రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు... ఇవాంకా ట్రంప్. హైదరాబాద్‌లో ఈనెల 28 నుంచి 30 దాకా నిర్వహించనున్న 'గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమిట్‌' (జిఈస్‌) ప్లీనరీ సెషన్‌లో పాల్గొనేందుకు తొలిసారిగా మన దేశానికి రానున్నారు.

పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?

'విమెన్‌ ఫస్ట్‌, ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌' థీమ్‌ను హైలెట్‌ చేస్తున్న ఈ సమ్మిట్‌లో వ్యాపారవేత్తగా తన అనుభవాలను ఆమె పంచుకోనున్నారు. ఈ సందర్భంగా ఇవాంకా గురించి కొన్ని విశేషాలు...

 అపర కుబేరుల కుటుంబం.. అయినా...

అపర కుబేరుల కుటుంబం.. అయినా...

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి భార్య కుమార్తె ఇవాంకా. ఈమె అసలు పేరు ఇవానా మారీ ట్రంప్ . ఇవానా, ట్రంప్ ముగ్గురి సంతానంలో ఈమె ఒకరు. అపర కుబేరుల కుటుంబం... తరతరాలుగా తరగని ఆస్తి... తండ్రి రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌... చిటికేస్తే కావాల్సింది క్షణాల్లో ముందుంటుంది. అయినా వీటన్నింటికన్నా క్రమశిక్షణ, ఆత్మాభిమానం ముఖ్యమని ఇవానా ట్రంప్‌ తన కూతురు ఇవాంకాకు ఉగ్గుపాలతోనే నూరిపోసింది. అందుకే పెరిగి పెద్దయ్యాక ఇవాంకా.. తన స్వశక్తితో మోడల్ గా పేరు తెచ్చుకుంది.

 మోడలింగ్‌ ప్రపంచంలో...

మోడలింగ్‌ ప్రపంచంలో...

ఇవాంకాకు పదేళ్ల వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు.. ట్రంప్, ఇవానా విడిపోయారు. ఇవాంకా తన ఇద్దరు సోదరులతో కలిసి మన్‌హాట్టన్‌లోని బోర్డింగ్‌ స్కూలులో చదువుకునేది. 15 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇవాకం అక్కడే చదువుకుంది. తల్లిలాగే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. టీనేజ్‌లోనే ‘సెవెంటీన్‌' అనే మ్యాగజైన్‌ కవర్‌పేజీ కోసం పోజులిచ్చింది. చదువుకు ఏ మాత్రం ఆటంకం కలుగకుండా వీకెండ్స్‌లో ‘టామీ హిల్‌ఫిగర్‌' వంటి ప్రసిద్ధ జీన్స్‌ కంపెనీలకు మోడల్‌గా కూడా పనిచేసింది. ప్రసిద్ధ మోడల్‌, నటి పారిస్‌ హిల్టన్‌.. ఇవాంకాకు చిన్ననాటి స్నేహితురాలు. హిల్టన్‌తో పోటీ పడి మరీ ఇవాంకా యాడ్స్‌లో నటించేది. విశేషమేమిటంటే.. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌తో పోటీ పడి ఓటమిపాలైన హిల్లరీ క్లింటన్‌ కూతురు చెల్సియా క్లింటన్‌ కూడా ఇవాంకాకు బెస్ట్‌ ఫ్రెండ్‌.

 కష్టపడే ఆ తత్వమే...

కష్టపడే ఆ తత్వమే...

ఇవాంకా తల్లి ఇవానాకు జీవితం విలువ బాగా తెలుసు. డబ్బు విలువ పిల్లలకు తప్పకుండా తెలిసి తీరాల్సిందేనని నమ్మేది. చివరికి సైకిల్‌ కొనాలన్నా కష్టపడాల్సిందేనని నిబంధనలు పెట్టేది. దాంతో ఇవాంకాలో చిన్నతనం నుంచే కష్టపడేతత్వం అలవడింది. తను ఏం కొనుక్కోవాలన్నా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తన అవసరాలకు తగ్గ డబ్బు తనే సంపాదించుకోవడం అలవాటు చేసుకుంది. ఆ అలవాటే ఆమెను తిరుగులేని బిజినెస్‌ ఉమన్‌గా తీర్చిదిద్దింది.

 తండ్రికి ముద్దుల కూతురు...

తండ్రికి ముద్దుల కూతురు...

