చంద్రబాబు కొత్త ఆలోచన: ఏపీ కోసం ఇస్రో
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇస్రో తనవంతుగా సాయం చేయనుందట! శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు అత్యంత విలువైన ఎర్ర చందనం వృక్షాలు ఎన్ని నరికివేశారు? నదీ తీరాల్లో ఇసుక నిక్షేపాలు ఎంత ఉన్నాయి? భూగర్భ జలాలు ఏ ప్రాంతంలో ఎంతెంత ఉన్నాయి? ఇలాంటి వాటికి సమాధానం తెలుసుకొనే బాధ్యతను అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారట.
అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల ద్వారా ఇస్రో మన దేశానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని క్రమం తప్పకుండా సేకరిస్తోంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇస్రో ఇప్పుడు అర మీటర్ పరిధిలోని సమాచారాన్ని కూడా గుర్తించే స్థాయికి చేరింది. ఇటీవల పీఎస్ఎల్వీ ప్రయోగం సందర్భంగా శ్రీహరికోట వెళ్లిన చంద్రబాబు అక్కడ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకొన్నారు.

ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌ను ఒకసారి రావాల్సిందిగా ఆహ్వానించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబును కలవనున్నారు. ఆయనతో చర్చించాల్సిన అంశాలపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు చేశారని వార్తలు వస్తున్నాయి. తిరుమల కొండల చుట్టూ ఉన్న శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం భారీగా స్మగ్లర్ల బారిన పడుతోంది. ఇప్పటికి ఎంత చందనం నరికి వేశారు? ఎంత మిగిలింది? ఎంత వయసు వృక్షాలు ఎన్నెన్ని ఉన్నాయి? అనే వాటిపై ఇస్రో ద్వారా సర్వే జరిపించాలనుకుంటున్నారట.
ఇసుక తవ్వకాల విషయంలో కూడా శాస్త్రీయ సమాచారాన్ని ఇస్రో సహాయంతో సేకరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇస్రో ద్వారా నిక్షేపాల సమాచారం వెల్లడైతే దాని ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంతెంత ఇసుక తవ్వాలి? ఎక్కడెక్కడ క్వారీలకు అనుమతి ఇవ్వాలన్నది తేలిగ్గా నిర్ణయించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. భూగర్భ జలాలపై కూడా ఇదే మాదిరి నిర్థిష్ట సమాచారం ఇస్రో ద్వారా సేకరించాలన్నది చంద్రబాబు భావిస్తున్నారట.
పట్టణాల్లో చెత్తపై కూడా ఉపగ్రహ సమాచారం ఆధారంగా చేయదగిన పనులపై చంద్రబాబు అనేక రకాల కొత్త ఆలోచనలు చేస్తున్నారట. పట్టణాలు, నగరాల్లో పేరుకుపోతున్న చెత్తపై కూడా ఉపగ్రహ చిత్రాలు తెప్పిస్తే ఎలా ఉంటుందన్నదని ఆలోచిస్తున్నారట.












Click it and Unblock the Notifications