వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కటైన బాబు, జగన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu
ముఖ్యమంత్రి కె.రోశయ్య నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేతులు కలిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పార్లమెంటులో జరిగిన ఉదంతం ఈ విషయాన్ని బలపరుస్తోందని అంటున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైయస్ జగన్ తెలుగుదేశం సభ్యులతో పాటు ప్లకార్డు ప్రదర్శించారు. లోకసభలో గందరగోళం సృష్టించిన తెలుగుదేశం సభ్యులను ఆయన అభినందించారు. వారి చెంతకు వెళ్లి మరీ అభినందనలు తెలిపారు. దీనిపై కాంగ్రెసు ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ జగన్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడ్డారు. అలాగే, కాంగ్రెసుకు చెందిన రాయలసీమ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి, తెలంగాణకు చెందిన మందా జగన్నాథం మధ్య వాగ్వివాదం చెలరేగింది. రాష్ట్రానికి నాయకత్వం వహించాలని భావిస్తున్న జగన్ ఒక ప్రాంత కోణంలో ఎలా ఆలోచిస్తారనే ప్రశ్న తలెత్తోంది. అంతేకాకుండా పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు బహిరంగ వ్యతిరేకత ప్రదర్శించడం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది. ఇక్కటి కాకున్నా ఇద్దరి లక్ష్యం ఒక్కటే కాబట్టి ఒక మార్గంలోనే పయనిస్తున్నారని అనుకోవచ్చునని అంటున్నారు. ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం 2014 దాకా ఆగే స్థితిలో లేరని, అందుకే సంక్షోభాన్ని సృష్టించి తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోవాలని చూస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది.

ముఖ్యమంత్రి రోశయ్యను నానా తిప్పలు పెట్టిన జగన్, అధిష్టానాన్ని కూడా ఇబ్బందులకు గురి చేసేందుకు సిద్ధపడ్డారని, అందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టే కాంగ్రెసు అధిష్టానం ప్రభుత్వం తరఫున తెలంగాణపై నిర్దిష్టమైన ప్రకటన చేయించిందని అంటున్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలను ఆహ్వానించడానికి చంద్రబాబు తెలంగాణపై ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. వైయస్ జగన్ కూడా తమ ప్రాంత ప్రజల అభీష్టం పేరుతో సొంత పార్టీపైనే తెరచాటు వ్యతిరేక ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగడం కూడా జగన్ కు రుచించడం లేదని అంటున్నారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబును గాలి జనార్దన్ రెడ్డి తిరిగి తన మార్గంలోకి తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అనుమతులు లభించాయి. గాలి జనార్దన్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య పాత సంబంధాలున్నాయి. ఇప్పుడు వాటి పునరుద్ధరణ జరిగినట్లు చెబుతున్నారు.

ఈ స్థితిలో తెలంగాణ కాకపోయినా మరో రకంగా కాంగ్రెసు పార్టీని వారు ముగ్గురు కలిసి ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. సమైక్యాంధ్ర నినాదం చేస్తూ తీవ్రంగా ఉద్యమిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు చాలా మంది జగన్ అనుయాయులే కావడం గమనార్హం. అలాగే సమైక్యాంధ్ర నినాదం చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు మంత్రులకు నాయకత్వం వహిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కంకణం కట్టుకున్నవారే. తీవ్ర స్థాయిలో జగన్ కు అనుకూలంగా, పార్టీకి కూడా వ్యతిరేకంగా ముందుకు వచ్చిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డికి రామనారాయణ రెడ్డి సోదరుడు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు కూడా చాలా మంది మొన్నటి వరకు జగన్ కు అనుకూలంగానే ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తన అనుకూలంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యులతో కాంగ్రెసు అధిష్టానానికే జగన్ సవాలుగా మారారు. ఈ స్థితిలో తెలంగాణపై నిర్దిష్టమైన ప్రకటన చేయడం ద్వారా ప్రాంతాలవారీగా తమ పార్టీలోనే చీలిక వచ్చే విధంగా పార్టీ అధిష్టానం వ్యూహరచన చేసిందని అంటున్నారు. తెలంగాణలోని మంత్రులు, శాసనసభ్యులు ఇప్పుడు జగన్ ను బలపరిచే స్థితి లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్ర నాయకులు జగన్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి ఉండదు.

తెలంగాణపై చంద్రబాబు మాట మార్చడం ద్వారా రెండు ప్రాంతాల్లోనూ విశ్వసనీయతను కోల్పోతారనే భావన కూడా ఉంది. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం వల్లనే కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించిందనే భావన కోస్తా, రాయలసీమల్లో బలపడింది. దీంతో చంద్రబాబుపై ఆ రెండు ప్రాంతాల ప్రజలు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. కాగా, తాము చివరి దాకా సమైక్యాంధ్ర కోసం పోరాడమని చెప్పి ప్రజలను ఒప్పించడానికి అవసరమైన ప్రాతిపదికను కూడా కాంగ్రెసు ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దీక్ష చేపట్టినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, సమైక్యాంధ్రకు తాము శతవిధాలా ప్రయత్నించామని, అందుకు అధిష్టానాన్ని ఒప్పించడానికి పడరాని పాట్లు పడ్డామని, తమ కృషి లోపం ఏదీ లేదని చెప్పుకోవడానికి తగిన ప్రయత్నాలు ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెసు అధిష్టానమే రాష్ట్రంలో సంక్షోభాన్ని ఆహ్వానించిందని అనుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X