వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్ బాక్సింగ్: సత్యం శివం సుందరమ్

|
Google Oneindia TeluguNews

ఆరెంజ్ జ్యూస్‌లో నిమ్మకాయ చక్రంలా తేలుతున్నాడు సూర్యుడు. అన్ని కొండల మీదకి విసిరేసినట్టే వెండికొండ మీదకి కూడా లెక్కపెట్ట లేడు కనక లెక్కలేనన్ని కిరణాల్ని ‘దిల్‌దార్'గా విసిరి పారేశాడు. వెండికొండ పేరుకే కాని నిజంగా వెండికొండ కాదు కదా! మంచుకొండ మీద లేత ఎండ ఛమక్ ఛమక్ మంటున్నది.

ఎన్నడూలేంది ఎర్లీ మార్నింగే లేచి మానస సరోవరంలో ఈదులాడి ఫ్రెష్‌గా ఓ అయిస్ స్లాబ్ ముందు నుంచున్నాడు అతడు. ముఖం చూసుకోడానికి వేరే అద్దం లేకపోవడం వల్ల. మంచు మిరరయితేనేం మామూలు అద్దం కంటే ఎక్కువగానే తళతళలాడుతోంది. ముందు ఒళ్లంతా తనకిష్టమైన బూడిదని ‘బౌ'ల్లోంచి పిడికిళ్ల కొద్ది తీసుకుని పూసుకున్నాడు. అద్దం కాని అద్దంలో చూసుకుని ‘ఆల్‌ రైట్' అనుకున్నాడు. సాధారణంగా జడలు కట్టిన జుట్టుని పట్టించు కోడు కాని యివ్వాళ స్పెషల్ డే అనేమో జుట్టులోనే ఓ మూల దాచుకున్న చిన్న దువ్వెనని వేళ్ల మధ్య ఇరికించుకుని కొంచెం దువ్వుకుందామనుకున్నాడు. మొదలెట్టేడో లేదో కస్సుమంది తలకెక్కి కూచున్న బెటరాఫ్ రెండు, ‘జాగర్త', దువ్వెన ఇటేపురానీకండి ఏ మాత్రం సందు దొరికినా కిందికి దూకెయ్యాల్సి వస్తుందీ ‘గంగ' అంది.

Chintapatla sudarshan on eve of Sivaratri

ఈ ఆడవాళ్లు ఎంతసేపయినా డ్రెస్సింగ్ టేబిల్‌ని వదలరు గానీ మగాళ్లనీ అద్దంచూసుకోనీరు తల దువ్వుకోనీరు అని విసుకున్నాడు. సరే యింక ‘డ్రస్సప్' అవుదామనుకున్నాడు. కొంచెం స్టయిల్‌గా గజ చర్మం చుట్టుకున్నాడు. రుద్రాక్షల దండలు భుజాలకీ, మణికట్లకీ కట్టుకున్నాడు. మళ్లీ మళ్లీ అద్దంలో చూసుకున్నాడు.

అప్పుడొచ్చింది బెటారఫ్ ఒకటి. అప్పుడే రడీ అయిపోయావా డియర్ అంది ఆమె అతనికేసి ప్రేమగా చూస్తూ.

అవును. కాక.. ఇవ్వాళ.. 'ఓ' మధ్యలోనే అందుకుంది ఆమె ‘శివరాత్రి కదూ! సారీ మరిచేపొయ్యా! అందుకా ఈ మేకప్పు' అందామె పలువరస మీద కిరణాలు పడి మెరుస్తుంటే..

‘మేకప్పేం లేదు. నాకా అవసరం లేదు నా అందం సంగతి నీకు తెలీయందేం కాదు' అన్నాడు మొగుడు విల్లులాంటి పై పెదవిని కింది పెదవి నుంచి కాస్త ఎడంచేసి.

‘అందగాడివే కాదని ఎవరన్నారోయ్ కానీ వొళ్లంతా ఆ బూడిదేమిటి ఆ గజ చర్మం చుట్టుకోటమేంటి' అందామె ఆయన గారికేసి పరీక్షగా చూస్తూ..

‘అది నా కామన్ డ్రస్సే కదా. ఫార్మల్ డ్రస్సూ అదే కదా' అన్నాడు భర్త.

‘వోయ్.. నువ్వు వెళ్తోంది భూలోకం. శ్రీశైలమే వెళ్తావో కాళహస్తేనంటావో నేపాల్‌లో దిగుతావో నువ్వులేని చోటేలేదు కానీ ఫారెస్ట్ డిపార్టుమెంటు వాళ్లూరుకోరు. సల్మాన్ ఖానూ టబూ కేసులో యిరుకున్న సంగతి తెలీదు మీకు. గజ చర్మపుపులుంగీ అంగీకరించరక్కడ' అంది.

‘మరెలా? ఏం వేసుకోను? అన్నాడు భర్త డీలాపడి. ఇంతట్లో శివుడి వీపు మీద నించి జరజరా పాకింది ఆయనకిష్టమైన ‘కోబ్రా'. మెడలో ఓ రౌండ్ వేసుకుని ఆయన గడ్డం కిందుగా పడగ విప్పి నిలబడ్డది.

‘ఈ గజ చర్మపులుంగీ, పఫ్‌తో పైపైన రాసుకున్న పౌడర్లా కాకుండా ఒళ్లంతా దట్టంగా బూడిద దానికి తోడు ఈ మొబైల్ టై' ఒకటి. ఓ నల్ల కళ్లజోడు కూడా తగిలించుకోండి సరిపోతుంది పగటి వేషం‘ అంది భార్య ముక్కునీ మూతినీ రెండు అపోజిట్ డైరెక్షన్లల్లో తిప్పుతూ.

ఎక్కడ్నించో పరుగెత్తుకుంటూ వచ్చాడు నంది ‘మెరుగు పెట్టించిన త్రిశూలంతో. బాస్ మయుడి దగ్గర శైనింగ్ చేయించి పట్టుకొచ్చా'నంటూ అందించాడు.

‘సరిపోయింది. భూమ్మీద ఏకె47లూ రకరకాల పిస్టళ్లు.. ఈ ఓల్డు అవుట్ డేటెడ్ త్రిశూలం చూస్తే పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకుంటారు' అంది ఆవిడ. ఆవిడక్కాపోతే ఇంకెవరికంత ధయిర్యం.

‘సరే త్రిశూలమూ ఢమరుకమూ లేకుండా సింపుల్‌గా' వెళ్తా టై కూడా తీసేయమంటావా సరే అదీ ఓకే! మరి నువ్వు నావెంట రారాదూ' అన్నాడు భర్త.

‘ఒద్దులేవయ్యా శివరాత్రి అన్నారు కానీ ‘శివపార్వతి నైట్' అన్లేదు కదా. ఓ నమ:శివాయ అంటారు. హరహర మహాదేవ శంభోశంకర అంటారు గానీ నన్ను ఒక్కళ్లూ గుర్తు చేయరు కదా! భూమ్మీద ఎప్పుడు ఎవడు ఎవడ్ని ఎట్లా చావగొడ్తాడో తెలీదు కనక నువ్వు త్రిశూలం లేకుండా వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నా' అంది ఆమె.

‘భయం లేదమ్మా మీ ‘హజ్బెండ్' మామూలు వాడేం కాదు. నుదుటి మీద మూడవ కన్నుంది కదా అది చాలదూ లోకాలన్నీ హుష్ ఫటక్ మనవూ' అన్నాడు నంది.

‘ఎద్దయినా ఇంటెలిజెంట్‌వే' అని మెచ్చుకుంది ఆయన గారి భార్య.

ఈ గజ చర్మమూ, ఈ రుద్రాక్షలూ, ఈ బూడిదా ఈ నాగభూషణమూ, ఈ అగ్ని నేత్రం యివేనా శివుడంటే అన్నాడు భర్తా శివుడూ సత్యమూ సుందరమూ.

‘న' అంటే భూమి ‘మ' అంటే నీరు ‘శి' అంటే అగ్ని ‘వా' అంటే వాయువు ‘య' అంటే ఆకాశం ‘ఓం నమశ్శివాయ' అన్నది భార్య ఉమాచండీ గౌరీ.

శివుడూ పార్వతీ కైలాసం వదిలి రాలేదు.

ఓ నమ:శ్శివాయై! శంభో శంకర! హరహర మహదేవ! శివాలయంలో భక్తులు శివలింగాన్ని భక్తితో పూజిస్తున్నారు.

కైలాసం నించి నేలకుదిగిన ఓ మెరుపు శివలింగంలో ప్రాణశక్తిగా మెరిసింది.

- చింతపట్ల సుదర్శన్

English summary
An eminent columnist Chintapatla Sudarshan made his satire Quick Boxing enjoyable in the eve of Sivaratri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X