హైదరాబాద్‌లో ఇక అది కనిపించదేమో!: 8 దశాబ్దాల బంధం కనుమరుగే?..
అవును.. గౌలిగూడ(సీబీఎస్) బస్టాండ్ మరికొద్ది రోజుల్లోనే అదృశ్యం కానుంది.
హైదరాబాద్: 8దశాబ్దాల ఆ బంధం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. నిజాం కాలం నుంచి నేటికీ సేవలందిస్తోన్న ఆ ఆర్టీసీ బస్టాండ్ ఇక కనుమరుగవనుంది. పెరిగిన రవాణా అవసరాల రీత్యా రోడ్డు వెడల్పు చేయాల్సి రావడం.. పక్కనే మూసీ ఉండటంతో కూల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
అవును.. గౌలిగూడ(సీబీఎస్) బస్టాండ్ మరికొద్ది రోజుల్లోనే అదృశ్యం కానుంది. సికింద్రాబాద్ లో గార్డెన్ హోటల్ ను కూల్చివేసినప్పుడు చాలామంది ఎలాగైతే కలత చెందారో.. ఇప్పుడూ అదే పరిస్థితి. దశాబ్దాల అనుబంధానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడుతుందని తెలియడంతో.. ఏదో సెంటిమెంట్ అటు వైపు లాగుతున్న పరిస్థితి.

విడదీయలేని అనుబంధం:
గౌలిగూడ తరహా బస్టాండ్ రాష్ట్రంలో బహుశా మరెక్కడా కనిపించదు. రేకులతో, అర్థచంద్రాకారంలో నిర్మించిన ఈ విశాల ప్రాంగణాన్ని చూడగానే దాని ముద్ర ఏదో మనసులో అలా బలపడిపోతోంది. అలాంటి బస్టాండ్ ఒక్కసారిగా మాయమవుతుందంటే.. ఏళ్లుగా పెనవేసుకున్న గుర్తేదో తమ నుంచి దూరమవుతుందన్న ఆవేదన.

అప్పట్లో గిడ్డంగిగా:
నిజాం హయాంలో 80ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బస్టాండ్ తొలుత గిడ్డంగి అవసరాల కోసం వాడుకోవాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే నిజాం స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించడంతో.. హైదరాబాద్ కు ఇదే ప్రధాన బస్టాండ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికెళ్లాలన్న ఇక్కడికొచ్చి బస్సు ఎక్కాల్సిందే. అయితే పెరిగిన జనాభా, రవాణా అవసరాల రీత్యా దీనిపై ఒత్తిడి పెరిగింది.

ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్:
జనం తాకిడి ఎక్కువవడంతో.. ప్రత్యామ్నాయంగా మూసీకి అవతలి వైపు ప్రస్తుత ఎంజీబీఎస్ బస్టాండ్ నిర్మించారు. 1994లో నిర్మించిన ఈ బస్టాండులోకే సెంట్రల్ బస్ స్టేషన్ ను కూడా మార్చారు. ఆ తర్వాత గౌలిగౌడ బస్టాండ్ కేవలం సిటీ బస్సులకే పరిమితమైపోయింది.

మ్యూజియంగా మార్చాలనుకున్నా..
గౌలిగూడ బస్టాండును మ్యూజియంగా మార్చాలని అధికారులు భావించినప్పటికీ అది కూడా కుదర్లేదు. రోడ్డు వెడల్పు జరగాలంటే కచ్చితంగా ఈ నిర్మాణాన్ని కూల్చివేయాల్సి వస్తుండటంతో.. రేపో మాపో ఇక ఇది కనుమరుగవక తప్పేలా లేదు.
నిజాం హయాంలో నిర్మితమైన, హైదరాబాద్ తొలి బస్టాండ్ కావడంతో నాటి జ్ఞాపకంగా దీన్ని మ్యూజియంగా నిర్మించాలని భావించారు. సీఎన్‌జీ బస్సులకు కేటాయించాలని, వాణిజ్య సముదాయానికి ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కానీ ఏవిధంగా చూసుకున్న ఇక్కడ నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదనే తెలుస్తోంది.

కూల్చకుండా ప్రయత్నిస్తాం:
రోడ్డు వెడల్పుకు మరో ప్రత్యామ్నాయమేది లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ రమణారావు స్పష్టం చేశారు. రోడ్డుకు మరోవైపు మూసీ ఉండటంతో ఇటువైపే వెడల్పు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. బస్టాండ్ ఒక చిరస్మరణీయ జ్ఞాపకం కావటంతో కూల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ మార్గం కుదిరితే బస్టాండును కాపాడుకున్నట్లే అని కానీ అది సాధ్యపడకపోవచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications