• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తాగుడు మానేశాక కెసిఆర్...

By కె.నిశాంత్
|

K Chandrasekhar Rao
హైదరాబాద్: మద్యం సేవించడం మానేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావులో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. గతంలో అతి విశ్వాసం వల్లనో, ఓపిక లేకపోవడం వల్లనో ఆయన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. తప్పుడు నిర్ణయాలు, పొంతన లేని ప్రకటనలతో ఉద్యమాన్ని సరిగా నడపలేకపోయారనే విమర్శలు ఆయనపై వచ్చాయి. శాసనసభ, లోకసభ ఎన్నికల్లో వైఫల్యం, ఆరోగ్య సమస్యలు ఆయనను పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి. ఎన్నికల తర్వాత పార్టీలో తలెత్తిన పరిణామాలు, తనపై పెరిగిన విమర్శల దాడులు ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. దాని నుంచి బయటపడడానికి ఆయన పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. ఆయన తాగుడుపై స్వపక్షంలోని అసమ్మతివాదుల నుంచి, ఇతర పార్టీల నాయకుల నుంచి తీవ్ర వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ఉద్యమాన్ని పార్ట్ టైమ్ చేశారనే విమర్శను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఆయన హెలికాప్టర్ దిగుతూ పడిపోవడం ఆయన స్థితిని తెలియజేసింది.

తాగడం మానేసిన తర్వాత ఆయన ఉద్యమానికి స్పష్టమైన తనదైన రూపునిచ్చారు. నవంబర్ చివరి వారంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి సిద్ధపడ్డారు. ఈలోగా ఆయన చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తాను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి దారి తీసిన పరిస్థితిపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి ఇతర జాతీయ నాయకులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మాటల తీరులో కూడా చాలా మార్పు వచ్చింది. ఆయన వ్యాఖ్యలపై, ఆయన వాడిన భాషపై మాత్రమే దృష్టి కేంద్రీకరించి ప్రత్యర్థులు దుమారం రేపడం ఆనవాయితీగా మారుతూ వచ్చింది. ఆయన తన భాషలో, వ్యాఖ్యల్లో మార్పు తెచ్చుకుని మాట్లాడుతున్నారు. దీంతో ప్రత్యర్థులకు విషయంపై తప్ప మరో రకంగా మాట్లాడలేని స్థితిని కల్పించారు. దీంతో ఆయన చేస్తున్న కార్యకలాపాల్లో సీరియస్ నెస్ కనిపిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేపట్టిన భూపోరాటాలు కూడా వినూత్నమైన రీతిలో ఉండడం విశేషం. కమ్యూనిస్టులు నడిపిన భూపోరాటాలకు తెరాస నడుపుతున్న భూపోరాటాలకు సారంలో తేడా ఉంది. ప్రభుత్వ భూములపైకి పేదలను తీసుకెళ్లి లాఠీలకు వారిని అప్పగించే పద్ధతిని కమ్యూనిస్టులు అనుసరించారు. పేదలు గుడిసెలు వేసుకోవడానికి, వాటిని అధికారులు, పోలీసులు కలిసి పీకేయడం, పరిస్థితి యధాతథ స్థితికి రావడం సిపిఐ, సిపిఎం నడిపిన భూపోరాటాల్లో కనిపిస్తుంది. కానీ తెరాస అందుకు భిన్నమైన వైఖరిని తీసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఆక్రమిత ఆసైన్డ్ భూములపై నిర్దిష్ట పోరాటానికి శ్రీకారం చుట్టింది. తెరాస నాయకులు ధర్నాకు దిగారు. నాయకులే ముందుండి పోరాటం చేస్తుండడం వల్ల పేదలు బాధితులుగా మారే అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల పార్టీపై విశ్వసనీయత పెరుగుతుంది.

కెసిఆర్ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష విషయం కూడా సీరియస్ విషయంగా మారిపోయింది. తనపై తగ్గిన విశ్వసనీయతను తిరిగి ప్రోది చేసుకోవడానికి కెసిఆర్ దీనికి దిగారని చెప్పవచ్చు. తెలంగాణ సాధన కెసిఆర్ ఎజెండా కాదని జరుగుతున్న ప్రచారానికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా సమాధానం చెప్పదలుచుకున్నారు. ప్రాణాలను ఫణంగా పెడుతున్నానని ఆయన చెబుతున్నారు. అది ఏ పరిస్థితికి దారి తీస్తుందోననే ఆందోళన రాజకీయ పార్టీల్లో నెలకొని ఉంది. కెసిఆర్ నడతలో, మాటలో కొంత నిజాయితీ వ్యక్తమవుతుండడం అందుకు కారణం. మద్యం సేవించడం వల్ల శారీరకంగా, మానసికంగా బాహ్య కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించడం అంతగా కుదరదు. సమయం కూడా వృధా అవుతుంది. అది మానేశాక పూర్తిగా ఉద్యమంపైనే దృష్టి కేంద్రీకరించడానికి వీలువుతోంది. ఇది కెసిఆర్ లో వచ్చిన పెద్ద మార్పే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X