తెలంగాణ: విభజనతో తెలుగుజాతికే మేలు

Telangana
ఒక సారి విఫలమైన, కాలం చెల్లిన భావనలను పునరుద్ధరిస్తే అవి సఫలమవుతాయా? తెలంగాణ సమస్యను 'తెలంగాణ ప్రాంతీయ మండలి' (టిఆర్‌సి) రూపేణా పరిష్కరించాలని కేంద్రం యోచిస్తోన్నట్టు వెలువడుతోన్న వార్తలకు ప్రతిస్పందనగానే ఆ ప్రశ్న వేయవల్సివచ్చింది. టిఆర్‌సితో గానీ లేదా అటువంటి మరో ఏర్పాటుతో గానీ తెలంగాణ సమస్యను పరిష్కరింపబూనుకోవడం వల్ల అటు సీమాంధ్రకు, ఇటు తెలంగాణకు మరింత హానే కాని మేలు జరగబోదు. ఒక విఫల భావనను పునరుద్ధరించే ప్రతిపాదనను నిశితంగా పరిశీలించే ముందు తెలంగాణ ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రత్యేక తెలంగాణ ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష; రాజ్యాంగబద్ధమైన డిమాండ్. దానిని నెరవేర్చకపోవడం అంటే ప్రజాస్వామ్య సమున్నతికి దోహదం చేయకపోవడమే. సాధారణంగా ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ అనేది నిర్దిష్ట ప్రాంతానికి సహజవనరులలో న్యాయబద్ధమైన వాటాను నిరాకరించడం, రాజకీయ గుర్తింపు కొరవడటం, ప్రజలకు తమ సొంత వ్యవహారాలను నిర్ణయించుకొనే అధికారం లేకపోవడం, ఆర్థిక అన్యాయాల కారణంగా ఉత్పన్నమవుతుంది. తెలంగాణ విషయంలో ఈ అంశాలపై భయాందోళనలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందే వ్యక్తమయ్యాయన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

ఆంధ్రప్రదేశ్ కొన్ని షరతులతో ఏర్పడింది; తెలంగాణ వేరుపడవచ్చనేది ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన ఒప్పందంలో ఒక నిబంధన. సదరు షరతులను అమలుపరచడానికి, తెలంగాణ ప్రజల భయాందోళలను తొలగించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన, సంస్థాగతమైన యంత్రాంగాలు ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నాయి. అయితే అవన్నీ విఫలమయ్యాయి. ఒప్పందాలన్నీ మొదటి రోజు నుంచే ఉల్లంఘనకు గురయ్యాయి. ఈ వైఫల్యాలు, ఉల్లంఘనల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన క్షణం నుంచే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు డిమాండ్ వచ్చింది. కనుక టిఆర్‌సి లాంటి విఫలమైన, దగాకోరు యంత్రాంగాలను దశాబ్దాల తరువాత పునరుద్ధరించడమంటే తెలంగాణ ప్రజలను మరోమారు అవమానించడానికి ప్రయత్నించడమే. ప్రస్తుత తెలంగాణ ఉద్యమం ఒక అస్తిత్వ పోరాటం. ఈ దృష్ట్యా ఎటువంటి రాజకీయ స్వయంప్రతిపత్తి, ఆర్థిక ప్యాకేజీలు సమస్యకు ఆచరణాత్మక పరిష్కారం కాబోవు.

తెలంగాణను ఏర్పాటు చేయడానికి బదులు టిఆర్‌సి, ఆర్థిక ప్యాకేజీలు మొదలైనవి ఇవ్వడం వల్ల రాజ్యంగపరంగా మరింత సంక్లిష్ట సమస్యలు నెలకొంటాయి. ప్రజల మధ్య విభేదాలు పెరుగుతాయి. అసంతృస్తి పెచ్చరిల్లుతుం ది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం మినహా తెలంగాణ సమస్యకు పరిష్కారం లేదనేది ప్రతి రాజకీయ విశ్లేషకుడికీ స్పష్టమే.

తెలంగాణ రాష్ట్ర్రాన్ని ఏర్పాటు చేయడం మినహా మరే ఇతర పరిష్కారమూ పనిచేయదు. ఎందుకని? మూడు స్పష్టమైన కారణాలు ఉన్నాయి: అవి: (అ) రాజకీయంగా అసాధ్యం:- ఏకాభిప్రాయ సాధన, నివేదికలు, కమిషన్ల పేరిట నిర్ణయాన్ని వాయిదా వేస్తూ తమను అవమానిస్తున్నారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ప్రాంతీయ మండలి ఏర్పాటు ప్రతిపాదన బహుశా 2004లో అయితే ఆమోదం పొంది ఉండేదేమో. అప్పుడు ప్రజలు ప్రత్యేక రాష్ట్రం పట్ల ఇంతగా పట్టుదలతో లేరు.

