చిరంజీవి దుకాణం వెలవెల

ప్లీనరీకి శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి రాలేదు. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు అనిల్ కుమార్, మహేశ్వర రెడ్డి కూడా డుమ్మా కొట్టారు. సీనియర్ నేతలు చాలా మంది సమావేశానికి దూరంగానే ఉన్నారు. దీంతో సమావేశం వెలవెలబోయింది. అయితే చిరంజీవి మాత్రం గంభీరమైన ప్రసంగమే చేశారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీ దగ్గర కావడంతో శోభానాగిరెడ్డి దూరమవుతున్నట్లు అర్థమవుతోంది. శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సన్నిహితంగా మెలుగుతున్నారు. పావురాలగుట్టలో జరిగిన వైయస్ సంస్మరణసభకు వారు హాజరయ్యారు. అయితే, జగన్ కు చెక్ పెట్టేందుకు చిరంజీవిని కాంగ్రెసు పార్టీ దగ్గరకు తీసిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం పడిపోయే స్థితి వస్తే కాంగ్రెసును ఆదుకుంటామని చిరంజీవి ప్రకటించారు. దీంతో జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీలో సంభవిస్తున్న పరిణామాల పట్ల, జగన్ నుంచి పార్టీని ఆదుకోవడానికి చిరంజీవి సిద్ధపడడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శోభానాగి రెడ్డి దంపతులు చిరంజీవికి దూరమైనట్లేనని భావిస్తున్నారు. చిరంజీవి కాంగ్రెసుతో చేతుల కలపడాన్ని చాలా మంది నాయకులే కాదు, క్యాడర్ కూడా జీర్ణించుకోలేక పోతుందనే మాట వినిపిస్తోంది.
కాగా, తెలంగాణలో గెలిచిన ఇద్దరు శాసనసభ్యులు కూడా చిరంజీవికి దూరమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన తర్వాత చిరంజీవి సమైక్యనినాదాన్ని తీసుకున్నారు. సమైక్య నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో ఆయనకు తెలంగాణ శాసనసభ్యులు దూరమయ్యారు. క్యాడర్ కూడా చాలా వరకు చిరంజీవికి దూరమయ్యారని చెప్పవచ్చు. దాని వల్లనే విశాఖపట్నం ప్లీనరీకి తెలంగాణ నుంచి దాదాపుగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఒక ప్రాంతాన్ని మొత్తం చిరంజీవి దూరం చేసుకున్నారని భావించవచ్చు.
ఒక వైపు కాంగ్రెసు అనుకూల వైఖరి, మరోవైపు తెలంగాణ వ్యతిరేక వైఖరి చిరంజీవి ప్రజారాజ్యానికి తిరిగి జవజీవాలు నింపడానికి పెద్ద ఆటంకంగా మారాయి. చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన కాపునాడుకు ప్రజారాజ్యం రాజకీయాలు రుచించడం లేదు. పార్టీలో అల్లు అరవింద్ పాత్రను కాపునాడు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో ప్రజారాజ్యం కోలుకోవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనమవుతుందనే ప్రచారం కూడా తీవ్రమైన దెబ్బనే.












Click it and Unblock the Notifications