు ప్రధాన సినీ నిర్మాణ సంస్థలే తెలంగాణలోని సినిమా హాళ్లను గుత్తకు తీసుకున్నాయి. ఆ రకంగా ఇక్కడి సినిమా రంగంపై కూడా కోస్తాంధ్ర ఆధిపత్యమే కొనసాగుతోంది. కాగా, హైదరాబాద్, ముంబై, చెన్నై, కేరళ, కోల్ కత్తా వంటి దేశంలోని కొద్ది నగరాల్లో తప్ప ఎక్కడా పెద్దగా సినీ పరిశ్రమ వ్యవస్థాగతంగా ఏర్పడలేదు. అలా ఏర్పడడం వల్ల వచ్చిన లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఇక్కడ స్థిరపడడం వల్ల లాభపడేది సినీ పరిశ్రమే తప్ప ఈ ప్రాంతానికి ఉపయోగపడేది చాలా తక్కువ.

ఈ స్థితిలో ముఖ్యమంత్రి రోశయ్య బెదిరింపులు తాటాకు చప్పుళ్లే తప్ప మరేమీ కాదు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. నిజానికి, సినీ పరిశ్రమ గానీ, సీమాంధ్రులు చెబుతున్న అభివృద్ధి గానీ హైదరాబాదుకు మాత్రమే పరిమితిం కాకూడదని, రాష్ట్రంలోని అన్ని నగరాలకు విస్తరించాలని తెలంగాణవాదులు కోరుకుంటున్నారు. హైదరాబాద్ క్కిక్కిరిసి పోయి ఊపిరాడకుండా కాకూడదనే కోరుకుంటున్నారు.

English summary
Telugu Film industry not united
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X