ప్రాంతీయ మండలి ఏర్పాటును కాంగ్రెస్ నాయకులు సైతం అంగీకరించే అవకాశం లేదు. రాజకీయపక్షాలన్నిటికీ ఆమోదయోగ్యం కానప్పుడు సమస్య ఎలా పరిష్కారమవుతుంది? ; (ఆ) ప్రజలు ఆమోదించరు:- రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ ప్రాంతీయ మండలిని ప్రజలు అంగీకరించరు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలలో వారు విశ్వాసాన్ని కోల్పోయారు. కేంద్రం ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు; (ఇ) సంక్లిష్ట, అసాధ్య ప్రక్రియ:- రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరి, ప్రజలు ఏదో ఒక విధంగా షరతులతో అంగీకరించినప్పటికీ ప్రాంతీయ మండలి ఏర్పాటు చాలా సంక్లిష్ట ప్రక్రియ. దానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరముంది.

రాజ్యాంగ సవరణకు బిజెపి అంగీకరిస్తుందా? అంగీకరించదు. సరిగ్గా ఈ కారణంగానే తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రాంతీయ మండలి ఏర్పాటు ప్రతిపాదన పట్ల అప్రమత్తమవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చాలా సరళమైన ప్రక్రియ. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటనతోనే ఆ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రక్రియను పునరుద్ధరించాలి.

ఈ విషయమై మళ్ళీ ఎలాంటి సంప్రతింపులు జరపాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంటు తదుపరి సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. 2010 జనవరి 5న అఖిలపక్ష సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ రాజకీయ ప్రక్రియ విఫలమైతే ప్రజలు ప్రజాస్వామ్యంలో విశ్వాసాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. అలా జరగకూడదని ఆయన నొక్కిచెప్పారు. ఒకవేళ అదే సంభవిస్తే అందుకు కారణం తెలంగాణ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనకు కట్టుబడి ఉండకపోవడమే అవుతుంది.

తెలంగాణ ఏర్పాటుకు మరో మార్గం ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే విషయాన్ని న్యూఢిల్లీకి వదిలివేయడం కంటే రాష్ట్ర రాజకీయవేత్తలే అందుకు కలసికట్టుగా పూనుకోవాలి. తెలుగు సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళు, తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి గుండెలు బాదుకునే వాళ్ళు తెలంగాణ ఏర్పాటును అడ్డుకొనేందుకు న్యూఢిల్లీకి పూర్తిగా లొంగిపోయారు!

ఇది తెలంగాణ ప్రజల అభిప్రాయం. కేంద్రంను శరణు వేడుకోవడాన్ని మాని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పునరుద్ధరించే విషయమై చర్చలు ప్రారంభించాలి. ఆంధ్ర, తెలంగాణ నాయకులు కలసికట్టుగా కూర్చొని చర్చలు జరిపి రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయడమే ఏకైక పరిష్కారమని నిర్ణయిస్తే తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించినవారవుతారు.

తెలుగు ప్రజలందరూ రెండు రాష్ట్రాలను కోరుకొంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వారి మనోభావాలను గౌరవించక తప్పదు కదా. అయితే ఈ విషయంలోనే రాష్ట్ర రాజకీయ నాయకులు విఫలమయ్యారు. డిసెంబర్ 9 తరువాత అలా సమైక్యంగా చర్చలు జరిపి, రెండు రాష్ట్రాల ఏర్పాటు పరిష్కారాన్ని కేంద్రానికి సూచించి ఉండవల్సింది. ఇప్పటికీ ఆ సూచన చేయడానికి అవకాశం ఉంది. మనకు మనమే నిర్ణయించుకోవడం హందాగా ఉంటుంది కదా. ఈ విషయమై రాష్ట్ర నాయకులందరూ శ్రద్ధ చూపాలి.

ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య చర్చలు అత్యవసరం. దురదృష్టవశాత్తు ఇరువర్గాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. పరస్పర అవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో అటువంటి చర్చలు జరిగేందుకు అవకాశం లేదు. పౌర సమాజ సంస్థలు లేదా రెండు ప్రాంతాలకు చెందిన, ప్రజాస్వామ్య ఆదర్శాలకు అంకితమైన నాయకులు ఇందుకు పూనుకొని ప్రైవేట్ చర్చలకు దారిని సుగమం చేయాలి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకు ఇంతకంటే ఉత్తమమైన మార్గమేముంటుంది? చర్చల ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోగలం. అయితే రాజకీయ వేత్తల నుంచి మరీ ఎక్కువగా ఆశించడం తగదేమో? అయినప్పటికీ చర్చలకు ప్రయత్నించడం తప్పు కాదు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రధాన రాజకీయవేత్తలు (అజ్ఞానాన్ని, తెలివిహీనతను ఒక లలితకళగా, మీడియా సర్కస్‌గా వృద్ధి చేసిన లగడపాటి వంటి వారు కాదు) తొలుత సమైక్యంగా చర్చలు జరపాలి. సమస్యకు రాజనీతిజ్ఞుని దృక్పథంతో పరిష్కారాన్ని అన్వేషించాలి. ఒక విషయం స్పష్టం - తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. రాజకీయాలలో ఏదీ అంతిమం కాదు.

ఏదీ పరిపూర్ణమూ కాదు. ఎవరికి తెలుసు, కొన్ని దశాబ్దాల తరువాత తెలుగు ప్రజలందరూ మళ్ళీ కలసికట్టుగా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటారేమో? ఇది ఒక మహోన్నత దార్శనికతగా కన్పించవచ్చ. అయితే ఇలాంటి సౌహార్ధ భావన తెలంగాణ ఏర్పాటుకు ఎంతైనా తోడ్పడగలదు. రెండు తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా, సామరస్యంగా మనుగడ సాగించడానికి దోహదం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విషయం కాబోదు. తెలుగువారి ప్రయోజనాలను పరిరక్షించడానికి న్యూఢిల్లీలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు మాట్లాడడం గొప్ప విషయం కాదూ?

తెలంగాణ ఏర్పాటును వాస్తవంగా వ్యతిరేకిస్తున్నది ఎవరు? నిజానికి ఆంధ్ర ప్రాంతంలో ఎవరూ వ్యతిరేకించడం లేదు. తెలంగాణ సమస్యతో ఆంధ్రప్రాంత ప్రజలు ఇప్పటికే బాగా విసిగిపోయారు. ఏదో ఒక విధంగా అది సత్వరమే పరిష్కారమవ్వాలని వారు కోరుకొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల వారు నష్టపోయేదిగానీ, ఆంధ్రప్రదేశ్ కొనసాగడం వల్ల వారు పొందే లబ్ధిగానీ ఏమీ లేదు.

అక్రమం గా ఆస్తులు సముపార్జించుకున్న వారు మాత్రమే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. వారి ప్రయత్నాలు తెలుగుజాతి భవిష్యత్తుకు చాలా ముప్పు కలిగించేవి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి విఘాతం కలిగించేవి. తెలుగు ప్రజల సమైక్యతను అడ్డుకునేవి. ఈ వ్యక్తులు ఎవరో, తెలంగాణ ఏర్పాటును వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టమే.

అంతిమంగా చెప్పేదేమిటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరాలి. ఎందుకంటే తెలంగాణ సమస్యకు అంతకుమించి మరో పరిష్కారం లేదు. అలా కాకుండా తెలంగాణ ప్రాంతీయ మండలి, తెలంగాణకు ప్యాకేజీలు మొదలైన జిమ్మిక్కులతో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలను ప్రజలు అంగీకరిచబోరు. అటువంటి విఫల భావనలు, దగాకోరు దృక్పథాలతో తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి పూనుకోబోవడం న్యూఢిల్లీలోని విధాన నిర్ణేతల మేధో సామర్థ్యాన్ని మాత్రమే తెలుపుతుంది సుమా!

తెలంగాణ ఒక సహజపరిపాలనా ఏర్పాటు. చట్టాన్ని పాటిస్తూ స్థానిక సంప్రదాయాలను గౌరవించేవారు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో నివశించవచ్చు. పెట్టుబడులు పెట్టవచ్చు. అందుకు అడ్డేమీ ఉండదు. తెలంగాణలోని కొంత మంది ఆం«ద్రుల న్యాయబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించడానికి తగుచర్యలు చేపట్టడం జరుగుతుంది. తెలంగాణ ఏర్పాటుతో ఉత్పన్నమయ్యే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. పరస్పర గౌరవంతో చర్చలు జరగాలి. మనం తెలుగువారం రెండు రాష్ట్రాలలో నివశిద్దాం.

ఎందుకీ విభేదాలు, విద్వేషాలు? తెలుగు జాతి ఆత్మ గౌరవమంటూ గొంతులు చించుకోవడమెందుకు? ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడమంటే గాయాన్ని కత్తితో కెలికినట్లే సుమా. అటువంటి పరిష్కారాలను ప్రజలు ఒప్పుకొనే పరిస్థితులు లేవుగాక లేవు. కేంద్రం ఆ పరిష్కారానికే కట్టుబడితే పరిస్థితి చేయిదాటిపోతుంది. అది వాంఛనీయం కాదు. కనుక మనం బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల నేర్పాటు చేసుకోవడమే ఉత్తమ పరిష్కారం. హుందాగా, పరస్పర గౌరవంతో, ప్రజాస్వాయమ్యయుతంగా ఆ పరిష్కారాన్ని అమలుపరచుకోవడానికి కృషి చేద్దాం.

- భిక్షం గుజ్జా
వ్యాసకర్త ప్రముఖ శాస్త్రవేత్త, విధాన విశ్లేషకుడు, నదీ జలాల వ్యవహారాల నిపుణుడు, పలు అంతర్జాతీయ సంస్థలలో పనిచేశారు.

రచయిత అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. చర్చలో పాల్గొనాల్సిందిగా పాఠకులను కోరుతున్నాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+