• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమ్మ వర్సెస్ రెడ్డి

By Pratap
|

Chandrababu Naidu-YS Jagan
రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులాలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నాయని చాలా కాలంగా దళిత, బహుజన మేధావులు విమర్శలు చేస్తున్నారు. దళిత, బహుజన కులాల రాజ్యాధికారం కోసం వారు తగిన సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. రాష్ట్రంలో ఆ రెండు అగ్రకులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని పంచుకుంటున్నాయనేది ఆ వాస్తవం. మంత్రివర్గాల కూర్పును, ఎన్నికల్లో ఎంపికవుతున్న అభ్యర్థుల కుల సమీకరణాలను చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. అది ప్రస్తుతం తీవ్ర వైరుధ్యంగా మారింది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల సమస్య కూడా అదే. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేయడం, గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమంలో జగన్ ను లక్ష్యం చేసుకోవడం ఇందులో భాగమే. ఆదాయ వనరులపై పట్టుకు రాజ్యాధికారం ఒక పనిముట్టనే విషయం తెలిసిందే. అందుకే అధికారం కోసం జగన్ వర్గం కాంగ్రెసు అధిష్ఠానాన్ని ధిక్కరించే స్థాయికి పోయారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో కమ్మ కులానికి చెందిన పారిశ్రామిక, సంపన్న వర్గానికి పట్టు దొరికింది. నిజానికి, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అప్పటి వరకు కాంగ్రెసు పార్టీ ప్రాబల్యం, ఆ పార్టీలో రెడ్డి ఆధిపత్యం నిరాటంకంగా కొనసాగుతూ వచ్చింది. దాన్ని సవాల్ చేసిన ఘనత ఎన్టీ రామారావుకు దక్కుతుంది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి మేధావుల శూద్ర తాత్వికత అందుకు బాగా ఉపయోగపడింది. తెలుగుదేశం ఆవిర్భావంతో కొత్త పారిశ్రామిక వర్గానికి ఆదాయ వరులపై పట్టు లభించింది. దానికితోడు, రాజకీయాలకు సన్నిహితంగా ఉండి తమ పనులు నెరవేర్చుకునే పద్ధతికి కొంత వరకు కాలం చెల్లి, పారిశ్రామికవేత్తలే స్వయంగా రాజకీయ రంగంలోకి వచ్చి పార్లమెంటు పోటీ చేసే పద్ధతి అమలులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటుకు వెళ్తున్న వారు పారిశ్రామికవేత్తలే ఎక్కువ మంది ఉండడం ఆ పార్టీని విశ్లేషిస్తే అర్థమవుతుంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ద్వారా అధికార ప్రాబల్యం కోసం తహతహలాడుతున్న కొత్త తరానికి ఊపిరి పోసినట్లయింది. తెలంగాణలో విద్య, ఆర్థిక, సామాజికంగా ఎదిగిన దళిత బహుజనులకు తెలుగుదేశం వల్ల అధికార ప్రాబల్యం పొందే అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ తెలంగాణలో ఏదో మేరకు బలంగా ఉండడానికి కారణం కూడా అదే. కాంగ్రెసు పార్టీ పాత తరం నాయకత్వం కొత్త తరాన్ని నిరాకరిస్తూ వస్తున్న క్రమంలో ఈ పరిణామం సంభవించింది. ప్రస్తుతం కాంగ్రెసులో అధికారం కోసం జరుగుతున్న పోరుకు మూలం కూడా అక్కడే ఉంది.

వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీలో కొత్త తరాన్ని ఆహ్వానించారు. కాంగ్రెసు పార్టీలో పాత తరానికి, కొత్త తరానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో కొత్త తరం వైపు ఆయన మొగ్గు చూపారు. కొత్త కమ్మ కుల పారిశ్రామికవేత్తలకు కూడా ఆయన అధికారంలో పాలు పంచుకునే అవకాశం కల్పించారు. లగడపాటి రాజగోపాల్ వంటి కమ్మ కులానికి చెందిన పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడుతూ, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు వంటి సీనియర్ల ప్రయోజనాలు పరిరక్షిస్తూ వైయస్ ఒక సమతుల్యతను సాధించే ప్రయత్నం చేశారు. దీనివల్ల కూడా తెలుగుదేశం పార్టీపై కాంగ్రెసు ఆధిపత్యం వహించడానికి వీలైంది. తెలుగుదేశంలో తెలంగాణలోని కొత్త తరానికి అవకాశం లేకపోవడం కాంగ్రెసుకు కలిసి వచ్చింది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ వంటి కొత్త తరం నాయకుల ప్రయోజనాలు కాపాడడానికి వైయస్ రాజశేఖర రెడ్డి సీనియర్లను పక్కన పెట్టారు. వైయస్ జగన్ రూపంలో ఈ కొత్త తరానికి ఒక పట్టు దొరికింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఈ తరం సంక్షోభంలో పడింది. అందుకే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడింది. వైయస్ మరణంతో కాంగ్రెసులోని పాత తరం నాయకత్వం కొత్త తరాన్ని తిరిగి అణచివేయడానికి సిద్ధపడింది. కాంగ్రెసులో ప్రస్తుత సంక్షోభానికి కారణం ఇది.

తన రాజకీయాధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి తన వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ప్రయోజనాలు కాపాడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడ్డారు. వారికి వైయస్ జగన్ ఒక ఆలంబన. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారాన్ని, దానికి వ్యతికేరంగా జరుగుతున్న ఆందోళనను ఈ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది. జగన్ అధికార ప్రాబల్యానికి ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై ఇంత పెద్ద యెత్తున ఆందోళనకు దిగుతున్నారు. చంద్రబాబు తలపెట్టిన ఆందోళనకు కలిసి వస్తున్న పార్టీలన్నీ కమ్మ నాయకత్వంలోనే కొనసాగుతూ ఉండడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.

ముందే చెప్పినట్లు, ఇష్టమున్నా, లేకపోయినా ఆ పరిణామాన్ని వాస్తవిక దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అవసరం. కులం ఒక వాస్తవికత కాబట్టి దాన్ని కాదని పరిణామాలను విశ్లేషిస్తే కూడా మూలాలు పట్టుబడడం కష్టం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X