• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్సల్టెంట్లా, తెల్ల ఏనుగులా?

By Staff
|

న్యూఢిల్లీ: యుద్ధ సినిమాల పట్ల పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి కుర్షీద్‌ మెహమూద్‌ కసూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనలో నిజాయితీ వుంది. ఆలోచనాత్మక అంశం ఇమిడి వుంది. భారత్‌ వార్‌ సినిమాలు ఎక్కువగా నిర్మిస్తోందని ఆయన అన్నారు. నిజమే, దేశభక్తి ఉప్పెనలా పొంగి బాలీవుడ్‌ నిర్మాతలు యుద్ధ సినిమాలు నిర్మిస్తున్నారని చెప్పడానికి లేదు. బాలీవుడ్‌ కమర్షియల్‌ ప్రపంచం. ఏది అమ్ముడు పోతుందంటే దాన్ని నిర్మించి సొమ్ము చేసుకోవడానికి వెనకాడరు.

యుద్ధ సినిమాలు నిర్మించకూడదని, వాటిని ప్రజలు ప్రోత్సహించకూడదని కసూరి అన్నారు. భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ను కలుసుకున్న చారిత్రాత్మకమైన రోజునే కసూరి యుద్ధ సినిమాలపై తన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌, భారత్‌ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్న నేపథ్యంలో భారత్‌లో వార్‌ సినిమాల నిర్మాణం పెరిగింది. బాలీవుడ్‌ పది సినిమాలు నిర్మిస్తోంటే, కరాచీ, లాహోర్‌లలో మూడు నాలుగు సినిమాలు మాత్రమే నిర్మిస్తున్నాయని కసూరి చెప్పారు.

సినిమాల విషయంలో ఒక దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇంత సీరియస్‌గా మాట్లాడడమేమిటా అని ఆశ్చర్య కలగవచ్చు. కానీ ఆయన ఎంత పరిశీలనా దృష్టితో ఈ మాటలన్నారో గమనించడం అవసరం. బాలీవుడ్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీయడం చాలా కాలంగా వస్తోంది. మణిరత్నం నిర్మించిన రోజా ప్రభావం ఇంతా అంతా కాదు. అయితే, రోజా సినిమా కొంత కళాత్మకంగా నిర్మితమైంది. కాశ్మీర్‌ ఉగ్రవాదుల మీద ఆ సినిమాను ఎక్కుపెట్టారు. అమీర్‌ఖాన్‌ హీరోగా నటించిన సర్ఫరోశ్‌ సినిమాను కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత వరుసగా యుద్ధ సినిమాలు వచ్చాయి; వస్తున్నాయి. కార్గిల్‌, ఎల్‌ఒసి వంటి సినిమాలు మాస్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా వస్తున్నాయి. కసూరి బాలీవుడ్‌ సినిమాలను మాత్రమే చూసినట్లున్నారు. తెలుగు వంటి ప్రాంతీయ భాషల నిర్మాతలు తక్కువ ఏమీ తినలేదు.

ఉదాహరణకు తెలుగులో ఇటువంటి సినిమాలతో నిర్మాతలు పండుగ చేసుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఆజాద్‌ సినిమా అందులో ఒకటి. మరోటి రవితేజ వంటి హీరోలు నటించిన ఖడ్గం సినిమా. ఖడ్గం సినిమా కేవలం పాకిస్థాన్‌పై ద్వేషాన్ని వెళ్లగక్కడానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని ఇరు వర్గాల మధ్య విద్వేషాలను సృష్టించే దాకా వెళ్లింది.

బాధ్యతారహితమైన నిర్మాతలు, దర్శకులు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంభాషణలు సమకూర్చే చౌకబారు రచయితలు వీరావేశంతో విజృంభించడం కొనసాగుతూనే ఉంది. దేశం పట్ల భక్తి కన్నా కమర్షియల్‌గా సక్సెస్‌ చేసుకోవడానికి వీరు ఎంతకైనా తెగిస్తారు. వేడి వేడి బజ్జీలను మార్కెట్లోకి విసిరేసి దాని పరిణామాలను పట్టించుకోనివారు సినిమా రంగాన్ని ఏలుతున్నంత వరకు పరిస్థితి ఇలాగే వుంటుంది. సెక్స్‌నే కాదు, కాసుల పంటలు
పండిస్తాయంటే దేశభక్తిని కూడా వేలం వేసే మహామహులు సినిమా రంగంలో ఉన్నారు.

ఉగ్రవాదం వల్ల, ఇరు దేశాల మధ్య శత్రుత్వం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను, ప్రజా జీవితం దెబ్బ తింటున్న తీరును నేపథ్యంగా తీసుకొని సినిమాలు నిర్మిస్తే హర్షించాల్సిందే. కానీ ఒక దేశంపై మరో దేశం ప్రజలు ద్వేషాన్ని పెంచుకోవడానికి, ఒక దేశం ప్రజల పట్ల పూర్తి విద్వేషం నెలకొనడానికి ఈ సినిమాలు తోడ్పడుతున్నాయి. ఏ కళనైనా ప్రజల మధ్య సంబంధాలు విస్తృతం చేసేదిగా వుండాలి. దేశవిభజనకు సంబంధించి అద్భుతమైన కథలు వచ్చాయి. సాదత్‌సన్‌ మంటో రాసిన కథలు కలికితురాళ్లు. మానవీయ విలువల పట్ల ప్రేమను, రాక్షసత్వం పట్ల ద్వేషాన్ని పెంచే కళ ఎప్పుడైనా ఆదరణీయమే. కలకాలం నిలుస్తుంది కూడా.

ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని వస్తువుగా తీసుకొని బాలీవుడ్‌లోనూ, ప్రాంతీయ భాషల్లోనూ మంచి సినిమాలు రాకపోలేదు. కమర్షియల్‌ హడావిడి ముందు ఇవి కాస్తా దిగదిడుపే. బోర్డర్‌, ద్రోహకాల్‌ వంటి సినిమాలు ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తాయి. మంచి వైపు మానవుని దృష్టిని మళ్లిస్తాయి. ఈ దృష్ట్యా సినిమా నిర్మాతలపై కన్నా దర్శకులు, ఇతర కళాకారులపై బాధ్యత ఎంతో ఉంది. తన బాధ్యతను విస్మరించినవాడు ఎప్పుడూ కళాకారుడు కాలేడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X