రాయల తెలంగాణ ప్రతిపాదన: మరో కుంపటి

హైదరాబాద్‌: ఒక కుంపటిని ఆర్పడానికి కాంగ్రెసు అధిష్టానం మరో కుంపటిని రాజేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనతో ఇప్పటికిప్పుడు సమస్యలు తలెత్తకున్నా భవిష్యత్తులో కుంపటి రాజుకునే ప్రమాదం ఉంది. రాయలసీమ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక పరిణామాలను లెక్కలోకి తీసుకుంటే మరో కుంపటి రాజుకోవడం ఖాయమనే అనిపిస్తుంది. ఒకప్పుడు రాయలసీమ రత్న గర్భ కావచ్చు, రత్నాలను అంగళ్లలో పోసి అమ్మవచ్చు. అది నిజమో కాదో కూడా తెలియదు. ఎందుకంటే, పాలకుల చరిత్రే రికార్డు అయింది గానీ పాలితుల చరిత్ర రికార్డు కాలేదు. రాయలసీమలోని పాలెగాళ్ల వ్యవస్థను పరిశీలిస్తే ప్రజల స్థితిగతులేమిటో అర్థం కావచ్చు.

తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి రాయల తెలంగాణ ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి, మరోమాటలో చెప్పాలంటే ఆయన బలాన్ని చీల్చడానికి రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించడంలో మజ్లీస్‌ ప్రయోజనాలు కూడా రాజకీయపరమైనవే. ఇటు కాంగ్రెసు ఆ ప్రతిపాదనను ముందుకు తేవడంలో, మజ్లీస్ దానికి పచ్చజెండా ఊపడంలో కూడా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి తప్ప తెలుగు ప్రజల ప్రయోజనాలు అందులో ఇమిడి లేవనే విషయం తెలుస్తోంది.

రాయలసీమ పరిరక్షణ వేదిక నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా రాయల తెలంగాణ వల్ల సంభవించే ప్రమాదం పట్ల సరైన అవగాహన ఉన్నట్లు లేదు. చారిత్రక పరిణామ క్రమానికి సంబంధించిన పూర్తి విషయాలు లేకపోవడం వల్ల ఆయన సరిగా సమస్యను ముందుకు తేలేకపోతున్నారని అనుకోవాలి. లేదంటే, ఆయనకు కూడా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనే తపనే తప్ప రాయలసీమ ప్రయోజనాల పట్ల అంతగా ఆసక్తి లేదని అనుకోవాలి. నిజానికి, రాయలసీమ నేతలందరిలోనూ అది కొరవడినట్లే కనిపిస్తోంది.

Rayala Telangana

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర పాలకులతో కలిసి రాయలసీమ ప్రాంత పాలకులు పనిచేశారు. ఇప్పటికీ అదే వారసత్వం కొనసాగుతోంది. అయితే, అది కూడా ఎప్పటికప్పుడు అనుమానాలతోనే కొనసాగుతోంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి కోస్తాంధ్ర నాయకత్వంతో కలిసి పనిచేయడానికి రాయలసీమ నాయకత్వం అంగీకరించలేదు. కోస్తాంధ్ర నాయకత్వం పట్ల ఉన్న సందేహాలే అందుకు కారణం. తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనే సందేహాలు రాయలసీమ నాయకత్వానికి ఉంది. రాయలసీమ నాయకుల సందేహాలను తొలగించడానికి శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. రాయలసీమ ప్రయోజనాలను కాపాడడానికి ఆ ఒడంబడిక హామీలను ఇచ్చింది.

శ్రీబాగ్ ఒడంబడికకు ఆదిలోనే గండి పడింది. రాయలసీమలో ఏర్పాటు చేస్తామని చెప్పిన విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నం తరలించారు. కర్నూలు రాజధాని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల రద్దయింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పటికే అన్ని విధాలా హంగులు, ఆర్భాటాలు ఉన్న హైదరాబాదును రాజధానిగా అంగీకరించడానికి ఎవరికీ అభ్యంతరాలు లేకుండాపోయాయి. కానీ ఆ తర్వాతి చరిత్ర అంతా తెలంగాణకు వ్యతిరేకంగా నడిచిందనేది తెలంగాణ నాయకుల ఆరోపణ. ఆ ఆరోపణ నుంచి, వివక్షకు, అన్యాయానికి, అణచివేతకు, అవమానాలకు గురయ్యామనే భావనల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నలుగుతూ వస్తోంది.

మర్రి చెన్నారెడ్డి హయాంలో, ఇతర కాలాల్లో జరిగిన ఉద్యమానికి రూపంలోనూ సారంలోనూ ప్రస్తుత ఉద్యమానికి తేడాలున్నాయి. తెలంగాణ పాలకుల చేతుల్లో కాకుండా దండం ప్రజల చేతుల్లో ఉంది. మర్రి చెన్నారెడ్డి, కొంత మంది నాయకులు కాంగ్రెసు అధిష్టానం వద్ద ఒప్పందం కుదుర్చుకుంటే తెలంగాణ ఉద్యమం తాత్కాలికంగా అప్పుడు చల్లారింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేతులెత్తేస్తే దాన్ని అందుకోవడానికి నాయకత్వం సిద్ధంగా ఉంది. అంటే, బహు నాయకత్వం ఎదిగింది. అందులో భాగంగానే కాంగ్రెసు, తెలుగుదేశం వంటి పార్టీల నాయకులు కూడా తెలంగాణ గళం ఎత్తుకోక తప్పలేదు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడిస్తే తప్ప రాజకీయ పార్టీల నాయకులకు మనుగడ ఉండని పరిస్థితి ఏర్పడింది. దాంతో అన్ని పార్టీల నాయకులు కూడా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించక తప్పడం లేదు. ఇందులో వివిధ పార్టీల నాయకులు అటూ ఇటూ కదులుతుండవచ్చు. సమస్యను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించవచ్చు. కానీ తెలంగాణ డిమాండ్ నుంచి పక్కకు తప్పుకునే పరిస్థితి లేదు. ఈ బహు నాయకత్వం కారణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఢిల్లీ పెద్దలకు కూడా అనివార్యంగా మారింది.

ఆ స్థితిలో విభజనకు మొగ్గు చూపుతున్న కాంగ్రెసు అధిష్టానం రాయల తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. దానివల్ల రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో అనంతపురం, కర్నూలు తెలంగాణలోనూ, చిత్తూరు, కడప జిల్లాలో కోస్తాంధ్రలోనూ కలుస్తాయి. ఆ రకంగా రాయల తెలంగాణ, రాయల ఆంధ్ర రాష్ట్రాలు రూపుదిద్దుకుంటాయి. అయితే, ఇలాంటి రాష్ట్రాల ఏర్పాటు వల్ల సమస్య మరో రూపంలో ముందుకు వచ్చే ప్రమాదం ఉంది.

భౌగోళికంగా రెండు విడిపోయిన రాయలసీమ ప్రాంత ప్రజలు మానసికంగా విడిపోతారని చెప్పడానికి వీలు లేదు. పైగా, అనంతపురం, కర్నూలు జిల్లాలు సామాజికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎక్కువ కాలం తెలంగాణతో కలిసిలేవు. దానివల్ల ఆ రెండు జిల్లాలు భవిష్యత్తులో తీవ్రమైన వివక్షకు, అన్యాయానికి, అణచివేతకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. తమ పట్ల జరుగుతున్న అన్యాయాలకు సానుకూలంగా ప్రతిస్పందిస్తున్న తెలంగాణ పాలక వర్గాలు భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతంలోని ఆ రెండు జిల్లాల పట్ల అన్యాయంగా ప్రవర్తించబోరనే గ్యారంటీ ఏమీ లేదు. ఆలాంటి పరిస్తితినే కోస్తాంధ్ర పాలక వర్గాల నుంచి చిత్తూరు, కడప జిల్లాల పట్ల వ్యవహరించరనే నమ్మకం కూడా లేదు. అందువల్ల రాయలసీమ ప్రయోజనాలకు రాయల తెలంగాణ వల్ల ప్రయోజనం ఊహకు సంబంధించింది మాత్రమే అవుతుంది.

ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో రాయలసీమ పట్ల చూపుతున్న వివక్ష పట్ల, చేస్తున్న అన్యాయం పట్ల వైయస్ రాజశేఖర రెడ్డి, ఎంవి మైసురా రెడ్డి వంటి నాయకులు ప్రత్యేక ఉద్యమాన్ని లేవనెత్తారు. వారు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయలేదు గానీ ప్రధానంగా నీటి సమస్యను ముందుకు తెచ్చారు. అది కూడా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి చేసిందే కానీ వాస్తవ సమస్యలను కూడా ముందుకు తెచ్చింది. అయితే, ఆ తర్వాత అవి మరుగున పడిపోయాయి. రాయలసీమ కోసం ఎన్టీఆర్ చేపట్టిన తెలుగుగంగ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల వల్ల, వాటిని విజయభాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి వంటివారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత విస్తరించడం వల్ల ఆ సమస్యలు కొంత తీరి ఉంటాయి. కానీ, రాయలసీమకు సంబంధించిన మొత్తం సమస్యలు తీరలేదు.

ఈ స్థితిలో రాయలసీమ ప్రాంత నాయకులు తెలంగాణను అడ్డుకోవడానికి తమ ప్రాంత వెనకబాటును ముందుకు తెస్తున్నారు తప్ప ఈ వ్యవహారంలో తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చారిత్రక క్రమంలో అర్తం చేసుకుని తగిన విధంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారని చెప్పక తప్పదు. అదే సమయంలో రాయల తెలంగాణకు అంగీకరిస్తే మొదటికే మోసం రావచ్చు. ఏమైనా, రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ వారి కన్నా ఎక్కుగా రాయలసీమవాళ్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల్లో విడివిడిగా ఉండే రాయలసీమ ప్రజలు ఏకమై ఉద్యమించే పరిస్థితి రావచ్చు.

- కాసుల ప్రతాపరెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+