తుఫాన్లు: ఆంధ్ర తీరానికి అక్టోబర్ గండం
హైదరాబాద్: దసరా, దీపావళి పర్వదినాలు వచ్చే కాలాల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఎక్కువగా తుఫాను గండాలు వచ్చి పడుతున్నాయి. దసరా వేడుకలతో సందడిగా ఉండాల్సిన వేళ తుఫాను భయం ఆంధ్ర తీర ప్రాంత ప్రజలను వణికిస్తోంది.
రాష్ట్రాన్ని తాకిన తుఫాన్లలో అత్యధిక శాతం అక్టోబర్‌లో సంభవించడం గమనించవచ్చు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, 1891 నుంచి 2013 వరకు 73 తుఫాన్లు విరుచుకుపడగా, వీటిలో 30 తుఫాన్లు ఒక అక్టోబర్ నెలలోనే తీరాన్ని తాకాయి. ఫైలిన్ తుఫాన్‌తో కలిపితే ఈ సంఖ్య 31 అవుతుంది.

సాధారణంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మే, జాన్ నెలల్లో తుఫాన్లు సంభవిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకూ అక్టోబర్ నెలలో వచ్చిన తుఫాన్లతోనే ఎక్కువ నష్టపోయింది. నిరుడు నీలం తుఫాన్ తీవ్రనష్టం చేసింది. ఇప్పుడు ఫైలిన్ కోస్తా తీరంపై విరుచుకుపడేందుకు ముందుకు దూసుకొస్తోంది.
ఇదిలావుంటే, 1891 నుంచి ఇప్పటిదాకా వచ్చిన 73 తుఫాన్లలో 23 నెల్లూరు జిల్లా మీదుగా తీరం దాటాయి. 15 తుఫాన్లు కృష్ణా జిల్లాలో తీరం దాటగా, 11 తూర్పుగోదావరి, 10 శ్రీకాకుళం, 7 విశాఖపట్టణం, 5 ప్రకాశం, 2 తుఫాన్లు గుంటూరు జిల్లాల్లో తీరం దాటాయి.
నవంబర్ నెలల్లో వచ్చిన తుఫాన్లు 19 కాగా.. మే లో ఈ సంఖ్య 9, సెప్టెంబర్‌లో 3గా ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇప్పటి వరకూ తుఫాన్లు సంభవించలేదని వాతావరణ శాఖ చెబుతోంది.












Click it and Unblock the Notifications