వైయస్ జగన్ నిర్వేదం

సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమించిన చిరంజీవి, మోహన్ బాబులపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతే జగన్ పై కూడా తెలంగాణ ప్రాంతంలో వ్యక్తమవుతోంది. ఆయన స్పష్టంగా తన తెలంగాణ వ్యతిరేకతను బయట పెట్టుకుని, సమైక్యాంధ్ర నినాదం తీసుకోవడంతో రాష్ట్ర స్థాయి నాయకత్వ స్థాయిని కోల్పోయారు. రాష్ట్ర విభజన జరగకపోయినా ఆయనను తెలంగాణ ప్రజలు స్వీకరించే స్థితిలో లేరు. ఆయన వర్గానికి చెందిన తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు కూడా ఇప్పుడు తెలంగాణ నినాదాన్నే ప్రధాన ఎజెండాగా స్వీకరించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో తమకు అభివృద్ధి తెలంగాణ కావాలంటూ ఆయన వర్గీయులు వాదిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. తెలంగాణలోని కాంగ్రెసుకు సీమాంధ్ర నాయకులు దిశానర్దేశం చేసే పరిస్థితులు లేవు. దీంతో జగన్ సీమాంధ్ర నాయకుడిగానే మిగిలిపోతున్నారు. సీమాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవితో ఆయన పోటీ పడాల్సిన స్థితి ఉంది. ఆయన ఏకైక నాయకుడయ్యే స్థితి కూడా లేదు.
జగన్ నిర్వేదం ప్రభావం సాక్షి టీవీ చానెల్ పై, పత్రికపై తీవ్రంగా పడుతోంది. ఏదీ తాను ముఖ్యమంత్రి కావడానికి పనికి వచ్చేట్లు లేకపోవడంతో సాక్షి టీవీ చానెల్ లో వార్తల సేకరణ పట్ల నిరాసక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి చెందిన వార్తలను సేకరించడానికి ఏ మాత్రం ఇష్టపడం లేదని సమాచారం. పైగా, జనవరి కానుకగా పలువురు తెలంగాణ జర్నలిస్టులకు ఉద్వాసన పలకడానికి కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొంత మంది జర్నలిస్టులకు ఇప్పటికే ఆ సమాచారాన్ని అందించారని అంటున్నారు. మీడియాపై కూడా ఆధిపత్యం సంపాదించి అధికారాన్ని చేపట్టాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం జగన్ కు తీవ్ర నిరాశ కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.