తెలంగాణ ఉద్యమం - ఆత్మావలోకనం

ఆ ప్రశ్న వేసిన మొదట వేసిన వ్యక్తి అదృష్టవంతుడు. ఎందుకంటే.. ప్రశ్న ఎదుర్కున్న వ్యక్తిని వేధిస్తున్న ప్రశ్న కూడా అదే. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు?
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యకక్షుడు కె. చంథ్రేఖర రావా? తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామా?
తెలంగాణ రావడం కెసిఆర్‌కు ఇష్దం లేదని అంటున్న తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులా?
'తెచ్చేది, ఇచ్చేది మేమే' అంటున్న కాంగ్రెస్ నాయకులా?
వచ్చే ఎన్నికల్లో ఎన్‌డిఎ గెలుస్తుందని, తాము అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు. అంటే, తెలంగాణ ప్రజలు బిజెపి వైపు నిలబడాలని, తమకు ఓటేయాలని వారు చెప్పకనే చెబుతున్నారు.
అదే మాటను కెసిఆర్ నేరుగానే చెబుతున్నారు. ఆయుధం వాళ్లకు ఇచ్చి, తనను తెలంగాణ తేవాలని అడుతున్నారని ఆయన ప్రజలను తప్పు పడుతున్నారు. ఆ రకంగా ఆయన వచ్చే ఎన్నికల్లో తన పార్టీని గెలిపిస్తే తాను కేంద్రంలో చక్రం తిప్పి తెలంగాణ తెస్తానని అంటున్నారు.
ఓట్ల ద్వారా తెలంగాణ రాదని, ఉద్యమం ద్వారా మాత్రమే వస్తుందని అంటున్న గద్దర్ వంటివారు ఆ ఉద్యమ రూపం ఏమిటో చెప్పడం లేదు.
అంటే, ఎవరికి వారు మీరంతా మా వైపు మా వైపు రండి, తెలంగాణ తెస్తాం అంటున్నారు గానీ తామంతా ఒక్కటై తెలంగాణ సాధిస్తామని, ఆ రకంగా మీ ఆకాంక్షలు తీరుస్తామని అనడం లేదు.
ఇచ్చేది, తెచ్చేది తామే అంటున్న కాంగ్రెస్ తెలంగాణ నాయకులు అమ్మగారికి దయ కలగాలి, అప్పటి దాకా ఆగండి అని సహన మంత్రం ఉపదేశిస్తున్నారు. అమ్మ సోనియా గాంధీకి దయ కలుగుతుందో, కలగదో తెలియదు. కలిగితే ఎప్పుడు కలుగుతుందో తెలియదు.
వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్ వంటి అమ్మగారి ప్రధాన పూజారులు తెలంగాణ ఇన్‌స్టంట్ దోశ కాదని, తెలంగాణకు గడువు పెట్టలేమని, సున్నితమైన అంశమని, పరిష్కారానికి సమయం కావాలని, సంప్రదింపులు జరుపుతున్నామని అంటున్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే తపోభంగం జరిగినట్లుగా భగ్గుమంటున్నారు.
ఈ స్థితిలో తెలంగాణ వస్తుందా అనే ప్రశ్నను ఎదుర్కున్న వ్యక్తికి సమాధానం చెప్పడం రాజకీయ నాయకులు చెప్పినంత సులభం కాదు.
రాదని చెప్పడానికి మనసు ఒప్పుకోదు. అలా చెప్పాల్సిన వచ్చినప్పుడు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గుర్తుకు వస్తారు. ఆయన మాట నిజం కాకూడదనే ఓ బలమైన అభిప్రాయం, తెలంగాణ వచ్చి తీరాలనే ఆకాంక్ష కూడా ఆ సమాధానం చెప్పడానికి ఆటంకంగా మారుతుంది.
ఇప్పుడున్న స్థితిలో తెలంగాణ రాదనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోక తప్పదు. కాంగ్రెసు తెలంగాణ సమస్యకు ఏదో విధమైన పరిష్కారం చూపకుండానే 2014 ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంలో ఉన్నట్లు కతినిపస్తున్నది. గడువుకన్నా ముందే ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచనలో కూడా కాంగ్రెసు ఉన్నట్లు కనిపిస్తున్నది.
దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు కాంగ్రెసుకు తెలంగాణకు సంబంధించి కాంగ్రెసుకు తాత్కాలిక ఊరటను కల్పించాయి. ఇది కాకపోతే, మరోటి వచ్చి ఉండేది. వివిధ రాష్ట్రాల ఎన్నికలనో, దేన్నో ఒకదాన్ని కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు అడ్డు పెడుతూనే ఉన్నారు. పండుగలు పబ్బాలను చూపి దాటేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు దాటేయగలిగిన వారికి మరో ఏడాదో, ఏడాదిన్నరనో దాటేయడం కష్టమేమీ కాదు.
ఎన్నికల్లో సీట్లను గెలుచుకోవడానికి మాత్రమే తెలంగాణ ఇవ్వాలనే మాటతో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు ఆ పార్టీకి చెందిన కాంగ్రెసు నాయకులే కాదు, కెసిఆర్ కూడా అంటున్నారు. ఆ సీట్లను తెలంగాణను ఇవ్వడం ద్వారా ఎందుకు, మరో రకంగా సాధించుకోవచ్చు కదా అనుకోవచ్చు. మరో విధంగా సాధించుకోవడానికి కెవిపి రామచందర్ రావు, కావూరి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటివారు ఉమ్మడిగానో, విడివిడిగానో కాంగ్రెస్ అధిష్టానానికి మార్గాలను చెప్పే వుంటారు.
తెలంగాణలో కూడా 2009 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ఇప్పుడు సీట్లను సంపాదించుకోవచ్చుననే మాస్టర్ ప్లాన్ ఇచ్చే వుంటారు. అందుకు, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యకక్షుడు బొత్స సత్యనారాయణ ద్వారా, చిరంజీవి ద్వారా భరోసా ఇప్పించే ఉంటారు. అలా కాంగ్రెసు తనంత తానుగా సీట్లను గెలుచుకోలేనప్పుడు వాడుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయాన్ని చూపే ఉంటారు. వైయస్ జగన్ ఈ రకంగా ఉపయోగపడడానికి సిద్ధం కావచ్చు. తెలుగుదేశం పార్టీ అధ్యకక్షుడు తెలంగాణ రాకుండా తన 'కర్తవ్యాన్ని' నెరవేర్చవచ్చు. నిజానికి, సీమాంధ్ర రాజకీయ నాయకులకు (వీరే పెట్టుబడిదారులు కూడా, వీరే ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు విస్తరించారు) తెలంగాణను అడ్డుకోవడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నట్లే అనిపిస్తోంది. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుకు రావడానికి అవకాశం లేదు.
ఎన్‌డిఎపై ఆశలు పెట్టుకోవాల్సిందేనా? కెసిఆర్ కదలికలు ఆ విధమైన సంకేతాలనే ఇస్తున్నాయి. కెసిఆర్ తెలిసే చేస్తారో, తెలియక చేస్తారో గానీ చాలా తొందరపడి అడుగులు వేస్తారు. ఇప్పుడు ఆయన అదే పని చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. భావి ప్రధానిగా గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఊహించుకుని ఆయన మనసును దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మోడీతో వేదికలను పంచుకోవడానికి సిద్ధపడ్దారు. ఇప్పుడు బిజెపికి జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్నవారిలో ఎవరైనా ప్రధాని అయితే తెలంగాణ ఏర్పాటు అవుతుందేమో గానీ నరేంద్ర మోడీ ప్రధాని అయితే పార్టీ విధానాన్ని అమలు చేస్తారనే నమ్మకం లేదు. ఆయన తెలంగాణ గురించి ఇప్పటి వరకు ఒక్క మాట చెప్పినట్లు కూడా లేదు. రాజకీయ పార్టీలు విధానాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాయనే విషయం పాతబడి పోయింది. అప్పటికప్పుడు ఓట్లు తెచ్చి పెట్టే మార్గాలు, అధికారానికి కలిసి వచ్చే శక్తులు మాత్రమే వాటికి కావాలి.
తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం కాబట్టి అప్పుడు తెలంగాణ ఇవ్వలేకపోయామని బిజెపి అంటోంది, రేవు అధికారం కోసం అటువంటి పార్టీ మద్దతే తీసుకోవాల్సిన అనివార్యత ఆ పార్టీకి ఏర్పడవచ్చు. తెలంగాణ కోసం అధికారాన్ని వదులుకుని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి బిజెపి అటువంటి పరిస్థితి వస్తే సిద్ధపడుతుందా, ఆ పార్టీని కూడా ఒప్పించి తెలంగాణ ఇస్తామని అంటుందా, ఆ రకంగా తెలంగాణను ద్వితీయం చేస్తుందా అనే విషయాలను కూడా ఆలోచించుకోవాల్సి వుంటుంది.
ఇప్పటి వరకు మాట్లాడిన విషయాలన్నీ ఊహాజనితాలని అనుకుందాం. కాస్తా జరిగిన విషయాలను మననం చేసుకుని, ముందుకు చూసే ప్రయత్నం చేద్దాం.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడానికి ముందు తెలంగాణ ఉద్యమ ఉధృతికి బీజాలు పడ్డాయి. బియ్యాల జనార్దన్ రావు ఊరూరూ తిరిగి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడుతూ వచ్చారు. వీరన్న పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ మహాసభ అప్పటికే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వచ్చింది. కులాన్ని పునాది అంశంగా గుర్తించి ఏర్పాటైన విప్లవ పార్టీ వీరన్నది. కుల సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆ సంఘాలతో సమానంగానే తెలంగాణ మహాసభను ఆ పార్టీ చూసినట్లు అనిపిస్తుంది. కానీ, తెలంగాణ ఉద్యమాన్ని కులాల ప్రాతిపదికపై నిర్మించే ప్రయత్నం చేయలేదు.
నిజానికి, వీరన్న పార్టీ పుట్టుకతోనే బయట పడలేనంత తప్పు చేసింది. ప్రజాస్వామిక పద్ధతిలో, అంటే పార్లమెంటరీ వ్యవస్థ చట్రానికి లోబడి పార్టీ ఆచరణ ఉండాలనే సూచనలను పక్కన పెట్టి, తమ మాతృ సంస్థ జనశక్తి, విప్లవపార్టీల్లో పెద్దదైన అప్పటి పీపుల్స్‌వార్‌కు సమాధానం చెప్పడానికి మాత్రమే అది కార్యాచరణను మాత్రమే కాదు, పార్టీ పేరును కూడా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు రెండు వైపులా పదును ఉంది, కాబట్టి దాన్నే ఉద్యమ విస్తృతికి వాడుకోవాలనే విషయాన్ని వీరన్న పెడచెవిన పెట్టాడు. అదే పార్టీ పర్యవేక్షణలో పార్లమెంటరీ చట్రంలో చేసిన ప్రయోగానికి పురుటిలోనే సంధి కొట్టింది.
మాదిగల నాయకత్వంలో ఓ రాజకీయ ప్రయోగం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగానే సాగాయి. కుల సంఘాలు, కొన్ని చిన్న చితక పార్టీలతో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితితో కలిసి మహా జన ఫ్రంట్ ఏర్పడింది. ఈ మహాజన ఫ్రంట్ సిపిఐ, సిపిఎం వంటి పార్టీలతో జత కట్టి పోటీ చేయడానికి ప్రాతిపదిక కూడా ఏర్పడింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయం కోసం జరిగిన ప్రయత్నాలు అవి. ఈ మహాజన ఫ్రంట్‌కు మందకృష్ణ మాదిగ నేతృత్వం వహించారు. ఇప్పటికిప్పుడు ఇది అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని అంచనాకు వస్తూనే ఈ ప్రయోగానికి ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో ఈ ఫ్రంట్ గెలిచే అవకాశాలున్నాయని అప్పుడో అంచనా. కానీ, పొత్తులు ఖరారు చేసుకోవడంలో తొందరపాటు వల్ల అది బెడిసికొట్టింది. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లోని కులాధిపత్యం, ప్రాంతీయాధిపత్యం మరో రాజకీయ శక్తికి అప్పుడే అవకాశం ఏర్పడింది. అంటే, ఓ ఖాళీలోనే తెరాస ఏర్పడింది. దీని స్థలావరణం తక్కువే అయినా పరిమిత ప్రాంతంలో అంటే, తెలంగాణలో అది దాని పాత్రను నిర్వహించాల్సి ఉండింది. కానీ, గత పన్నేండేళ్ల కాలంలో ఏం జరిగింది? తెరాస సరైన పాత్రనే నిర్వహిస్తున్నదా అనేది చూడాల్సిన అవసరం ఉంది.
తెలుగు ప్రాంతంలోనే గత ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రజా సంఘాలకు భిన్నంగా తెలంగాణలో సాహిత్య, సాంస్కృతికోద్యమానికి ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడ్డాయి. తెలుగు సమాజంలోని ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల వాటికి ఆదరణ ఉండదని, ఇతర తెలుగు ప్రాంతాల శక్తులకు దూరమవుతామని భావించి తొలుత చాలా మంది వాటికి దూరంగా ఉన్నారు. నిజానికి, తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటుకు నాలుగైదేళ్ల కసరత్తు జరిగింది. నలుగురితోనే ముందుకు రావడం వల్ల తెలంగాణ జర్నలిస్టు ఫోరానికి ఆ కసరత్తు అవసరం లేకుండా పోయింది. తెలంగాణ జర్నలిస్టు ఫోరాన్ని అన్ని శ్రేణులకు చెందిన సంస్థగా నడపాలని అనుకోలేదు. తెలంగాణ దృక్కోణంతో విషయాలను చూడడానికి తగిన అంశాలను నేర్పుకోవడానికి, ఇతర తెలంగాణ జర్నలిస్టులతో పంచుకోవడానికి ఏర్పాటైంది. అంటే, సీమాంధ్ర మీడియా ఆలోచనల్లోని ప్రాంతీయ ధోరణి నుంచి బయటపడి తెలంగాణ ప్రాంత దృష్టి కోణం అలవరుచుకోవడానికి ఆత్మ చైతన్యం సంతరించుకునే ఓ అధ్యయన వేదికగా ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది.
కమ్యూనిస్టు, విప్లవోద్యమాలు తెలంగాణకు వరమో, శాపమో చెప్పలేని సందిగ్దావస్థ. తెలంగాణ ప్రజలకు చైతన్యం ఒనగూరింది ఆ ఉద్యమాల కారణంగానే. వాటి కారణంగా ఆధిపత్యాలను వ్యతిరేకించే లక్షణం తెలంగాణ ప్రజానీకానికి అబ్బింది. అయితే, చైతన్యానికి మించిన ఆచరణ కారణంగా, పార్లమెంటరీ వ్యవస్థలో వివిధ శ్రేణులు, వర్గాలు కలసి పనిచేసే వేదిక లేకపోవడం వల్ల తెలంగాణలో నిర్బంధ వాతావరణాన్ని తట్టుకునే, ప్రశ్నించే శక్తి కూడా లేకుండా పోయింది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ప్రాంతీయ దళారీ శక్తులు, ప్రాంతేతర పెట్టుబడీదారులు తెలంగాణ వనరులపై, ప్రజానీకంపై ఆధిపత్యం సంపాదించారు. కమ్యూనిస్టు, విప్లవోద్యమాల ముసుగులో కొన్ని ప్రాంతేతర శక్తులు, గ్రూపులు ఆ పనిని సుళువు చేసి పెడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సాంస్కృతిక వేదిక పురుడు పోసుకుంది. తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటుకు ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పునాది వేసిందని చెప్పాలి. ఈ ఫోరం ఆధ్వర్యంలో ప్రస్తుత తెలంగాణ ఉద్యమ ఉధృతికి పునాదులు పడ్డాయి. తెలంగాణ జలవనరుల దోపిడీపై గాదె ఇన్నయ్య రాసిన 'దగా పడ్డ తెలంగాణ', జయశంకర్ తెలంగాణ పుస్తకం ఆవిష్కరణ ఫోరం నిర్వహించిన సభలోనే జరిగింది. పుస్తకాల విషయం కన్నా ఈ సభకు తెలంగాణకు చెందిన అన్ని వర్గాల మేధావులు, ప్రజాతంత్రవాదులు వచ్చారు. ఆ మధ్య కాలంలో ఇంత పెద్ద యెత్తున జరిగిన దాఖలాలులేవు. ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక వేదిక సభలకు కూడా అంతే ఆదరణ లభించింది.
అప్పటికే తెలంగాణ రచయితలు, మేధావులు ముందుకు తెచ్చిన వాదనలు, విశ్లేషణల కారణంగా తెలంగాణ ప్రత్యేకోద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమంగానో, విచ్ఛిన్నకర ఉద్యమంగానో చూసే వాదన వెనక్కి తగ్గింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వామపక్షాలు ఈ వాదనలతోనే గెలిచే ప్రయత్నాలు చేశాయి. ఈసారి వాటికి అటువంటి వాదనలు చేసే అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ సాంస్కృతిక వేదిక అవగాహన పత్రం మరింత స్పష్టత ఇవ్వడంతో వామపక్షాలు ఆ వాదనలను చేయలేని స్థితిలో పడ్డాయి. క్రమంగా సిపిఐ తెలంగాణకు అనుకూలంగా మారగా, సిపిఎం మాత్రం తమది సమైక్యవాదమేనని పట్టుకుని కూర్చుంది. అయితే, తెలంగాణ అంశాన్ని నాన్చడాన్ని వ్యతిరేకించడం ద్వారా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి భౌతికమైన వ్యతిరేక ఉ్యదమాన్ని నిర్మించకపోవడం సిపిఎం వేసిన ముందడుగుగా చెప్పవచ్చు. ఇది తెలంగాణ మేధావులు సాధించి పెట్టిన విజయం. దీంతో కొన్ని వర్గాలకు, ముఖ్యంగా దళిత వర్గాలకు చెందిన ఆంధ్ర మేధావుల ఆమోదాన్ని తెలంగాణ ఉద్యమం పొందింది.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడింది. దీంతో తెలంగాణ ఉద్యమ విస్తరణకు అవకాశం ఏర్పడింది. ప్రజా సంఘాలపై, వాటి కార్యకర్తలపై అమలు చేస్తూ వచ్చిన నిర్బంధ స్థాయి తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణలోని గ్రామాల్లో యువత ఊపిరి తీసుకోవడానికి అవకాశం చిక్కింది. తెలంగాణ యువత మళ్లీ స్వేచ్ఛగా సంచరించే వాతావరణం ఏర్పడింది. దీనికంతటికీ మూలకారణం - పార్లమెంటరీ, ప్రత్యామ్నాయ రాజకీయాలకు మధ్య ప్రజాస్వామిక ఉద్యమం నడిపే వెసులుబాటు ఉందనే కొద్ది మంది తెలంగాణ మేధావుల నిరంతర కృషి ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రజా సంఘాలను అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తించడం వల్ల, దాన్ని అధిగిమించే వ్యూహం తెలిసినవారి చేతుల్లో ఉద్యమం ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించింది. తెలంగాణలోనే విప్లవ, కమ్యూనిస్టు శ్రేణులు పెద్ద యెత్తున తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ వాతావరణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది.
తెలంగాణలోని కొత్త తరానికి పార్లమెంటరీ రాజకీయాల్లో అస్తిత్వాన్ని చాటుకునే అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమ అవసరంపై, తెలంగాణ ఉద్యమ లోతుపాతులపై అవగాహన లేని చాలామంది ఆ ఎన్నికల్లో గెలిచారు. వారిని గెలిపించడానికి బియ్యాల జనార్దన రావు వంటివారు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. తీరా, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు కింది స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ముందుకు వచ్చి, అసలు లక్ష్యాన్ని పట్టించుకోకుండా ఆధిపత్య, ఆధిర్య భావనలకు గురయ్యారు. ఈ పరిస్థితిని పసిగట్టిన బియ్యాల జనార్దనరావు తనతో కలిసి వచ్చేవారితో తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేశారు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఆయన అకాల మరణం పొందారు.
భౌగోళిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉద్యమంతో తెలంగాణ బౌద్ధిక క్షేత్రంలో ప్రాతినిధ్యం మారింది. ఆ మారిన ప్రాతినిథ్యం పాత నాయకత్వాలకు మింగుడు పడలేదో, తాము ప్రజానీకం కోసం నడుపుతున్న ప్రత్యామ్నాయ రాజకీయోద్యమానికి విఘాతంగా మారుతుందని భావించారో తెలియదు గానీ పార్లమెంటరీ పంథాను నిరసించే శక్తులు తెలంగాణ వేదికల్లో నాయకత్వంలోకి వచ్చాయి. అలా రావడానికి పెద్ద సంఘర్షణ చేశాయి. అంతవరకు ఉన్న నాయకత్వాన్ని దెబ్బ తీయడంలో అవి విజయం సాధించాయి. అయితే, ఆ నాయకత్వాలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు బలం సంతరించి పెట్టాలని చూస్తూనే పూర్తి పార్లమెంటరీ పంథాను ఎంచుకుని, ప్రజలను ఓటు యంత్రాలుగా మార్చుకున్న కెసిఆర్ నాయకత్వంలో ఒదిగిపోయాయి. దీంతో తెలంగాణ ఉద్యమాన్ని సరైన రీతిలో పెట్టే వెసులుబాటును కోల్పోవడంతో పాటు తటస్థ శక్తులు, వ్యక్తుల మద్దతును కోల్పోయాయి. మొత్తంగా తెలంగాణ వేదికలు పరిమితులకులు లోనయ్యాయి. ఆత్మవిమర్శ చేసుకునే తీరిక, వెసులుబాటు కూడా లేనంతగా ఆచరణలో మునిగిపోయాయి. తెలంగాణ ఏ మరుపు కారణంగానేతై విధ్వంసం అవుతూ వచ్చిందో ఆ మరుపు లక్షణాన్ని చాలా వేగంగా తిరిగి సొంతం చేసుకుంది.
తెలంగాణ ఆస్తిత్వాన్ని అన్ని రంగాల్లో చాటడానికి అవసరమైన యాదిని పొందుతున్న తరుణంలో పది, పన్నెండేళ్లనాటి సంఘటనలను, విషయాలను మరిచిపోయే థకు చేరుకుంది. ఉద్యమం విస్తృతమవుతున్న కొద్దీ పాత శక్తులను ఇమిడ్చుకుంటూ కొత్త శక్తులు నాయకత్వంలోకి రావడం వల్ల మేలు జరుగుతుంది. కానీ అంతకన్నా పాత శక్తులు కొత్త శక్తులను తుడిచిపెట్టేసి కొత్త కార్యకర్తలను వెతుక్కుని, కొత్త కార్యకర్తలను చేర్చుకునే ఆచరణను చేపట్టాయి. దీనివల్ల అన్ని ప్రత్యామ్నాయ ఉద్యమాల మాదిరిగానే తెలంగాణ ప్రజా ఉద్యమాలు కుదింపునకు గురయ్యాయి.
అయితే, తాము కుదింపునకు గురి కాలేదని, తెరాస ఎన్నికల పోరాటంవల్ల బలోపేతం అయ్యామని అనుకోవచ్చు. తెలంగాణ వేదికలు కొన్ని ఎన్నికల రాజకీయాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా కార్యాచరణను అమలు చేస్తుంటే, మరికొన్ని వాటిని వ్యతిరేకిస్తూ సమాంతర ఉద్యమాలను నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల పోరాటాన్ని సమర్థిస్తున్న వేదికలను వాడుకోవడంలో కెసిఆర్ ప్రదర్శిస్తున్న వ్యూహం ఉద్యమం ఉండాల్సినవారి చేతుల్లో లేకుండా పోయే పరిస్థితిని కల్పిస్తున్నది.
తెరాస ఎన్నికల పోరాటాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. అది తప్పు అని చెప్పడానికి కూడా లేదు. ఇప్పటికిప్పుడు అదే బలమైన, వాంఛనీయమైన వేదిక. అలా మారడానికి మిగతా మేధావులు, రచయితల చేతుల్లో ఉన్న తెలంగాణ వేదికలు కుదింపునకు గురి కావడమైనని గుర్తించాల్సి ఉంటుంది. తెరాస ఉద్యమాన్ని బలపరుస్తూనే అందులోని పెడధోరణులను, ఏకపక్ష వైఖరులను వ్యతిరేకించడానికి తగిన ప్రభావశీలాన్ని ప్రదర్శించడానికి స్వతంత్ర బలాన్ని సంతరించుకోవాల్సి ఉండింది. కానీ అది జరగడం లేదు.
ఎన్నికల్లో తెరాసను బలపరుస్తూ, విడిగా ఓ బలమైన ఉద్యమాన్ని సమాంతరంగా నిర్మించాల్సి ఉండింది. అలా చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న రావచ్చు. తెలంగాణ పట్ల అవగాహన లేనివారు, దాని ద్వారా ప్రయోజనం పొందాలనుకునేవారు ఉద్యమంలోకి పెద్ద యెత్తున చొరబడి ఆధిపత్యంలోకి రాకుండా చూడడానికి అది అవసరం. తెరాస మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు సారంలో తెలంగాణ ఉద్యమానికి విఘాతంగా మారుస్తూ వచ్చాయి.
తెలంగాణ ఉద్యమంతో తెరాస ఇచ్చిన అవకాశంతో పార్లమెంటరీ రాజకీయాల్లో అస్తిత్వం చాటుకున్నవారే ఇప్పుడు మింగుడు పడని నాయకులుగా మారిపోయారు. దానికి తెరాస నాయకత్వాన్ని నిందించడానికి ముందు వరుసలో ఉంటున్నారు. కెసిఆర్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ రకంగా ప్రాంతేతర ఆధిపత్య శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు. దాన్ని ఆసరా చేసుకుని తెలంగాణ ముసుగులోనే కాంగ్రెస్, తెలుగుదేశం నాయకత్వాల ఆధిపత్యం కొనసాగడానికి దోహదం చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఇటు తెలుగుదేశం నుంచి గానీ అటు కాంగ్రెస్ నుంచి గానీ తెలంగాణ నాయకులే గొంతులు చించుకుని ప్రసంగపాటవాలను ప్రదర్శించారు. శాసనసభలో వారు చేసిన ప్రసంగాలను బట్టి, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మార్చి 16వ తేదీన మీడియా సమావేశంలో మాట్లాడిన తీరును గానీ జాగ్రత్తగా పరిశీలిస్తే తెలంగాణ రాదనే విషయం తేటతెల్లమైంది. తమకు తెలంగాణ రాష్ట్రం అవసరం లేదనే వైఖరిని దానం నాగేందర్ బాహాటంగా ప్రదర్శిస్తే మిగతావాళ్లు నర్మగర్భంగా తెలియజేశారు. తెరాసతోనే చట్ట సభలో అడుగు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్న తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆ విషయం ఇదివరకే చెప్పారు. పైగా తెలంగాణ ఉద్యమ శక్తులను అడ్డుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. ఈ పరిస్థితి రావడానికి కారణం తెలంగాణలో క్రమంగా పేరుకుపోతున్న నిర్లిప్తత, తెరాస ఉనికిని దెబ్బ తీస్తే నయాన్నో భయాన్నో ఇతర శక్తులను అణచివేయచ్చుననే ధీమా కారణం కావచ్చు. తెరాసకు సమాంతరంగా స్ఫూర్తిమంతమైన, ఉద్వేగపూరితమైన ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు అనే అవగాహనకు మేధావవర్గం గురికావడం కూడా కారణం కావచ్చు. సరైన సందర్భంలో సరైన అవగాహన, ఎత్తుగడలను తెరాసకు అందించే శక్తుల గొంతులకు స్థానం లేకపోవడం వల్ల లేదా పార్లమెంటరీ రాజకీయాల వెర్రితలలపై అవగాహన లేని శక్తులు మాత్రమే తెరాసకు సలహాదారులుగా మిగలడం వల్ల అలా జరిగి వుంటుంది. ప్రశ్నించడం ద్వారా లేదంటే నాయకత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి వేరే మార్గాన్న చూపించడానికి జంకిన సలహాదారుల వల్ల అది జరిగి వుంటుంది.
స్థానిక సంస్థల్లో విజయ దుందుభి మోగించిన మరుక్షణమే అన్ని రాజకీయ పార్టీల్లోని అవలక్షణాలే తెరాసలోనూ తలెత్తాయి. ఈ విజయంతో పరిస్థితిని కాంగ్రెస్ అధిష్టానం పసిగట్టింది.ఆ వెంటనే 2004 సాధారణ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఇష్టం లేకపోయినా తెరాసతో ఎన్నికల పొత్తు కోసం తాపత్రయ పడింది. తెలుగుదేశం పార్టీని దించడానికి కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 42 మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోరుతూ కాంగ్రెస్ అధ్యకక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం ఇవ్వడం వెనక పెద్ద కథే ఉంది. దాని ఊసు ఇప్పుడు అవసరం లేదు. కాంగ్రెస్ తమతో పొత్తు పెట్టుకోవడానికి అత్యుత్సాహం ప్రవర్శించడం కెసిఆర్ ఆలోచనను కప్పిపెట్టి ఉంటుంది. నిజానికి, కెసిఆర్‌ను మించిన వ్యూహకర్త ప్రస్తుతం పార్లమెంటరీ రాజకీయాల్లో లేడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జన్మభూమి వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడంలో కెసిఆర్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే, పార్లమెంటరీ రాజకీయాల పట్ల, కాంగ్రెస్ తీరు పట్ల అంతగా పరిచయం లేని జయశంకర్ వంటి మేధావుల పాత్ర కూడా కెసిఆర్ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడి ఉంటారు.
కాంగ్రెస్‌తో ఒప్పంద పత్రం రాసుకునే విషయంలో గట్టి పట్టు పట్టాల్సి ఉండింది. ఒప్పంద పత్రం తీరుపై కొంత మంది నాయకులు అభ్యంతరం చెప్పారు కూడా. ఆ తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాల్లో చేరింది. ఇది పెద్ద తప్పిదమే అయింది. ఒప్పంద పత్రం రాసుకునే విషయంలో పెట్టిన మెలికలను బట్టే కాంగ్రెస్ ఆంతర్యం అర్థమై పోయింది. మోసం చేయడానికి అవసరమైన లొసుగులన్నీ అందులో ఉన్నాయి. అయితే, కెసిఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలను గట్టిగా నమ్మే ఉంటారు. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌తో నడవడానికి సిద్ధపడి ఉంటారు. అయితే, తెరాస అప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా సరే, ఒంటరిగానే పోటీ చేస్తామనే నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదేమో. కాంగ్రెస్ పార్టీ ఓ వైపు మిత్రపక్షంగా పరిగణిస్తున్నామని చెబుతూనే మరో తెరాసను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.రాజీనామాలు, ఉప ఎన్నికలను ఎప్పటికప్పుడు ముందుకు తెచ్చి, తెలంగాణవాదం బలాన్ని చాటినా కాంగ్రెస్‌లో కదలిక రాలేదు.
ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పూర్తిగా తెరాసను నీరు గార్చిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధ్యకక్షుడు నారా చంద్రబాబు నాయుడిని నమ్మడం పెద్ద తప్పిదమని సీట్ల పంపకం నుంచి ఫలితాలు సాధించే వరకు జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. కెసిఆర్ ఎక్కువ సీట్లకు పట్టుబట్టారు గానీ ఏయే సీట్లు తీసుకోవాలనే విషయంపై తెలిసో, తెలియక శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తున్నది. అప్పటికే తెలంగాణ మేధావి వర్గం పూర్తిగా కెసిఆర్ మాయలో పడిపోయింది. అయితే, తెలుగుదేశంతో కాకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుందామని తాను చేసిన సూచనను పార్టీ నాయకులు కొంత మంది పడనీయలేదని కెసిఆర్ ఇటీవల అన్నారు.
అసలు విషయానికి వస్తే - సీట్ల కేటాయింపు ఏ మాత్రం అవగాహన లేని రీతిలో జరిగింది. నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్ శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి వుంటే తప్పకుండా గెలిచి ఉండేది. తెరాస హైదరాబాదులో, దాని పరిసరాల్లోని సీట్లు తీసుకుంది. నాంపల్లి, మహేశ్వరం సీట్లు ఇందుక ఉదాహరణ. తెరాస తీసుకున్న ఇటువంటి సీట్లలో చాలా వరకు కాంగ్రెస్ గెలిచింది. అంటే, కెసిఆర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించారని అనుకోవాలా? ఇదే సమయంలో పొత్తు ధర్మాన్ని చంద్రబాబు సరిగా పాటించలేదు. ప్రభుత్వ వ్యతిరేకతతో తమ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందనే అతి నమ్మకం చంద్రబాబు కొంప కూడా ముంచింది.
