పొంచి ఉన్న ముప్పు: చైనా ఇంత పని చేస్తోందా?, నిషేధానికి భారత్ ఆదేశాలు..
న్యూఢిల్లీ: భారత భద్రతా వ్యవస్థకు స్మార్ట్ ఫోన్ యాప్స్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చైనా యాప్స్ వినియోగం పెరిగిపోయిన తర్వాత ఇండియా అంతర్గత భద్రతా విషయాలను ఈ యాప్ ద్వారా చైనాకు చేరిపోతున్నట్లు ఇంటలిజెన్స్ గుర్తించాయి.
ఈ మేరకు భారత హోంమంత్రిత్వ శాఖ చైనాకు చెందిన 42యాప్స్ ను ప్రమాదకరమైనవిగా గుర్తించింది. ఇందులో మరీ ముఖ్యంగా ట్రూ కాలర్, షేరిట్, యూసీ బ్రౌజర్ వంటివి ఉండటం గమనార్హం. భారత సైనికులు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్స్ ఉంటే భారత భద్రతకు ముప్పు వాటిల్లినట్లేనని ఇంటలిజెన్స్ అభిప్రాయపడుతోంది.

ఆర్మీకి ఆదేశం:
ఇంటలిజెన్స్ గుర్తించిన 42యాప్స్ ను స్మార్ట్ ఫోన్ల నుంచి తొలగించాలని భారత సైన్యానికి పారామిలటరీ దళాలకు హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారిక ఫోన్లతో పాటు వ్యక్తిగత ఫోన్లలోను వీటిని వినియోగించరాదని స్పష్టం చేశారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒకింత ఆందోళనను ఎదుర్కొంటోంది.

నవంబర్ 24న ఆదేశాలు:
ఆదేశాలు జారీ అయిన రోజు నుంచే ఆర్మీ సిబ్బంది తమ ఫోన్లలో నుంచి యాప్స్ తొలగించేలా చర్యలు తీసుకున్నారు. నవంబర్ 24న భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్మీ సిబ్బంది తమ ఫోన్లను పూర్తిగా ఫార్మాట్ చేయాలని సూచించారు. చైనా ఆండ్రాయిడ్/ఐఓఎస్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో.. వాటికి సంబంధించి ఏ ఆనవాళ్లు స్మార్ట్ ఫోన్లలో ఉండరాదని ఆదేశించారు. చైనా యాప్స్ అన్నింటిని స్పైవేర్(నిఘా) కోసం ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

వీటిపై బ్యాన్:
వీబో, వి చాట్ , షేర్ ఇట్ , ట్రూకాలర్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్(అలీబాబా కంపెనీ) ఎంఐ స్టోర్, ఎంఐ వీడియో కాల్, ఎంఐ కమ్యూనిటీ , క్లీన్‌మాస్టర్, 360 సెక్యూరిటీ, డియు రికార్డర్, డియు ప్రైవసీ, డియు బ్రౌజర్, డియు క్లీనర్, డియు బ్యాటరీ సేవర్, వైరస్ క్లీనర్ పర్‌ఫెక్ట్ కార్ప్ సీఎం బ్రౌజర్, బ్యూటీ ప్లస్, న్యూస్ డాగ్, వివా వీడియో-క్యూయూ వీడియో,
యు క్యామ్ మేకప్, ఫొటో వండర్, ప్యారెలల్ స్పేస్, క్యాచి క్లీనర్, వాల్ట్‌హైడ్, వండర్ కెమెరా, సెల్ఫీ సిటీ, మెయిల్ మాస్టర్, వి సింక్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, బైడు ట్రాన్స్‌లేట్ , బైడు మ్యాప్, ఏపీయూఎస్ బ్రౌజర్ , క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ న్యూస్ ఫీడ్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, క్యూక్యూ లాంచర్.

2015లోను:
గతంలో 2015లో చైనీస్ హ్యాకర్స్ దాడులను ఎదుర్కోవడానికి ఉన్నతస్థాయి పొలిటికల్ వర్గాలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. వైఫై, బ్లూటూత్ వంటి వాటిని బ్లాక్ చేసింది. అదే ఏడాది భారత భద్రతా బలగాలను టార్గెట్ చేసుకుని చైనీస్ హ్యాకర్స్ ప్రయోగించిన ఏపీటీ30 అనే బగ్ ను సింగపూర్ సైబర్ సెక్యూరిటీ గుర్తించింది. ఆ తర్వాత సంవత్సరం యూసీ బ్రౌజర్ ను చైనా స్పైవేర్ గా వాడుకున్నట్లుగా భారత్ గుర్తించింది.

జియోమి ఫోన్స్ కూడా:
జియోమి ఫోన్ల వల్ల కూడా భారత భద్రతా వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నట్లు 2014లో ఇంటలిజెన్స్ గుర్తించింది. ఇండియాలో ఎక్కువమంది వినియోగిస్తున్న ఫోన్లలో జియోమి ఫోన్ కూడా ఒకటి. భారత్ లోని డేటాను జియోమి చైనాకు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజాగా ఆయా యాప్స్ పై భారత హోంమంత్రిత్వ శాఖ అనుమానాలు లేవనెత్తడంతో.. వాటి యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications