Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సచిన్, సిఎన్ఆర్ రావు: ఇద్దరూ సెంచరీల వీరులే

భారతరత్న వరించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్లో వంద సెంచరీలు కొడితే సిఎన్ఆర్ రావు పరిశోధనలో సెంచరీ చేశారు. భారత ప్రభుత్వం క్రికెటర్ సచిన్‌కు, శాస్త్రవేత్త సిఎన్ఆర్‌కు భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. సచిన్ కెరీర్ ప్రారంభం నుంచీ ముగింపు వరకూ రికార్డులే వెతుక్కున్నాయి. అతగాడినే వరించి రికార్డు సృష్టించాయి.

క్రికెట్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టెండూల్కర్, అంతర్జాతీయ మ్యాచ్‌లకు గుడ్‌బై చెబుతూ కూడా రికార్డులు సొంతం చేసుకున్నాడు. భారత అత్యున్నత పౌర పురస్కారం అందుకునే క్రీడాకారుడిగా, పిన్న వయస్కుడిగా, కెరీర్ ముగింపు రోజునే అత్యున్నత పురస్కారం అందుకున్న హీరోగా ఇలా చాలా రికార్డులపై ముద్ర వేశాడు.

ఇక సిఎన్ఆర్ రావుకు శాస్త్ర పరిశోధనలు ఆయనకు నిత్యకృత్యం. 79వ పడిలోనూ ప్రపంచానికి ఏదోక కొత్త విజ్ఞాన సూత్రం అందించాలన్న తపనతో ఆయన మనసు ఉరకలేస్తోంది. మానవలోకం కోసం శాస్త్రం, తన లోపలి లోకం కోసం సంగీతం తప్ప మరో వ్యాపకం లేని ఆ గొప్ప శాస్తవ్రేత్తే ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్ర రావు.

Sachin Tendulkar, CNR Rao to be conferred with Bharat Ratna

ఆయనకు డాక్టరేట్ ఇవ్వడం అంటే తమను తాను గౌరవించుకోవడంగా 60 వర్శిటీలు భావించాయంటే - ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. అందుకే సిఎన్‌ఆర్ రావుకూ కేంద్రం శనివారం భారతరత్న ప్రకటించింది. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడైన రావ్, ప్రస్తుతం ప్రధాని శాస్త్ర వ్యవహారాల సలహా మండలి చైర్మన్‌గా ఉన్నారు.

సిఎన్ఆర్ రావు 1400కు పైగా పరిశోధన పత్రాలు ప్రచురించారు. 45 గ్రంథాలు రచించారు. దాదాపు 50 గౌరవ డాక్టరేట్లు పొందారు. ఆయన పరిశోధనలను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్ర, సాంకేతిక అకాడమీలు గుర్తించి, ఆయనకు గౌరవ సభ్యత్వాలను, ఫెలోషిప్స్‌ను ఇచ్చాయి. పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన్ను వరించాయి.

ఇంజనీరింగ్ మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, హిందుస్థానీ సంగీత మేధావి పండిట్ భీమ్‌సేన్ జోషి తర్వాత భారతరత్నను అందుకోనున్న మూడో కన్నడిగుడు సిఎన్ఆర్ రావు. అంతేకాదు సర్ సివి రామన్, ఎపిజె అబ్దుల్ కలాం తర్వాత ఈ పురస్కారాన్ని అందుకోన్ను మూడో శాస్త్రవేత్త.

సిఎన్ఆర్ రావు బెంగళూరులోని బసవనగుడిలో హనుమంత నాగేశ రావు, నాగమ్మ దంపతులకు.. 1934, జూన్ 30న జన్మించారు. వారికి ఆయన ఏకైక సంతానం. ఆయన పెరిగిందీ, విద్యాభ్యాసం జరిగిందీ అంతా అక్కడే. తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడం రావులో చదువు పట్ల ఆసక్తికి కారణమైంది. అంతేకాదు.. చిన్నప్పటి నుంచీ తన తల్లి చెప్పే పురాణగాథలు ఆయనలో వివిధ ఆలోచనలు రేకెత్తించేవి.