ఇవాంకాలోని చురుకుదనం, తెలివితేటలంటే తండ్రి డోనాల్డ్‌ ట్రంప్‌కు బాగా ఇష్టం. అందుకే మిగతా పిల్లల కన్నా ఆమెనే ఎక్కువగా ప్రేమించేవాడు. ఇవాంకాకు కూడా తండ్రి దగ్గర చనువు కాస్త ఎక్కువే. ఒకవైపు మోడలింగ్‌లో బిజీగా ఉంటూనే ఆమె తన తండ్రి వ్యాపారాలపై ఆరా తీస్తూ, అన్ని విషయాలు తెలుసుకుని రియల్ ఎస్టేట్ పై పట్టు పెంచుకుంది. అందుకేనేమో.. ‘వోగ్‌' వంటి ప్రసిద్ధ మ్యాగజైన్ కవర్‌పేజీ మీద మోడల్‌గా సత్తా చాటుకుంటూ మోడలింగ్‌లోనే స్థిరపడుతున్నదనుకున్న ఇవాంకా ఒక్కసారిగా రూటు మార్చి రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రవేశించింది.

 ఎకనామిక్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందాక...

ఎకనామిక్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందాక...

యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో ఎకనామిక్స్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందాక అమెరికాలో రియల్‌ ఎస్టేట్‌ మాగ్నెట్‌గా పేరుగాంచిన బ్రూస్‌ రాట్నర్‌ దగ్గర ఉద్యోగంలో చేరింది ఇవాంకా. ఈ విషయం తెలిసిన డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా కూతురి తెలివికి, ధైర్యానికి సంతోషించారు. ఇవాంకా పనితీరుకు ముగ్ధుడైన బ్రూస్.. ఒక ఏడాది తర్వాత ట్రంప్‌కు ఫోన్‌ చేసి ‘‘మీ అమ్మాయిని మా దగ్గరే శాశ్వత ఉద్యోగిగా నియమించుకుంటా..'' అని అన్నారు. అయితే ట్రంప్ అందుకు అంగీకరించలేదు. 2005లో ఇవాంకాను ‘ట్రంప్‌ ఆర్గనైజేషన్‌'లోకి తీసుకున్నారాయన.

 రియల్ ఎస్టేట్ లో మహిళ...

రియల్ ఎస్టేట్ లో మహిళ...

ఆ రోజుల్లో న్యూయార్క్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మగవాళ్ల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. ఒకరిపై మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేసేవాళ్లు. అలాంటి రంగంలోకి ఇవాంకా ప్రవేశించడంతో.. ఒక మహిళ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయడం ఏమిటని చాలామంది హేళన చేశారు. అయితే బ్రూస్‌ దగ్గర పనిచేసిన అనుభవం, అలాగే తన తండ్రి పనితీరును అతి దగ్గరి నుంచి గమనించే అవకాశం రావడంతో ఇవాంకా క్రమక్రమంగా వ్యాపారంలో రాటుదేలింది.

 అచ్చం మగరాయడులా...

అచ్చం మగరాయడులా...

సూటు బూటు వేసుకుని, బాబ్డ్‌ హెయిర్‌ కట్‌ తో అచ్చం మగరాయుడిలా బోర్డు మీటింగులకు హాజరయ్యేది ఇవాంకా. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి మిగతా బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయేవారు. ఇవాంకా నిర్ణయాలు కూడా కుండబద్దలు కొట్టినట్లుగా, కచ్చితంగా ఉండేవి. ఒక ప్రాంతంలో స్థలం కొనాలన్నా, అమ్మాలన్నా ప్రణాళికలు రచించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. కూతురి నిర్ణయాలు ఆ రంగంలో ఎంతో అనుభవమున్న డోనాల్డ్‌ ట్రంప్‌ను కూడా ఆశ్చర్యచకితుణ్ణి చేసేవి. దీంతో ట్రంప్ కూడా ఇవాంకాపై పూర్తి నమ్మకంతో ఆమె స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోకలిగే వాతావరణం సృష్టించారు.

 మూడేళ్లు సహజీవనం.. తరువాత పెళ్లి...

మూడేళ్లు సహజీవనం.. తరువాత పెళ్లి...

తండ్రి డొనాల్డ్ ట్రంప్ కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి ప్రవేశించిన తరువాత ఆ రంగంలోని వ్యాపార వర్గాల్లో పాపులర్ కావడానికి ఇవాంకాకు ఎంతో కాలం పట్టలేదు. 2005లో ‘కుష్నర్‌ కంపెనీస్‌' అనే మరో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యజమాని జరేడ్‌ కుష్నర్‌ ను ఇష్టపడి అతడితో సహజీవనం ప్రారంభించింది ఇవాంకా. ఆ తర్వాత 2009లో కుష్నర్‌ను సంప్రదాయబద్ధంగా పెళ్లాడింది. కుష్నర్‌ ‘న్యూయార్క్‌ అబ్జర్వర్‌' ప్రచురణ కర్త కూడా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్‌ కావడంతో వారి మధ్య మంచి అవగాహన ఉండేది. వ్యాపారంలో ఒకరితో మరొకరు పోటీపడినప్పటికీ ఇంటికి రాగానే సగటు భార్యాభర్తల్లాగా ఉండేవారు. వారి ప్రేమకు గుర్తుగా వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు.

రచనా రంగంలోనూ సక్సెస్‌...

రచనా రంగంలోనూ సక్సెస్‌...

ఇవాంకాలో కేవలం వ్యాపార లక్షణాలే కాకుండా ఓ మంచి కళాకారిణి కూడా దాగి ఉంది. టీవీ కళాకారిణిగా ఆమె సుపరిచితురాలే. డోనాల్డ్‌ ట్రంప్‌ షో ‘ది అప్రెంటీస్‌'లో బోర్డు రూమ్‌ జడ్జీగా కూడా ఇవాంకా కనిపించారు. ‘బోర్న్‌ రిచ్‌' అనే డాక్యుమెంటరీతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నారామె. అంతేకాదు, రచనా రంగంలోనూ తన ప్రతిభ చాటుకున్నారు. ఆమె రాసిన తొలిపుస్తకం ‘ది ట్రంప్‌ కార్డ్‌' హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. చేస్తున్న పనిలో, జీవితంలో గెలుపు సాధించాలంటే ఏం చేయాలో ఇవాంకా ఈ పుస్తకంలో రాశారు. ఆమె రెండో పుస్తకం ‘విమెన్‌ హూ వర్క్‌' కూడా అమ్మకాల్లో రికార్డు సృష్టించింది.

తండ్రికి అండగా రాజకీయాల్లోకి...

తండ్రికి అండగా రాజకీయాల్లోకి...

తండ్రి గురించి మాట్లాడమంటే.. ‘‘మా నాన్న చాలా కష్టజీవి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక పని ఒప్పుకున్నారంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయన అలాంటి ప్యాషన్‌తోనే ప్రచారం చేశారు. ఎన్నికల్లో నేను ఆయనకు అండగా రేయింబవళ్లు ప్రచారం చేశాను. నా తండ్రి అంటే నాకు అమితమైన ప్రేమ. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తప్పకుండా గెలిచి తీరుతారని నాకు ముందే తెలుసు..'' అంటూ డొనాల్డ్ ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేస్తారు ఆయన ముద్దుల కూతురు ఇవాంకా. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత రాజకీయాల్లోనూ తన తండ్రికి అండగా ఉండేందుకు ఇవాంకా కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. 2017 మార్చిలో ఆమె అధ్యక్షుడికి సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు ఒక్క పైసా జీతం కూడా ఆమె తీసుకోవడం లేదు.

 సోషల్‌ నెట్‌వర్క్‌లో యాక్టివ్‌...

సోషల్‌ నెట్‌వర్క్‌లో యాక్టివ్‌...

స్కైయింగ్‌, గోల్ఫ్‌ ఆటల్లో కూడా ఇవాంకాకు మంచి ప్రావీణ్యం ఉంది. సోషల్‌ నెట్‌వర్క్‌లో చాలా యాక్టివ్‌. తరచూ తన పిల్లలు అరబెల్లా, జోసెఫ్‌, థియోడోర్‌ల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారామె. ఒక్క ట్విట్టర్‌లోనే ఇవాంకాకు 15 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. వారాంతాలను తప్పకుండా తన కుటుంబానికి కేటాయిస్తారు. మోడల్‌గా, టీవీ కళాకారిణిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా, సంఘసేవకురాలిగా, ముగ్గురు పిల్లల తల్లిగా... ఇలా ఎక్కడ, ఎలా ఉన్నా ఇవాంకా చిన్నతనంలో తన తల్లి ఇవానా ట్రంప్ చెప్పిన జీవిత సూత్రాలను మాత్రం మర్చిపోలేదు. తండ్రి విజయ సూత్రాలనూ వదల్లేదు. అందుకే ఆధునిక మహిళకు రియల్‌ రోల్‌ మోడల్‌గా తనదైన గుర్తింపుతో ముందుకు దూసుకుపోతోంది ఇవాంకా ట్రంప్!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ivanka Trump is an American television personality, fashion designer, author and businesswoman who is an advisor to the President of the United States, Donald Trump. She is the daughter of the president and his first wife, former model Ivana Trump. Ivana Marie Trump was born in Manhattan, New York City, and is the second child of Czech-American model Ivana Marie and Donald John Trump, who in 2017 became the 45th President of the United States. Her father has German and Scottish ancestry and her mother has Czech and Austrian ancestry. The name Ivanka is a diminutive form of Ivana. Trump's parents divorced in 1991, when she was ten years old. She has two brothers, Donald Jr. and Eric; a half-sister, Tiffany; and a half-brother, Barron.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి