ఐటీ సంక్షోభం: టెక్కీలది పెద్ద వాటానే, హైదరాబాద్ రియాల్టీపై ఎఫెక్ట్

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మొన్నటివరకు పెద్ద నోట్ల రద్దు, ఇప్పటివరకూ స్థిరాస్తి నియంత్రణ - అభివృద్ధి బిల్లు నిబంధనలు.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వివిధ దేశాల అధినేతలు విధించిన ఆంక్షలతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగుల తొలగింపుల తీరు.. జూలై నుంచి అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ)! తదితర అంశాలన్నీ దేశీయ స్థిరాస్తి రంగాన్ని వెనక్కి లాగేస్తున్నాయి.

అసలు సంగతేమిటంటే భాగ్యనగరంలో నివాస, కార్యాలయాల స్థలాల కొనుగోళ్లలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగులు, కంపెనీల వాటా ఎక్కువే.దీనికి తోడు ఫార్మా, వ్యాపార రంగం, స్టార్టప్, ఇ - కామర్స్ తదితర రంగాలు హైదరాబాద్ లో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి.

కనుక తాజా ఐటీ ఉద్యోగుల తొలగింపులు స్థిరాస్తి అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తుందా? లక్షల్లో వేతనాలు, పెద్ద మొత్తంలో గృహ రుణాలకు అర్హత ఉండటంతో ఇప్పటివరకు రియల్టీలో పెట్టుబడులు పెట్టిన ఐటీ ఉద్యోగులు, కంపెనీల పరిస్థితి డోలాయమానంలో పడుతుందా? ఐటీ ఉద్యోగులు, కంపెనీలే లక్ష్యంగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించే నిర్మాణ సంస్థల పరిస్థితేంటి? పరిశీలిద్దాం..

రియాల్టీ రంగంలో పెట్టుబడులు ఐటీ ఉద్యోగులవే

రియాల్టీ రంగంలో పెట్టుబడులు ఐటీ ఉద్యోగులవే

బెంగళూరు తర్వాత ఐటీ రంగానికి ప్రధాన వనరు భాగ్యనగరమే. ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్, సైయంట్, క్యాప్‌జెమినీ, డెలాయిట్‌ వంటి 1,500 కంపెనీలు, వీటిల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. గత కొంతకాలంగా రకరకాల కారణాలతో వివిధ ఐటీ కంపెనీలు సుమారు 4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) ఆరోపణ. ఐటీ ఉద్యోగుల తొలగింపుతో తొలుత స్థిరాస్తి రంగంపైనే ప్రభావం పడుతుంది. ఎందుకంటే లక్షల్లో వేతనాలు, పెద్ద మొత్తంలో గృహ రుణాల అర్హత, ఏటేటా పెరిగే అద్దెలు వంటి వాటితో ఇళ్ల కొనుగోళ్లు, పెట్టుబడులు పెట్టేది వీళ్లే మరి.

ఇళ్ల కొనుగోలు, పెట్టుబడుల్లో ఐటీ ఉద్యోగుల వాటా 60 వాతం

ఇళ్ల కొనుగోలు, పెట్టుబడుల్లో ఐటీ ఉద్యోగుల వాటా 60 వాతం

హైదరాబాద్‌లో రూ.25 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకూ ప్రాజెక్ట్‌లు ఉంటాయి. వీటిని స్థిర నివాసం, అద్దెలు, పెట్టుబడుల రీత్యా కొనుగోలు చేస్తుంటారు. నగరంలో నివాస సముదాయాల కొనుగోళ్లు, పెట్టుబడుల్లో ఐటీ ఉద్యోగుల వాటా 60 శాతం వరకు ఉంటుందని నైట్‌ఫ్రాంక్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ సామ్సన్‌ ఆర్థూర్‌ తెలిపారు. వాణిజ్య సముదాయాల్లో గతేడాది నగరంలో 60 లక్షల చదరపు అడుగులు విక్రయం కాగా.. 75 - 80 శాతం ఐటీ కంపెనీలే కొనుగోలు/లీజుకు తీసుకున్నాయని ఒక అంచనా. తాజాగా ఐటీ ఉద్యోగుల తొలగింపు పరిణామం నగర స్థిరాస్తి రంగంపై వెంటనే ప్రభావం చూపకపోయినా.. దీర్ఘకాలంలో ఇబ్బందులు ఉండే ప్రమాదముందని హెచ్చరించారు. స్థిర నివాస కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదని.. రెండో ఇళ్ల కొనుగోళ్లు, స్థిరాస్తి పెట్టుబడులపై కాసింత ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలకే భద్రత లేని ఇలాంటి తరుణంలో గృహ రుణం తీసుకునే సాహసం చేయకపోవచ్చునని ఆయన అభిప్రాయ పడుతున్నారు.