తల్లి మాతృభాషలో పురాణగాథలతో ఆయనలో సృజనాత్మకతను తట్టిలేపితే, తండ్రి నాగేశరావు సిఎన్ఆర్ రావును ఇంగ్లిష్ చదువుల వైపు మళ్లించారు. నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారి ప్రసంగాలు ఆయనపై ఎంతగానో ప్రభావం చూపాయి. ఆయన హైస్కూల్ చదువు బసవనగుడిలోని ఆచార్య పాఠశాలలో జరిగింది. రసాయనశాస్త్రంతో ఆయన ప్రేమలో పడింది అక్కడే. 1947లో ఆయన హైస్కూల్ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

సిఎన్ఆర్ రావు బసవనగుడిలోని ఆచార్య పాఠశాలలో చదువుతున్నప్పుడు 1946లో ప్రముఖ శాస్త్రజ్ఞుడు, నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ ఆ పాఠశాలను సందర్శించారు. ఆయనతో మాట్లాడ్డం తన జీవితంలో మరపురాని మధురానుభూతి అని రావు చెబుతుంటారు. ఆ తర్వాత రామన్ ప్రయోగశాలను చూసే అవకాశం కూడా రావుకు దక్కింది. ఇదంతా ఆయనపై ఎంతగానో ప్రభావం చూపింది.

అమెరికాలో 1958 నాటికి పర్‌డ్యూ వర్సిటీ నుంచి పిహెచ్‌డి చేశారు. 1959లో తిరిగి బెంగళూరుకు చేరుకుని ఐఐఎస్‌సిలో రూ.500 జీతానికి లెక్చరర్‌గా చేరారు. సర్ సివి రామన్ తదితర ప్రఖ్యాత శాస్త్రవేత్తల సహకారంతో పలు పరిశోధనపత్రాలు ప్రచురించారు. 1963 నుంచి 1976 దాకా ఆయన కాన్పూర్ ఐఐటిలో రసాయన శాస్త్ర విభాగ ఫేకల్టీ సభ్యుడిగా సేవలందించారు.
1983-84 మధ్య కేంబ్రిడ్జ్‌లోని కింగ్స్ కాలేజీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన తొలి భారతీయుడిగా వాసికెక్కారు.

బెంగళూరులోని ఐఐఎస్‌సీ (ఇండియ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్)లో సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ విభాగాన్ని స్థాపించేందుకు కృషి చేసిన ఆయన 1984 నుంచి 1994 దాకా దానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన జీవితంలో అతిపెద్ద మైలురాయి బెంగళూరులో స్థాపించిన జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రిసెర్చ్ (జేఎన్‌సీఏఎస్ఆర్).

సిఎన్ఆర్ రావు దశాబ్దాల ఆయన ప్రస్థానంలో పద్మశ్రీ, పద్మవిభూషణ్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. 2000 సంవత్సరంలో రాయల్ సొసైటీ ఆయనను హ్యూస్ మెడల్‌తో సత్కరించింది. భారత ప్రభుత్వం ఏర్పరచిన ఇండియా సైన్స్ అవార్డు తొలి గ్రహీత ఆయనే. కర్ణాటక ప్రభుత్వం ఆయన్ను కర్ణాటక రత్న పురస్కారంతో గౌరవించింది. ఇంకా డాన్ డేవిడ్ ప్రైజ్, ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి 'నైట్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్' పురస్కారం, చైనా అత్యున్నత సైన్స్ పురస్కారం ఇలా చాలానే అందుకున్నారు.

సెంచరీల విషయంలో సచిన్‌కు, సిఎన్ఆర్ రావుకు సామ్యం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఉంటే, సిఎన్ఆర్ రావు.. హెచ్ సూచీ 100 సాధించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఆయన ఈ విశిష్ఠత సాధించారు. హెచ్- సూచీకి ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సాధించిన 100 శతకాలలాంటిదే సిఎన్ఆర్ రావు హెచ్ - సూచీ 100 అంటారు. హెచ్-100 అంటే ఓ శాస్త్రవేత్త ప్రచురించిన పరిశోధన పత్రాలు 100 అన్నట్లు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+