కెసిఆర్ కు 'గ్రేటర్' గుదిబండ

హైదరాబాదులో తెరాసకు తగిన బలం లేదనే విషయం తెలిసిందే. గతంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గాల్లో గెలిచిన తెరాస ఇటీవలి ఎన్నికల్లో ఆ సీట్లను కూడా కోల్పోయింది. మహేశ్వరం శాసనసభా స్థానంలో రియల్టర్లు తెరాస అభ్యర్థిని తరిమి కొట్టారు కూడా. రియల్టర్లు తెరాసను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లింల్లోకి తెలంగాణ వాదం ఇంకలేదు. పైగా సెటిలర్ల ప్రభావం గ్రేటర్ హైదరాబాదు పరిధిలో బలంగానే ఉంది. దీంతో పోటీకి తెరాస వెనకాడుతోంది. పోలిట్ బ్యూరోలోని 95 శాతం మంది పోటీ వద్దని అభిప్రాయపడినట్లు కెసిఆర్ ఇంతకు ముందు చెప్పారు. దీంతో పోటీ నుంచి తెరాస తప్పుకోవడానికి సిద్ధమైనట్లే భావించారు.
తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని చెబుతూ వస్తున్న తెరాసకు గ్రేటర్ ఎన్నికల్లో తగిన స్థానాలు వస్తాయని చెప్పడం కష్టమే. ఈ స్థితిలోనే విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెరాసకు సవాళ్లు విసురుతున్నారు. పైగా హైదరాబాద్ ను తమదని చెప్పుకుంటూ పోటీ చేయకపోవడం వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుంది, పోటీ చేసి గెలవక పోతే సంభవించే నష్టం ఏమిటి అనేది బేరీజు వేసుకోవడంలో కెసిఆర్ మునిగిపోయినట్లు చెబుతున్నారు. అయితే రెండు విధాల కూడా నష్టమేనని స్పష్టమైపోయినట్లే. అయితే ఏది తక్కువ నష్టమనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెసిఆర్ కు తలకు మించిన భారంగానే మారాయి.












Click it and Unblock the Notifications