• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చింతపట్ల క్విక్ బాక్సింగ్: వరాలిచ్చే దేవుళ్లు

|

అదో కాలం. అదో కాలంలో మనుషులకి దేవుళ్లంటే కావాల్సినంత భక్తీ ఉండాల్సినంత భయమూ వుండేవి. అందువల్ల మనుషులు గడ్డాలు పెంచుకుని, గాలి భోజనంతో సరిపుచ్చుకునీ, ఒంటి కాలుమీద నిలబడీ, చెట్లకు తలకిందులుగా వేలాడీ దేవుడి కోసం వందా వెయ్యీ పదివేల యేళ్లూ తపస్సు చేసేవారు. వీళ్ల తపస్సును తుస్సుమనిపించేందుకి సుడిగాలులు వీచేవి, సముద్రాలు వుప్పొంగి వూళ్లని ముంచేసేవి అగ్గి పర్వతాలు అల్లకల్లోలం చేసేవి ‘లక్కు' బాగున్నోళ్లు కొందరికి ‘డాన్సు' ప్రోగ్రాంలు చూసే అవకాశం వచ్చేది.

ఎట్టకేలకు ఘోర తపస్సు చేస్తున్న మనిషి ఎదటకి దేవుడు భయం లేకుండా వచ్చి నిలబడే వాడు. ఈ ‘ఫేస్ టు ఫేస్' కార్యక్రమంలో దేవుడు భక్తుడి భక్తికి మెచ్చి వరం కోరుకోమనే వాడు. అడిగిన వరాన్ని బట్టి కొద్దిగా ‘కిండిషన్లు' విధించి వరమిచ్చి మాయమైపోయేవాడు.

Quick Boxing: Chintapatla on God's sops

అదో కాలం కదా! ఎంతో కష్టపడితే (ఫేస్ టు ఫేస్) వేలాది యేళ్లు వూపిరి బిగపడితే కనిపించే దేముడు ఒకటే తప్పని పరిస్థితుల్లో మరో ఒకటో రెండో వరాలు యిచ్చేవాడు. ఇంకా ఇంకా వరాలు కావాలని మనిషికున్నా ఛాయిస్ వుండేది కాదు. దేవుడు ముందే షరతు విధించేవాడు ఒకటో రెండో అడుక్కో అని.

ఇప్పుడు మనంవున్నది అదో కాలం కాదు. ఇదో కాలం. దేవుడి కోసం పట్టుమని పది నిమిషాలు కూడా తపస్సు చేసే మనిషి ఎవడూ లేడు. దేవుళ్లంటే ఉండాల్సినంత భయమూ కావాల్సినంత భక్తీ వున్న మానవుడెవడూ లేడు. దేముడు క్కూడా మనిషి ఎదుటకి వచ్చి ‘ముఖాముఖీ' కార్యక్రమం చేసే ధయిర్యమూ లేదు. అందువల్ల, మనిషికి దేముడు వరాలివ్వడం అనేది లేనేలేదుండదు.

దేముడు వరాలివ్వనంత మాత్రాన మనిషి కొచ్చిన ‘లాసూ' ‘ప్రిస్టేజీ డామేజీ' అవడం ఏమీలేడు. ఎందుచేత?

ముక్కూ నోరూ కళ్లూ మూసుకుని మనిషి తపస్సు చేయకపోయినా ప్రత్యక్షమయ్యే దేవుళ్లు ఎందరో కలరున్నారు. తపస్సు చేయకపోయినా అడగక పోయినా, బ్రతిమాలుకుని, అడుక్కుని అనేక వరాలు ప్రసాదించే ప్రత్యక్ష దేవుళ్ల కాలం ఇదో కాలం.

కోరనిదే వరాలిచ్చే కొండంత దేముళ్లు అయిదేళ్లకు ఒక్కసారి ఊరూవాడా ఎండావానా తేడా లేకుండా ఎక్కే గడపా దిగే గడపగా వేంచేసి వొద్దు వద్దంటున్నా వొద్దు మొర్రోమంటున్నా వినకుండా అనేక వరాలు యిచ్చేసే కాలమిది అందుకే ఇది ఇదో కాలం. దేవుళ్లు మనుషుల దగ్గరికే వచ్చి ఒకళ్లమీద ఒకళ్లు పోటీ పడుతా వరాలు గుప్పిస్తూ అరచేతిలో వైకుంఠం చూపెడుతూ వుండే కాలమిది ఇదో కాలం. ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్లు మూసుకున్నావా? అనీ రా! దిగిరా! దివి నుంచి భువికి దిగిరా అని సాంగేసుకోనక్కర్లేదు. నువ్వడిగింది ఏనాడయినా కాదన్నానా? నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? అని భువిభూమ్మీద మీదనే వున్న దేవుళ్లు మామూలు మనుషుల చుట్టూ తిరుగుతూ. భజనగీతాలు ఆలపిస్తూ వరాల మూటలు మోసుకొస్తూ వుంటారు. ఏరుకో కోరుకో ఏంకావాలో కోరుకో అని అడుక్కుంటారు.

ఇదో కాలంలో దేవుళ్లు యివ్వని, యివ్వలేని వరమేదీ లేదు వుండదు. ఏ వరమయినా సరే అడగనవసరం లేదు. మనుషుల అవసరాలన్నీ ఆ దేవుళ్లకి తెల్సు. వాళ్లిస్తామనే వరాలు విని ‘అవురా' అనుకోని వారుండరు.

ఎర్రటి ఎండలో వరాలివ్వవచ్చాడో ప్రత్య దైవం. చుట్టూ చేరిన జనాన్ని ప్రశ్నించాడు ఎవరు మీరంతా? అని మేం పనీ పాటా లేనోళ్లం నిరుద్యోగులం అని అరచి గీపెట్టారు వాళ్లు. ఏం కావాలి మీకు? అనడిగాడు దేవుడు. పని కావాలి పాట కావాలి అన్నారెవరో! దేవుడు చిర్నవ్వునవ్వాడు అభయహస్తం చూపాడు. ‘పని అడక్కండి పాటలు పాడుకుంటూ ఎంజాయి చెయ్యండి' అన్నాడు. నిరుద్యోగులు అవాక్కయ్యారు. ఇదేం వరం అని కలవరపడ్డారు.

అపార్థం చేసుకోకండి పని అడక్కండి అంటే పని చేసే పని లేదని అర్థం. మీరంతా రోజూ ఉదయం నించి సాయంత్రం దాకా ఆఫీసుల్లో పని చేసి అలసిపోతే యిక పాటలేం పాడుతారు. అందుకని పని లేకుండానే జీతం ఉద్యోగం లేకుండానే బత్తెం. మీరెవ్వరూ ఉద్యోగాల్చేయకుండా మీకు నెలనెలా జీతం అందే ఏర్పాటు చేస్తే మీకేమైనా అభ్యంతరమా? అనడిగాడు దేవుడు.

పనీ పాటా లేని వాళ్లు ఎగిరిగంతులేశారు. ఈలలు వేశారు. హుశారుగా డాన్సులు చేశారు. నువ్వు మామూలు దేవుడివి కాదు దేవదేవుడివి ఇలాంటి వరం ఇచ్చిన దేవుడెవుడూ హిస్టరీ బుక్కులో లేనే లేడన్నారు.

ఎర్రటి ఎండలో వరాలివ్వ వచ్చాడింకో ప్రత్యక్ష దైవం. చుట్టూ చేరిన మహిళల్ని ప్రశ్నించాడు. మీకేం కావాలో అడగండి! ఏదడిగినా యిస్తాను అన్నాడు. ఖాళీ బిందెలు గాల్లోకి ఎగిరేస్తూ అంగలార్చారు ఆడవాళ్లు. తాగడానికి చుక్క నీరు లేదు. నాలుకలు ఎండిపోయి బయటకు వెళ్లు కొస్తున్నవి. దేవాది దేవా మంచినీళ్లీవా అనడిగారు వాళ్లు. దేవుడు చిర్నవ్వు నవ్వాడు. అభయ హస్తం చూపాడు. మీ తాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తాను. మీ కోసం చుక్కనీరు లేని ఈ వూళ్లో వాళ్ల కోసం ఒక బావి కాదు ఒక చెరువు కాదు ఒక నది కాదు కానే కాదు ఒక సముద్రం తవ్విస్తా చాలా అన్నాడు ఉత్సాహంగా వరమిస్తూ. ఆడవాళ్లందరూ ఆనందంగా బిందే బిందే తగిలించుకుంటూ కోలాటం ఆడుతూ ఆనందపడ్డారు. కానీ వాళ్లలో ఒక తెలివైన మహిళ ఆగండి బిందెగరెయ్యంగానే నీళ్లునిండవు. అసలు సముద్రమంటే ఏమిటి ఉప్పు. ఉప్పు నీళ్లు తాగుతామా.. థూ.. అని బిగ్గరగా దేవుడికి వినిపించేలా అరిచింది.

దేవుడు చిరునవ్వునూ అభయ హస్తాన్నీ కంటిన్యూ చేస్తూ.. అమ్మా! తల్లీ! కోప్పడకు. సముద్రంలో ఉప్పు నీళ్లుుండే మాట నిజమే కానీ నేను తవ్వించేది మంచి నీళ్ల సముద్రమమ్మా. ఇంతవరకూ లోకంలో ఎక్కడా లేని మినరల్ వాటర్ సముద్రమమ్మా అని జవాబిచ్చాడు.

ఆ అమ్మ ఆ తల్లి వరమిచ్చిన దేవుడ్ని ఆశీర్వదించింది. మిగతా వాళ్లంతా బిందెలు విసిరేసి ‘దేవుడికి జై దేవుడికి జై'అని అరిచారు.

ఎర్రటి ఎండలో వరాలివ్వ వచ్చిన మరో దేవుడు చుట్టూ కూడిన జనాన్ని అడిగాడు మీరంతా ఎవరు? అని. అప్పుడు వాళ్లల్లో ఒకడు ముద్దముద్దగా అన్నాడు. దేవదాసులం డోసుబాసులం అని. వారెవ్వరో వారికేం వరం యివ్వాలో దేవుడి ముక్కు పసిగట్టేసింది. మీ బాధ నాకర్థం అయ్యింది. రెక్కాడితే గానీ సీసా ఆడదు. ఆలినో అమ్మనో చావచితగ్గొడితే గానీ గలాసు ఎత్తలేరు అంటూ దేవుడు చిరునవ్వు నవ్వుతూ అభయహస్తం చాచాడు. మందు బాబులూ అభయ మిస్తున్నాను. ఇకనుంచీ మీకు మీ ఇళ్ల కొళాయిల్లోంచి ఒక గంట సేపు సారా సప్లయి చేయిస్తా చాలా అన్నాడు. తాగుబోతులంతా తూలి బొక్కబోర్లా పడి మళ్లీ లేచారు. వాళ్లు ఆనందపు కిక్కుని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్లలో ఒకడు సాయంత్రం సంగతి సరే మరి ఉదయం మాటేవిటి ‘హేంగోవర్' పెగ్గెవడిస్తాడు అని కసిరాడు. మరొకడు సారాల్లోకి సోడా ఎవరిస్తారు సామి దేముడా అని ఘొల్లుమన్నాడు.

దేవుడు చిర్నవ్వు నీ అభయ హస్తాన్నీ కంటిన్యూ చేస్తూ సాయంత్రం మేకాదు ఉదయం కూడా మీ కొళాయిల్లో ఓ గంటసేపు సారా, అలాగే ఓ పది నిమిషాలు రెండు పూటలా మీ కుళాయిల్లో సోడా సప్లయి చేయిస్తా చాలా అన్నాడు. దేవదాసులంతా జేబుల్లోంచి సీసాలు తీసి యివే ‘లాస్ట్ డ్రాప్స్' అంటూ ఖాళీ చేసి విసిరిపారేసి దేవుడికి జేజేలు కొట్టారు.

ఇదా లోకంలో ఇలా రకరకాలనేక రకాల వరాలు యిచ్చే దేవుళ్లు ఎందరో! ఎందరెందరో!!

- చింతపట్ల సుదర్శన్

English summary
A prominent columnist Chintapatla Sudarshan wrote about the political leaders promises during election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more