హైదరాబాద్ ఇళ్ల కొనుగోళ్లు ప్రాంతాల వారీగా విభిన్నం

హైదరాబాద్ ఇళ్ల కొనుగోళ్లు ప్రాంతాల వారీగా విభిన్నం

ఐటీ ఉద్యోగుల తొలగింపు ప్రభావం బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో కాసింత తక్కువగానే ఉంటుందని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఉద్యోగులతో పాటూ ఫార్మా ఉద్యోగులు, ప్రవాసులు, వ్యాపారులూ ఎక్కువగా ఉండటమేనన్నారు. ఈ మధ్య ఆఫీసు స్థలాల లీజుల్లో ఐటీ కంపెనీలతో పోటీగా స్టార్టప్స్, ఈ - కామర్స్‌ సంస్థలూ ఉంటున్నాయని.. ఇది నిర్మాణ సంస్థలకు కలిసొచ్చే అంశమేనన్నారు. అందుబాటు ధరల్లో, నాణ్యమైన నిర్మాణాలు, గడువులోగా నిర్మాణం పూర్తి చేసే పేరు ఉన్న నిర్మాణ సంస్థలకు అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేశారు. నగరంలో నివాస సముదాయాల కొనుగోళ్లలో ఐటీ, ఇతర ఉద్యోగుల వాటా ఒక్కో ప్రాంతాల్లో ఒక్కోలా ఉంటాయి. అప్పా జంక్షన్‌లో 40:60 శాతంగా, ఈస్ట్‌ జోన్‌లో 30:70 శాతంగా ఉంటాయి. వెస్ట్‌ జోన్‌లో అత్యధికంగా 80:10 శాతంగా ఉంటుందని ఒక నిర్మాణ సంస్థ పేర్కొంది. ఐటీ కంపెనీలు కొలువుదీరిన గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, నానక్‌రాంగూడ, నార్సింగి, మణికొండ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, పోచారం వంటి ప్రాంతాల్లో ఆయా ఉద్యోగుల కొనుగోళ్లు ఎక్కువగానే ఉంటాయి.

ఐదు వేల మందికి ఉద్వాసన.. 40 వేల మంది నియామకం

ఐదు వేల మందికి ఉద్వాసన.. 40 వేల మంది నియామకం

హైదరాబాద్‌లో స్థిరాస్తుల కొనుగోళ్లలో ఐటీ ఉద్యోగుల వాటా ఎక్కువే అయినా.. గత కొంత కాలంగా వాళ్లు కేవలం వేతనాల మీద ఆధారపడి కొనుగోళ్లు చేయట్లేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందస్తు పొదుపు ప్రణాళికలు చేపట్టి మరీ కొంటున్నారని రామ్‌ డెవలపర్స్‌ సీఎండీ రాము వనపర్తి తెలిపారు. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలపై కొంత ప్రభావాన్ని చూపినా.. ఆయా నిర్మాణాల వాటా తక్కువేనన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రూ.60 లక్షల్లోపు ఫ్లాట్లపై ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఉందని తేల్చి చెప్పారు. ‘ఐటీ కంపెనీల్లో ప్రతి ఏటా 5 - 10 శాతం ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణం. ఇందులోనూ ఫ్రెషర్స్, మధ్య స్థాయి ఉద్యోగులను తీసేయరు. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ లెవల్స్‌లో తొలగింపులుంటాయని' పలు ఐటీ కంపెనీల్లో దశాబ్ద కాలం పనిచేసి, ప్రస్తుతం డెవలపర్‌గా స్థిరపడ్డ ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కుమార్‌ కామరాజు చెప్పారు. 5 వేల మందిని తొలగిస్తే.. 40 వేల మంది కొత్త వారిని నియమించుకుంటారని.. ఇది నిర్మాణ సంస్థలకు కలిసొచ్చే అంశమని తెలిపారు. తమ గ్రూప్‌ కస్టమర్లలో 95 శాతం ఐటీ ఉద్యోగులే ఉంటారని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT Sector crisis wouldn't effect on Hyderabad real estate sector because it has base for Pharma, E - Market, Startap, business people here.
Please Wait while comments are loading...