బీ ఫారాల విషయంలో ముందుగానే గందరగోళం సృష్టించిన తెలుగుదేశం పార్టీ తెరాసకు ఓట్లేసినట్లు లేదు. వామపక్షాలు అసలే దూరంగా ఉన్నాయి. ఏలాగూ గెలుస్తున్నాం, తెరాస బలాన్ని తగ్గిస్తే సరిపోతుందనే వ్యూహంతో చంద్రబాబు వ్యవహరించారని చెప్పవచ్చు. అయితే, అనూహ్యంగా సీమాంధ్రలో ప్రజారాజ్యం, లోక్‌సత్తా కాంగ్రెస్‌ను కాకుండా తెలుగుదేశం పార్టీనే దెబ్బ తీశాయి. తెరాసతో పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆ మాత్రం సీట్లు కూడా వచ్చేవి కావు. ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుచుకున్న సీటును ఒంటరిగా పోటీ చేసినా తెరాస గెలిచి ఉండేది. నల్లగొండ జిల్లా భువనగిరి సీటు పరిస్థితి అదే. ఇటువంటి సీట్లను తెరాస పొత్తు కారణంగా ఎన్ని వదులుకుందనే లెక్కలు తీయాల్సే ఉంది. పొత్తు కారణంగా బలమైన నాయకులను కొందరి తెరాస వదులుకోవాల్సి వచ్చింది. కెసిఆర్ తీరుపై మండిపడుతూ అటువంటి నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.
చంద్రబాబు నాయుడు పొత్తును నిజాయితీగా అమలు చేసి వుంటే, తాను గెలిచే సీట్లను తెరాసకు ఇచ్చి, తెరాస గెలిచే సీట్లను తాను తీసుకుని ఉండేవారా అనేది ప్రశ్న. కెసిఆర్‌కు చెప్పేసి, అటువంటి తెలంగాణకు చెందిన పెద్దల ముందు పెట్టాల్సి ఉండింది. ఎన్నికల్లో గెలవగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి జూలు విదిల్చి తన విశ్వరూపం ప్రదర్శించడానికి సిద్ధపడ్డారు. తెలుగుదేశం, తెరాస నాయకులను పార్టీలోకి పెద్ద యెత్తున లాగుతూ వెళ్లారు. ఈ దెబ్బకు చంద్రబాబు నాయుడితో పాటు చంథ్రేఖర రావు విలవిలలాడిపోయారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే ఈ పార్టీలకు నామరూపాలు కూడా ఉండేవి కావని ఇప్పటికీ చాలా మంది భావిస్తూ ఉంటారు.
పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి రోశయ్య ప్రభుత్వ హయాంలో కెసిఆర్ మాస్టర్ ప్లాన్ వేసి ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. అప్పటి సంఘటనలు, వాటి పర్యవసనాలు, పరిణామాలు అందరికీ తెలిసినవే. వచ్చిన తెలంగాణ వెనక్కి పోయిందనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వాదన. తెరాస ప్రధానంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యం చేసుకుంది గానీ కాంగ్రెస్‌ను లక్ష్యం చేసుకోలేదు. ఆ తర్వాత కూడా కెసిఆర్ కాంగ్రెస్‌ను నమ్ముతూ వచ్చారు. బహుశా ఇప్పటికీ నమ్ముతున్నారేమో తెలియదు. తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కెసిఆర్ కాంగ్రెస్ అనుకూల వైఖరిని నర్మగర్భంగానే అయినా తప్పుపడుతూ వచ్చారు. అయితే, ఇటువంటి సందర్భాల్లో ఆమె మళ్లీ బిజెపిలో చేరడానికి సిద్ధపడుతున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. పలు బహిరంగ సభల్లో కెసిఆర్ ఆమెకు తన పక్క సీటు ఇస్తూ కూడా ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఇందులోనే ఆంతర్యం ఎవరికీ అంతు పట్టడం లేదు.
తెలంగాణ ప్రక్రియను ఏర్పాటు చేస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర హోంమంత్రి పి చిదంబరం ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులను కూడగట్టి ఆ ప్రకటన వెనక్కి పోవడానికి చంద్రబాబు కారణమయ్యారనే విషయం నిజమే కావచ్చు. కానీ, తెలుగుదేశం పార్టీ వైఖరితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ముందుకు వెళ్లడానికి వీలు ఉండింది. కానీ, రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రాంతాలవారీగా విభజన ఏర్పడడం కారణంగానే తెలంగాణ ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గిందనేది అసలు నిజం. కాంగ్రెస్ కచ్చితంగా తెలంగాణకు కట్టుబడి ఉంటే, సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పి గానీ, వెళ్లిపోయేవారు వెళ్లిపోనీ అని అనుకుని గానీ కచ్చితంగా వ్యవహరించి ఉంటే తెలుగుదేశం పార్టీ అభిప్రాయంతో పని ఉండేది కాదు. తనను తాను రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును బూచీగా చూపించింది. ఇప్పటికి కూడా తెలంగాణపై అన్ని విషయాల్లో మాదిరిగానే ఒక రాజకీయ పార్టీ ఒకే వైఖరి కలిగి ఉండాలనే విషయం కేంద్రం చెప్పి ఉంటే సమస్య కొలిక్కి వస్తుంది. కాంగ్రెస్ కచ్చితమైన నిర్ణయం తీసుకోవడానికి సంసిద్ధం కావడం లేదు. ఏదో రూపంలో తెలంగాణ అంశాన్ని దాటవేయడానికి మాత్రమే చూస్తున్నది. శ్రీకృష్ణ కమిటీని వేసి కాంగ్రెస్ పెద్ద నాటకమే ఆడింది. దానికి ఎక్కడలేని ఆడంబరం చేసింది. శ్రీకృష్ట కమిటీ ఇచ్చిన నివేదికలాంటి నివేదికను ఇంతకు ముందు ఈ కమిటీ ఇచ్చి ఉండదనే అనిపిస్తున్నది. ఒక అంశాన్ని వివిధ కోణాల నుంచి అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి ఏ కమిటీ అయినా సూచనలు చేస్తుంది. ఆ సిఫార్సులను అమలు చేయాలా, వద్దా అనేది ప్రభుత్వ ఇష్టం. శ్రీకృష్ట కమిటీ మాదిరిగా పరస్పర విరుద్ధమైన సూచనలు ఏ కమిటీ కూడా చేసి ఉండదు. అటువంటి కమిటీలో మేధావులని చెప్పుకునేవారు ఎలా కొనసాగారో అర్థం కాదు. పరిష్కరించాల్సిన అంశాలనే శ్రీకృష్ట కమిటీ పరిష్కారాలుగా చూపింది. వాటినే ఆ కమిటీ ప్రత్యామ్నాయాలని చెప్పింది. కమిటీ వల్ల సమస్యకు పరిష్కారం లభించలేదు సరి కదా, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి విలువైన కాలం వృధా అయింది.
యధాతథ స్థితిని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వ అవలక్షణాలకు, స్థిరమైన నిర్ణయం తీసుకోలేని అసమర్థతకు అనుగుణంగా వ్యవహరిస్తున్నది. తాను నిర్ణయం తీసుకోలేక, దాన్ని ఇతర పార్టీల మీదికి నెడుతూ వచ్చింది. చివరికి, కొత్త హూంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు కాస్తా కదిలించడానికి సిద్ధపడినట్లే కనిపించారు. కానీ, దానిపై సోనియా గాంధీ దెబ్బ పడింది. మళ్లీ ఏకాభిప్రాయం పేరుతో, చర్చలు జరుపుతున్నామనే పేరుతో తెలంగాణ అంశాన్ని ఎక్కడ ఉందో అక్కడే కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వాలు నిలబెడుతున్నాయి. తెలంగాణ అంశం కాంగ్రెస్ చేతితో ఊయల లాగా కిందికీ పైకీ ఊగుతున్నది, చివరికి పరిష్కారం లేకుండా ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోతున్నది. ఇది కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే జరుగుతున్నది.
తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, దానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్‌లు చెప్పాయి. అయితే, కచ్చితంగా తెలంగాణకు అనకూలంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేవు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం చేసే స్థితిలో లేవు. ఆ పార్టీకు చెందిన సీమాంధ్ర నాయకులు వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు. కానీ, అది కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఆటంకమేమీ కాదు. అయినా సరే, తెరాస, తెలంగాణ జెఎసిలు ఆ రెండు పార్టీలనే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం గమనించవచ్చు. ఇది ఎవరి దృష్టి నుంచి కూడా తప్పిపోవడంలేదు. కానీ, ఆ వైఖరే సరైందనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉండవచ్చు.
కాంగ్రెస్‌ను లక్ష్యం చేసుకుని కెసిఆర్ పెద్ద యెత్తున మాట్లాడినప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత తెరాస శాసనసభ్యులు హరీష్‌రావు, కెటి రామారావు వంటివారు కాంగ్రెస్‌పై ధ్వజమెత్తుతున్నారు. కెసిఆర్ మాత్రం అంత గట్టిగా మాట్లాడడం లేదనే అభిప్రాయం ఉంది. ఇటువంటి స్థితిలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి కెసిఆర్ సిద్ధపడుతున్నారు. దానికి సిద్ధపడుతూనే తనపై బరువును దించుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు.
అది ఏ విధమైన బరువు అనేది తెలుసుకోవడానికి ముందు మరో విషయం కాస్తా చెప్పుకుంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మరికొంత స్పష్టత వస్తుంది. కెసిఆర్ ధోరణులు నచ్చక ఇతర నాయకులు పెట్టిన తెలంగాణ పార్టీలేవీ నిలబడలేదు. అలా నిలబడకపోవడానికి కారణం మొదటి నుంచి ఉన్న కెసిఆర్‌ను నమ్ముకోవడమే మంచిదనే అభిప్రాయం చాలా మందికి ఉండడం కారణం కావచ్చు. అయితే, ఇందులో మరో రహస్యం ఉంది. కెసిఆర్‌తో విభేదించినవారు ఇతర నాయకులను ముందుకు తోశారు. అలా తోసినప్పుడు ఆ నాయకులు మంచి ఊపుతో ముందుకు రావడానికే సిద్ధపడ్డారు. కానీ, తెలంగాణ కోసం ఏర్పడే ఏ పార్టీనైనా, సంస్థనైనా సమర్థిస్తామనే చెప్పే కెసిఆర్ అనుకూల మేధావి వర్గం ఆ పార్టీలను ఎదగకుండా చేశాయి. కెసిఆర్ వద్ద ఏ మేధావి వర్గమైతే పనిచేస్తుందో ఆ మేధావి వర్గమే కొత్త తెలంగాణ పార్టీల ఏర్పాటు సన్నాహక సమావేశాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చారు. నిజంగానే రెండో పార్టీని ఆహ్వానిస్తున్నారా అనే అనుమానం రానంతగా వ్యవహారాలు నడిపారు. అలాంటి మేధావుల అభిప్రాయాలే, వ్యూహాలే కొత్త పార్టీ నాయకులు కూడా ఎంచుకోవడం వల్ల ముందుకు వెళ్లే తోవలు మూసుకుపోతూ వచ్చాయి. ఆలే నరేంద్ర విషయంలో గానీ, దేవేందర్ గౌడ్ విషయంలో గానీ అదే జరిగింది. తెరాసలోని లోపాలను గుర్తించి, అటువంటి లోపాలు లేకుండా పార్టీని నడిపే ఆలోచనలు గానీ వ్యూహాలు గానీ ఎంచుకునే వెసులుబాటు వారికి లభించలేదు. తన మార్గంలోకి, అంటే తెరాసలోకి వస్తేనే తెలంగాణ ఉద్యమం చేసినట్లు అనే విషయాన్ని కెసిఆర్ స్పష్టంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారిని తన పార్టీలో చేర్చుకోవడానికి వారిని ప్రశంసిస్తూ, తెలంగాణవాదులుగా చెబుతున్నారు. పొన్నం ప్రభాకర్, మందా జగున్నాథం వంటి వారిని కెసిఆర్ ప్రశంసిస్తున్నారు. కానీ, వారు కాంగ్రెస్‌లో ఉంటూనే వీర తెలంగాణవాదులుగా ముద్రలు వేయించుకుని తెరాసపైనే గెలవడానికి ఎత్తులు వేస్తున్నారనే ఆలోచన కెసిఆర్‌కు గానీ తెలంగాణ ఉద్యమ నేతలకు గానీ వస్తున్నట్లు లేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు వేసిన ఎత్తులు అవే.తాము తెలంగాణ సాధన విషయంలో వెనకబడిపోలేదని చాటుకోవడానికి, ఆ పేరుతో ప్రజల ముందు వెళ్లి తమ ప్రాబల్యం దెబ్బ తినకుండా చూసుకుంటూ ఉండవచ్చు. నిజానికి, అలాంటి వీర తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ మాత్రం వెసులుబాటు లభించినా వైయస్సార్ కాంగ్రెస్‌లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం వంటివారు తెరాసలోకి వస్తారని గట్టిగా చెప్పలేం.
అంటే, ఉద్యమం మొదట్లో మాదిరిగా తెలంగాణవాదంతో ఎవరినైనా నిలబెట్టి గెలిపిచుకుంటామనే విశ్వాసం సన్నగిల్లడం వల్లనే కెసిఆర్ ఇతర పార్టీల ఎమ్మేల్యేలను, పార్లమెంటు సభ్యులను దువ్వుతున్నారని అనుకోవాలా? అయితే, వారిని తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆ పార్టీలను బలహీనపరుస్తున్నారని అనుకోవాలా? ఒకరు కాకపోతే మరొకరు పోటీ చేయడానికి ఆ పార్టీలకు దొరకుతారు. తెలంగాణకు, తమ పార్టీకి కట్టుబడి పనిచేస్తూ వస్తున్న నాయకులకు టికెట్లు ఇచ్చి వారిపైనే గెలవాలని కెసిఆర్ ఆదేశించలేరా, ఆ ఫలితాలను తాను నిర్దేశించలేరా అనేది సందేహం. హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి పలువురు శాసనసభ్యులు తెరాసతో ఉనికి చాటుకుని కాకలు తీరినవారే. మొదటి సారి తెరాస టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి, తెలుగుదేశంలోకి వెళ్లినవారు కూడా ఉన్నారు. అటువంటప్పుడు ఉద్యమంలో నిజాయితీగా పనిచేస్తూ తన పార్టీని అంటి పెట్టుకుని ఉన్నవారికి టికెట్లు ఇవ్వడం ద్వారా రాజకీయాల్లో కాకలు తీరిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టించలేరా? తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను, ఆ పార్టీల నాయకులను మొత్తంగానే దూరం పెట్టి తెలంగాణ నగారా సమితి, సిపిఐ, బిజెపి వంటి పార్టీలను కలుపుకుని ఒక విస్తతృ ప్రాతిపదికపై కూటమిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదా?
తాను, తన పార్టీ తప్ప మరొకరు, మరో పార్టీ ఉండకూడదనే కెసిఆర్ వ్యవహారం తెలంగాణ ఉద్యమాన్ని నష్టపరచడం లేదా? ఏకపక్షంగా అభ్యర్థులను పెట్టడం, ఏకపక్షంగా ఉద్యమ కార్యాచరణను నిర్ణయించడం, దానికి తెలంగాణ జెఎసిని సాధనంగా వాడుకోవడం కెసిఆర్ వ్యూహం. అది తెలంగాణ ఉద్యమానికి కూడా నష్టం. సిపిఐ, బిజెపి, తెలంగాణ నగారా సమితి అసాధారణమైన కోరికలను ముందు పెడితే మాట్లాడుకోవడానికి, వాటిని ఒప్పించడానికి తగిన యంత్రాంగం తెలంగాణలో ఉంది. ఈ విషయం కెసిఆర్‌కు తెలియంది కాదు. కానీ, ఆ పని చేయరు. అంతా తన చేతుల్లోనే ఉండాలని అనుకుంటారు.
మరో విషయం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన లక్ష్యం కావాల్సిన స్థితిలో వివిధ వర్గాలకు ఆయన హామీలు ఇస్తూ పోవడం, ఈ విషయంలో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యకక్షుడు నారా చంద్రబాబు నాయుడితో ఆయన పోటీ పడుతున్నారు. వివిధ వర్గాలను తన వైపు తిప్పుకోవడానికి ఆయన రిజర్వేషన్లు, రాయితీలు, సంక్షేమ పథకాలు, పదవులవంటివాటిని ఆశ పెడుతూ వస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడితే తెలంగాణను ఎలా తీర్చిదిద్దదలుచుకున్నారో ఒక భవిష్యత్తు ప్రణాళికను అందించి, అన్ని వర్గాలకు ఒక అవగాహన కల్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేయడం వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న పార్టీల నాయకులు ఇచ్చే హామీల మాదిరిగా హామీలు ఇవ్వడం వేరు అనే విషయాన్ని కెసిఆర్ గుర్తించినట్లు లేదు. ఆయా వర్గాలను ఎప్పటికప్పుడు సంతోషపెట్టి తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారే తప్ప సారంలో తెలంగాణ సాధన అవసరాన్ని గుర్తించేలా చేయడానికి తగిన భవిష్యత్తు ప్రణాళికను ముందు పెట్టడం లేదు. ఒక ఉద్యమ పార్టీగా కాకుండా ఓ పాలక పార్టీ మాదిరిగా తెరాసను మలిచేశారు.
కెసిఆర్ వచ్చే ఎన్నికలకు సిద్ధపడుతూ తనపై భారం దించుకుంటూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారనే విషయానికి వద్దాం. అస్త్రాలు ఇతర పార్టీలకు ఇచ్చి తనను యుద్ధం చేయాలని అడుగుతున్నారని ఆయన ఇటీవల పదే పదే అంటూ వస్తున్నారు. ఆ మాటల వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అని ఆలోచిస్తే పలు అనుమానాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి కెసిఆర్ సమాయత్తమవుతున్నారా లేదా తిరిగి అవే 15, 20 సీట్లు గెలుచుకుంటారా అనేది అనుమానంగానే ఉంటుంది. అంటే తాను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించకపోతే తెలంగాణను తెచ్చే శక్తి తనకు ఉండదని ఆయన కచ్చితంగానే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఎంపిక చేసుకున్న సీట్లను చూస్తే ఆయన గెలవడానికి సిద్ధపడినట్లుగా కనిపించదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేనివారిని అంటగట్టినా, ఇతర పార్టీలతో పొత్తులను తన ఇష్టప్రకారం చేసుకున్నా, తాను ఎలా వ్యవహరించినా సరే తన పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన భారాన్ని తెలంగాణ ప్రజల మీద మోపుతున్నారు. తగిన సీట్లు రాకపోతే తనను నిందించాల్సిన అవసరం లేదని, అందుకు ప్రజలు తమను తామే నిందించుకోవాలని, ఫలితాలకు తెలంగాణ ప్రజలే బాధ్యత వహించాలని ఆయన చెబుతున్నారు. అయితే, తెలంగాణ పార్టీని గానీ తెలంగాణ ఉద్యమాన్ని గానీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని, తన మాటను జవదాటని లేదా తాను నిర్దేశించిన చట్రంలోనే పనిచేస్తున్నవారిని విశ్వసించాలని ఆయన తెలంగాణ మేధావులకు కూడా నిర్దేశిస్తున్నారని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వచ్ఛందంగా పనిచేసిన తెలంగాణ మేధావులకు ఇప్పుడు అలా పనిచేసే వెసులుబాటు ఏ మాత్రం లేదు. వారు మద్దతు తెలపగలరు గానీ ప్రజలను ప్రభావితం చేసే పాత్రకు దూరమయ్యారు. అందుకు తెలంగాణ ఉద్యమ వేదికల నాయకుల నుంచి వారు నిందలు ఎదుర్కుంటూనే ఉన్నారు. ప్రశ్నిస్తే నోరు మూసుకునే విధంగా సవాళ్లను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు తెరాస చేతిలో తెలంగాణ ప్రజల పరిస్థితి అలా కాబోతుందా అనే సందేహం కలుగుతున్నది.
అయితే, ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానం కదలికలు, దిగ్విజయ్ సింగ్ ప్రకటనలు చూస్తుంటే తెలంగాణ వచ్చేట్లే కనిపిస్తోంది. కానీ, పూర్తి నమ్మకం కుదరడం లేదు. నిశ్చితార్థం పెట్టి, పెళ్లిని ఆపేసే కాంగ్రెసు వ్యవహారం అందరికీ తెలిసిందే.
- కె. నిశాంత్












Click it and Unblock the Notifications