కెసిఆర్ గ్రామస్థులకు అంకాపూర్ ఆదర్శం
నిజామాబాద్: అంకాపూర్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గ్రామజ్యోతి కార్యక్రమంలో పదే పదే చెబుతూ వస్తున్నారు. ఓసారి అంకాపూర్ సందర్శించి రావాలని ఆయన తన గ్రామానికి చెందిన ఎర్రవల్లి ప్రజలకే కాకుండా కరీంనగర్ జిల్లాలోని చిన్నముల్కనూరు గ్రామ ప్రజలకు కూడా చెప్పారు. అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలంగాణ గ్రామాల ప్రజలకు సూచిస్తూ వస్తున్నారు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌ను మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగ్‌దేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వగ్రామమైన ఎర్రవల్లి రైతులు నాలుగు బస్సుల్లో అంకాపూర్‌కు వచ్చి పంటలను పరిశీలించారు.

గజ్వేల్ నియోజకవర్గ అథారిటీ అధికారి హన్మంత రావు ఆధ్వర్యంలో 220 మంది రైతులు అంకాపూర్‌కు వచ్చారు. గ్రామంలో పండిస్తున్న పసుపు, సోయా, వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలను పరిశీలించారు. పంటల సాగులో కలుపు మొక్కలు లేకపోవడం గమనించి ఆశ్చర్యచకితులయ్యారు.
గ్రామం నుంచి వంద మందికి పైగా యువకులు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుసుకొని ప్రత్యేకంగా అభినందించారు. నీటి కుండీలను ఏర్పాటు చేసుకొని తక్కువ నీటితో పంటలను పండించడాన్ని వారు పరిశీలించారు. అనంతరం గురడిరెడ్డి రైతు సంఘంలో సమావేశం కాగా సొసైటీ అధ్యక్షుడు మార గంగారెడ్డి అంకాపూర్ గ్రామ అభివృద్ధి, ఐక్యత, విత్తనోత్పత్తి చేసి ఎగుమతి చేసే పద్ధతులను వివరించారు.

ఆ తర్వాత రైతులు విత్తనోత్పత్తి చేసే సీడ్ ప్లాంట్లను, మార్కెట్లో కూరగాయల క్రయవిక్రయాలను పరిశీలించారు. అలాగే సంగారెడ్డి డివిజన్‌లోని పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన 30 మంది రైతులు రెండు సుమోలలో అంకాపూర్‌కు తరలివచ్చి పంటల సాగును క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ యోగితారాణా సూచన మేరకు జిల్లాలోని గాంధారి మండల రైతులు రెండు బస్సుల్లో అంకాపూర్‌కు తరలివచ్చి పంటలను పరిశీలించారు. వీరి వెంట గజ్వేల్ ఎడిఎ శ్రావణ్, ఎఓ నాగరాజు, ఎర్రవెల్లి సర్పంచ్ భాగ్య, ఆర్మూర్ ఎడిఎ రామారావునాయక్, ఎఓ గోపి, ఎఫ్‌టిసి డిప్యూటీ డైరెక్టర్ నర్సింహాచారి, తహశీల్దార్ శ్రీధర్, ఆర్‌ఐ రవీందర్, విఆర్‌ఓలు, గురడిరెడ్డి రైతు సంఘం నేతలు కెకె బాజన్న, కిశోర్‌రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications