వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలు: బాబు పాపమే

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Chandrababu Naidu
తెలంగాణ కోసం తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించి ఇది అవాంఛనీయ పరిణామం. ఇప్పటి వరకు దాదాపు 300 మంది దాకా తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెబుతున్నారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య ఆత్మహత్యలు తీవ్ర సంచలనం కలిగించాయి. తెలంగాణలోని విద్యార్థులు ఓ వైపు సీమాంధ్ర నాయకులకు, తెలంగాణ రాజకీయ నేతలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం కదం తొక్కుతుంటే మరో వైపు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకులు, మేధావులు, విద్యార్థి నాయకులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఆత్మహత్యలు ఆగడం లేదు. 1969లో తెలంగాణ ఉద్యమం విఫలం కావడంతో నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో ఊపందుకుంది. పాలకులపై ఆగ్రహంతో తెలంగాణలోని ఒక తరం యువత నక్సలైట్ ఉద్యమానికి జవజీవాలను కల్పించింది. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలను, విద్యార్థులను, మేధావులను, రచయితలను అణచివేయడానికి పాలకులు నక్సలైట్ ముద్రను వాడుకుంటూ వస్తున్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక ఉద్యమాలను కూడా అణచేయడానికి నక్సలైట్ పేరు పెడుతూ వస్తున్నారు. ఈసారి కూడా ఆ ప్రయత్నం జరిగింది, జరుగుతోంది. విద్యార్థి ఉద్యమంలో నక్సలైట్లున్నారనే ఆంధ్ర పాలకుల విమర్శలను, పోలీసుల ఆరోపణలను తెలంగాణ రాజకీయ నాయకులు, ఉద్యమకారులు తిప్పికొడుతున్నారు. ఆ అపవాదు నుంచి బయటపడడానికి విద్యార్థులు సాధ్యమైనంత శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారు.

ప్రజాస్వామిక ఉద్యమ వైఫల్యం, రాజకీయ నాయకులపై ఆగ్రహం విద్యార్థులు, యువకులు విపరీత నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతుంది. ఈ విపరీత, అతివాద మార్గం 1969లో నక్సలైట్ ఉద్యమానికి జీవం పోసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా, తెలంగాణ రాజకీయ నాయకులపై ఒత్తిడి తేవడం ద్వారా తెలంగాణను సాధించుకోవడానికి విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్ష విరమించుకున్నప్పుడు వెల్లువెత్తిన విద్యార్థి నిరసన ఇందులో భాగమే. ఈ స్థితిలోనే కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం నిరుడు డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటన తెలంగాణలో ఆశలు నింపింది. అయితే తదుపరి పరిణామాలు తీవ్ర నిరాశజనకంగా ఉన్నాయి. దీని వల్ల తలెత్తిన నిస్పృహ నుంచి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడుతుందనే ఆశ అడుగంటి పోయిన స్థితిలో విద్యార్థులు ప్రస్తుతం తీసుకుంటున్న తీవ్ర చర్య అదే. అలా నిరాశాజనకంగా మారడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తామని పార్టీపరంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు చిదంబరం ప్రకటన వెలువడగానే తన వైఖరిని మార్చుకున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిన సీమాంధ్ర నాయకులు ఎదురు తిరిగితే కూడా సహించారు. పైగా వారిని ప్రోత్సహించారు. పార్టీలో తెలంగాణ సానుకూల నిర్ణయం వెలువరించడానికి చంద్రబాబు కమిటీ వేశారు. ఆ కమిటీ నెలల తరబడి అధ్యయనం చేసింది. అలా అధ్యయనం చేసిన తర్వాతనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన నాయకుడితో పాటు ఈ కమిటీలో కోస్తాంధ్రకు చెందిన కె. ఎర్రంనాయుడు, రాయలసీమకు చెందిన కెఇ కృష్ణమూర్తి ఉన్నారు. నెలల తరబడి అధ్యయనం చేసిన ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తామని నిర్ణయం తీసుకుంది. అయితే చిదంబరం ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్రకు చెందిన నాయకులే కాకుండా కమిటీలోని ఎర్రంనాయుడు, కృష్ణమూర్తి కూడా తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. సీమాంధ్ర నేతల పార్టీ వ్యతిరేక వైఖరులను చంద్రబాబు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేసిన తెలంగాణ నేతలపై కమిటీ నిర్ణయానికి ముందు తీవ్రంగా వ్యతిరేకించి, వారికి చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ, సీమాంధ్ర నేతలను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. అలాగే, ప్రజారాజ్యం పార్టీ అధినేత సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూ చెప్పి చిదంబరం ప్రకటన వెలువడగానే యు - టర్న్ తీసుకున్నారు. సమైక్యాంధ్రను సమర్థిస్తూ పర్యటనలు చేశారు. తెలంగాణలో 17 శాతం ఓట్లు సాధించిన చిరంజీవి తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకున్నారు.

చంద్రబాబు, చిరంజీవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోకుండా పార్టీ వైఖరులకు కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై ఉండేది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు కూడా తెలంగాణకు అనుకూలంగా లేవు. అలా అనుకూలంగా లేకపోవడానికి కూడా ఈ ఇద్దరు నేతల వైఖరులు కారణం. దీనికి సీమాంధ్ర నేతల ప్రకటనలు తోడవుతున్నాయి. దీంతో తెలంగాణ విద్యార్థుల్లో, యువకుల్లో, ప్రజల్లో తీవ్ర నిరాశానిస్పృహలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాదనే అభిప్రాయం బలపడుతూ వస్తోంది. దీంతో అవగాహనా పరిధి తక్కువగా ఉన్న విద్యార్థులు ఒక నిరసన రూపంగా ఆత్మహత్యలను ఎంచుకున్నారు. దీన్ని వ్యతిరేకించడమే కాకుండా వాటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మేధావులపై ఉంది. తెలంగాణ జెఎసి ఒక మేరకు ఈ భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X