పండుగ పూట ఊళ్లకు పోదాం చలో: రైళ్లు, బస్సులు కిటకిట..
రైల్వే కౌంటర్ల వద్ద జనం బారులు తీరి కనిపిస్తుండటంతో కొంతమంది బ్రోకర్లు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు.
హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో నగర జనమంతా పల్లెబాట పట్టారు. దీంతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కిటకిటలాడుతున్నాయి. బస్సుల కోసం ప్రయాణికులు గంటల కొద్ది పడిగాపులు పడాల్సిన పరిస్థితి.
ఎక్కువశాతం బస్సులు ముందస్తుగా రిజర్వ్ అయిపోవడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు రైల్వే స్టేషన్లలోను అదే పరిస్థితి కొనసాగుతోంది. జనం తాకిడి ఎక్కువగా ఉండటంతో రైళ్లన్ని కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నాయి.

వరుస సెలవులు:
విద్యార్థులకు, ఉద్యోగులకు వరుస సెలవులు కావడంతో నగరం నుంచి చాలా కుటుంబాలు పల్లెలకు పయనమయ్యాయి. శనివారం దసరా పండుగ, ఆదివారం రెగ్యులర్ హాలి డే, సోమవారం గాంధీ జయంతి కావడంతో.. చాలామంది ఉద్యోగులు కుటుంబంతో ఊళ్లకు బయలుదేరారు. బస్సులు, రైళ్లు కిక్కిరిసి కనిపిస్తుండటంతో చాలామంది ప్రైవేటు వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు వాహనాదారులు విపరీతంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video


పెరగనున్న ఫ్లాట్ ఫాం టికెట్:
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ రేట్లను రూ.20కి పెంచేసింది. ఫ్లాట్ ఫాం మీద రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నప్పటికీ.. ఇదే అదునుగా రైల్వే శాఖ బాదుడు మొదలుపెట్టిందని జనం వాపోతున్నారు.

ప్రత్యేక రైళ్లు:
పెరిగిన రద్దీతో రెగ్యులర్ రైళ్లు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపించడానికి సిద్దమైంది. సెప్టెంబర్ 29న సికింద్రాబాద్-కాకినాడ స్పెషల్ ట్రైన్(07075) సికింద్రాబాద్ నుంచి 7.45గం.కు బయలుదేరనుంది.
మరుసటి రోజు 8.30గం.కు కాకినాడ చేరుకుంటుంది. మధ్యలో 15స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు మరో ప్రత్యేక రైలు వేశారు. సెప్టెంబర్ 28న తిరుపతి నుంచి సాయంత్రం 5.గం. బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 5.50గం. సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇదే రైలు మళ్లీ అక్టోబర్ 1న సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5.55గం.కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.20గం. తిరుపతి చేరుకుంటుంది.

రైల్వే బాదుడు:
జనం తాకిడి ఎక్కువగా ఉండటంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రైళ్లలోను 30శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యేక రైళ్లంటూ రైల్వే శాఖ ప్రకటించిన రైళ్లపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్యాసింజర్ రైళ్లకు డొక్కు బోగీలు తగిలించి.. ఛార్జీలు మాత్రం ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక అడ్వాన్స్ టిక్కెట్ల కోసం స్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు కూడా అదనపు చార్జీలు తప్పడం లేదని తెలుస్తోంది. గతం కన్నా ప్రత్యేక రైళ్ల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బ్రోకర్ల వసూళ్లు:
రైల్వే కౌంటర్ల వద్ద జనం బారులు తీరి కనిపిస్తుండటంతో కొంతమంది బ్రోకర్లు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రయాణికుల నుంచి టికెట్‌కు రెండు, మూడింతలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. అయితే ప్రయాణికుల తాకిడి ఎంత పెరిగినా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మాత్రం సిబ్బంది పరిశుభ్రంగా ఉంచుతున్నారన్న కితాబు వ్యక్తమవుతోంది.

రైల్వే కూలీలూ బాదుతున్నారు:
గత మూడు రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 95వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రతీ రోజు 20వేల మంది ప్రయాణికులు పెరుగుతున్నారని సికింద్రాబాద్ రైల్వే అధికారులు చెబుతున్నారు.
కాగా, రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో రైల్వే కూలీలు జనరల్ కంపార్ట్ మెంట్ సీట్లను ఆక్రమిస్తున్నారు. సీటు కావాలనుకుంటే ప్రయాణికుల నుంచి రూ.100 నుంచి రూ.200వసూలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications