హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలసాని: ఇదిగో పులి కథ

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీలో తలసాని శ్రీనివాస యాదవ్ పరిస్థితి ఇదిగో పులి కథ మాదిరిగా తయారైంది. మాటి మాటికి రాజీనామా చేస్తానని తలసాని బెదిరించడం వల్ల తీవ్రత ఏ మాత్రం లేకుండా పోయింది. గతంలోనూ ఆయన తాను పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించి తిరిగి రాజీకి వచ్చారు. ఇప్పుడు మారోసారి రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే ప్రయోగించాల్సిన శక్తివంతమైన రాజీనామా ఆయుధాన్ని తలసాని శ్రీనివాస యాదవ్ మాటి మాటికి ప్రయోగించడం వల్ల ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావనను తెచ్చిపెట్టింది.

ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసిన టి.దేవేందర్ గౌడ్ ను పార్టీలో చేర్చుకుంటే తాను రాజీనామా చేస్తానని తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బెదిరించారు. అయితే, చంద్రబాబు తలసాని శ్రీనివాస యాదవ్ బెదిరింపులను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇటు ఒక వైపు తలసాని బెదిరింపులు, హెచ్చరికలు, విమర్శలు చేస్తుండగానే దేవేందర్ గౌడ్ ను పార్టీలోకి తీసుకునే వ్యవహారం నడుస్తోంది. తలసాని శ్రీనివాస యాదవ్ ఒకవేళ పార్టీకి రాజీనామా చేసినా మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని కూడా చంద్రబాబుకు తెలిసిపోయింది. దాని వల్ల కూడా ఆయనను చంద్రబాబు ఖాతరు చేయడం లేదు.

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిపై ఆశతో తలసాని శ్రీనివాస యాదవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరడానికి సిద్దపడ్డారు. అందుకు ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా కలిశారు. దాంతో తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పడుతూ బహిరంగ విమర్శలకు దిగారు. తెలుగుదేశం తన విధానాన్ని మార్చుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని బెదిరించారు. ఈ సమయంలో ఆయన చంద్రబాబుతో మాట్లాడారు కూడా. ఆయన రాజీనామా చేసే దాకా పోయి రెండు సార్లు ఆగిపోయింది. కాంగ్రెసు పార్టీలో చేర్చుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ ఏ మాత్రం సుముఖంగా లేరు. తలసాని శ్రీనివాస యాదవ్ ను పార్టీలో చేర్చుకుంటే తామెవరమూ పనిచేయబోమని కాంగ్రెసు సికింద్రాబాద్ కార్యకర్తలు తీవ్రంగా హెచ్చరికలు చేసినట్లు వినికిడి. దీంతో తలసాని శ్రీనివాస యాదవ్ కు కాంగ్రెసు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. అందువల్ల ఆయన కాంగ్రెసులో చేరడానికి ఏ మాత్రం అవకాశం లేదనే విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఏమైనా తలసాని శ్రీనివాస యావద్ పరిస్థితి రాజకీయ జీవనం అంత సజావుగా ఏమీ లేదని తెలుస్తోంది. అది స్వయంకృతాపరాధమేనని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X