• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'గ్రేటర్' ఫైట్

By Pratap
|

Balakrishna-YS Jagan
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇరు పార్టీల బలాబలాలు దాదాపుగా సరి సమానంగా ఉంటాయి. ప్రజారాజ్యం, మజ్లీస్, లోకసత్తా వంటి ఇతర పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంది. తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎంలతో పొత్తు పెట్టుకుంది. అయితే హైదరాబాదులో వాటి ప్రాబల్యం చాలా తక్కువ. గతంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మేయర్ పదవిని గెలుచుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో తెలుగుదేశం బలంగానే ఉంది. అయితే ఎక్కువ శాసనసభా నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెసు చేతిలో ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పూర్తిగా ఆధిక్యత సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి.

పోటీ తీవ్రంగా ఉండడంతో ఎన్నికల ప్రచారం కూడా పోటాపోటీగానే జరుగుతోంది. తాజాగా, తెలుగుదేశం తరఫున సినీ నటుడు బాలకృష్ణ, కాంగ్రెసు తరఫున కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారానికి దిగడంతో ఎన్నికలు ఆసక్తిరంగా మారాయి. ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి రంగు, రుచి, వాస సమకూరాయి. ప్రచారంలోకి చివరి నిమిషంలో దిగిన జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అనుకరిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా పదునుగా ఉన్నాయి. పిట్టకథలతో, వ్యంగ్య వ్యాఖ్యలతో తన తండ్రిలాగానే అలరిస్తున్నారు. ఆయన ప్రసంగాలకు ప్రజలు కేరింతలు కొడుతున్నారు. బాలకృష్ణకు ఉన్న ఇమేజ్ సరేసరి. నటుడిగా ఆయనకు ఎనలేని అభిమాన సంపద ఉంది. ఆయన ప్రచారానికి కూడా విశేషంగానే జనాలు వచ్చారు.

చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేయడం లేదు. 64 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పోటీ చేస్తోంది. నిర్మాణం పూర్తి స్థాయిలో లేనందున అన్ని స్థానాలకు పోటీ చేయలేకపోతున్నామని చిరంజీవి చెప్పారు. చిరంజీవి విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయనకు కూడా అభిమాన సంపద దండిగానే ఉంది. అయితే, ఆయనపై ఉన్న అభిమానం ఓట్ల రూపంలోకి మారడం లేదు. ఆ పార్టీ పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. అయితే, ఏ పార్టీకీ మెజారిటీ రాదని, ఆ సమయంలో తాము మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కీలక పాత్ర పోషిస్తామని చిరంజీవి నమ్ముతున్నారు. కింగ్ మేకర్ తామే అవుతామనేది ఆయన విశ్వాసం. అది కూడా వీలవుతుందో, కాదో చెప్పలేం. కాంగ్రెసు పార్టీకి 40 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. వీరి అండతో మేయర్ పీఠాన్ని దక్కించుకోగలమనే ధీమాతో కాంగ్రెసు ఉంది. అవసరమైతే మజ్లీస్ కాంగ్రెసుకు సహకరించవచ్చు. కొన్ని డివిజన్లలో మజ్లీస్ బలంగా ఉంది. ఆ ప్రాంతాల్లో మజ్లీస్ తన ఆధిపత్యాన్నినిరూపించుకునే అవకాశం ఉంది. లోకసత్తాకు కూడా ఆంధ్ర సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో కొన్నిస్థానాలు రావచ్చు. అయితే ఇది నామమాత్రమేనని అంటున్నారు.

ఏమైనా, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల తరఫున ప్రాచరం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీలు తమ ఉనికిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీలు తెలుగుదేశం పార్టీ ఓట్లకు గండి కొడతాయనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. ఇది కూడా కాంగ్రెసుకు కలిసి రావచ్చునని అంచనాలు వేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X