పద్మనాభుడి కన్నా వడ్డీకాసులవాడే టాప్!

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సాయంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంకన్న స్వామికి దేశ వ్యాప్తంగా ఉన్న ఆస్తుల పై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో స్వామివారికి దేశవ్యాప్తంగా 4143 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిసింది. కలియుగ ప్రత్యక్ష ధైవంగా పిలవబడే తిరుపతి వెంకన్న సన్నిధికి భక్తుల తాకిడి నిత్యం పెరుగుతూనే ఉంటుంది. భక్తుల సౌకర్యార్థరం తిరుపతిలో 1000 గదులతో టీటీడీ భారీ నిర్మాణానికి ప్రణాళిక పూర్తి చేస్తుంది. శ్రీవారికున్న భూముల విలువే లక్షల కోట్లు ఈ విషయాన్ని పక్కన పెడితే బంగారు అభరణాలు, వజ్ర వైఢూర్యాలు గోవిందుండు ఖాతాలో టన్నులెక్క ఉన్నాయి. వీటి విలువా వేల కోట్లలోనే ఉంటుంది. శ్రీవారి ఆస్తుల్లో బంగారు ఆభరణాల విలువ చాలా అధికంగా ఉంటుంది.
రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎన్నారైలు ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు విలువైన బంగారు అభరణాలను స్వామివారికి కానుకలుగా సమర్పించారు. దీనికి తోడు స్వామి వారికి పూర్వం నుంచి చాలా విలువైన ఆభరణాలు ఉన్నాయి. తిరువాభరణం, జెట్టీల విలువ కోట్లలోనే ఉంటుంది. స్వామివారికున్న సంపదలో కేవలం వజ్రాల బరువే పదకొండున్నర టన్నులు ఉంటుందని టీటీటీ వర్గాలు స్పష్టం చేశాయి. వీటిల్లో 1100 రకాల వజ్రాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు.
రాష్ట్ర హై కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఛైర్మన్ ప్రకాశ్ జైన్ రెండు నెలల పాటు తిరుమలలో మకాం వేసి శ్రీవారి నగల విలువను లెక్కగట్టారు. ప్రకాశ్ జైన్ కోర్టుకు సమర్పించన నివేదిక ప్రకారం టీటీడీ వద్ద 9వ శతాబ్దంలో పల్లవులు, 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయులు, ఆ తరువాత మైసూర్ మహారాజా బహుకరించిన విలువైన వజ్రవైఢూర్యాలతో పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. పురాతన కళారూపాలకు మార్కెట్లో విలువ అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ ఆభరణాల విలువ కోట్లలో ఉంటుందని ప్రకాశ్ జైన్ కోర్టుకు తెలిపారు.
గోవిందుడి సన్నిధిలో ఉండే వెండి విలువలు 11 టన్నులు. దశాబ్థాలుగా ఈ వెండి దేవస్థాన కోశాగారంలో నిలువు ఉంటుంది. తాజా గణాంకాల ప్రకారం స్వామికారి ఖాతాలోకి నెలకు 25కిలోల వెండి విరాళాల రూపంలో వచ్చి పడుతోంది. దింతో శ్రీవారికి వెండి రధం, వెండి వాకిలితో పాటు 200 కిలోల ధ్వజ స్తంబం చేయించాలనే యోచనలో టీటీడీ ఉంది.
ఎస్బీ ఐ, కార్పోరేషన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల లాకర్లలో టీటీడీ భద్రపరిచిన బంగారం బరువు 3 వేల కిలోలు. బంగారాన్ని, బంగారు నగలను వేరు వేరుగా భద్రపరుస్తున్న దేవస్థానం ముంబైలోని ఓ మింట్ లో ఆ బంగారాన్ని కరిగించి వివిధ ఆకృతుల్లో వాటిని మార్చి భక్తలు కోసం అమ్మకానికి పెట్టే యోచనలో ఉంది.
భూములు, బంగారు ఆభరణాల విషయాన్ని పక్కన పెడితే ఏడుకొండలవాడి దగ్గరన్న డబ్బు సంగతి సరేసరి. పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో వెంకన్నపేరుమీద ఉన్న మొత్తం 5వేల కోట్లు పైనే. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుబుడుల కింద ఈ మొత్తాన్ని టీటీడీ బ్యాంకుల్లో జమ చేసింది. వీటి పై వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తోంది.
2009 -10 ఆర్థిక సంవత్సరంలో శ్రీవారికి వడ్డి ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.487 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ఈ వడ్డి రూ.500 కోట్లు దాటోచ్చని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వీటికి తోడు దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న 14 ట్రస్టులకు వేరు వేరుగా బ్యాంకు బ్యాలెన్స్ లున్నాయి. నిత్యాన్నదానం ట్రస్టు కింద రూ.300 కోట్లు, మిగిలిన పదమూడు ట్రస్టుల మీద రూ.200 కోట్లు సేవింగ్స్ లో ఉన్నాయి. ఇది కాకుండా హుండీ ద్వారా స్వామి వారికి వచ్చే ఆదాయం వేరు.
2009 -10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హుండీ ద్వారా స్వామివారికి వచ్చిన మొత్తం రూ.575 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ఇది రూ.675 కోట్లు దాటవచ్చని అంచనా. సాధారణ సమయాల్లో కూడా స్వామివారికి హుండీలో రూ.కోటిన్నర కానుకలుగా వస్తాయని దేవస్థాన అధికారులు తెలిపారు.
తలనీలాలు అమ్మటం ద్వారా రూ.300 కోట్లు, అర్జిత సేవా టికెట్లు అమ్మటం ద్వారా రూ.300 కోట్లు, ప్రత్యేక దర్శనం టికెట్లు అమ్మకం ద్వరా రూ.300 కోట్లు,, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం టీటీడీకి వస్తోంది. పద్మనాభుడి లక్ష కోట్ల ఆస్తిని వెంకటేశ్వర స్వామికి ఉన్న స్థిర, చరాస్థుతో పోల్చి చూస్తే ఎవరు ధనిక దేవుడో అర్ధమవుతోంది. దీనివల్ల వడ్డీకాసులవాడిని ఏ దేవుడు అధిగమించలేడని లెక్కలు వేస్తున్నారు.