ఈనాడు, సాక్షి పోరు ఎందుకు?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ కు విశేష ప్రచారం కల్పించింది ఈనాడు. అప్పటి నుంచి అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన పాలసీని నిర్ణయించుకుంది. రామోజీ రావు ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాత్ర పోషించరు. కానీ ఆయన రాజకీయాలను ప్రభావితం చేయగలరు. రాజకీయ నేతలను తన చేతుల్లో పెట్టుకోగలరని అంటారు. అలా తెలుగుదేశం పార్టీ యావత్తూ రామోజీరావు చేతుల్లో ఉందని అంటారు. ఎన్టీఆర్ ను గద్దె దించి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంలో రామోజీరావుది ప్రధాన పాత్ర అంటారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీకి రామోజీరావు ఇన్ సైడర్. కాంగ్రెసుకు అనుకూలమైన పత్రికలు ఉన్నప్పటికీ చాలా వరకు ప్రొఫెషనలిజాన్ని, వార్తలను అందించడంలో సమగ్రతను ప్రదర్శించడం ద్వారా ప్రజల ఆదరణ దానికే లభించింది. తెలుగుదేశం అనుకూల వైఖరి ఈనాడులో అంతర్గతంగా ఊంటూ వచ్చింది. దాన్ని పసిగట్టడం కూడా కష్టంగా ఉండేది. అలా కనిపించకుండా అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినవారి మీద కూడా వ్యతిరేక వార్తాకథనాలు వచ్చేవి.
సాక్షి వచ్చిన తర్వాత ఈనాడు స్వరూప స్వభావాలు మారిపోయాయి. ఒక రకంగా వైయస్ ముఖ్యమంత్రి కావడంతోనే దానికి పునాది పడింది. సాక్షి దినపత్రిక యజమాని వైయస్ జగన్ స్వయంగా రాజకీయ నాయకుడు కావడం, రాష్ట్ర రాజకీయాలను శాసించే శక్తి మంతుడు కావడం వల్ల దాని వార్తాకథనాల తీరుతెన్నులే పూర్తి భిన్నంగా ఉంటూ వస్తున్నాయి. పాక్షికత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ వస్తోంది. తనను టార్గెట్ చేస్తూ రావడంతో రామోజీరావు ఈనాడులో వార్తాకథనాల తీరుతెన్నులను మార్చుకోవాల్సి వచ్చింది. సాక్షిపై, వైయస్ రాజశేఖర రెడ్డి బంధు మిత్రులపై వార్తాకథనాలను రాస్తూ తనను సమర్థించుకుంటూ రావాల్సి వచ్చింది. దీంతో జర్నలిజం ప్రధానంగా సాక్షి, ఈనాడు పోరాటంగా మారిపోయింది. అది కూడా రాజకీయ పోరాటంగానే ఉంది. ప్రజా సమస్యలను వక్రీకరించడం, వివిధ అంశాల విషయంలో ప్రభావాలను తమకు అనుగుణంగా రాసుకోవడం ప్రారంభమైంది. జంకూ గొంకూ లేకుండా సాక్షి ప్రతిపక్షాల కార్యక్రమాలను ఫెయిల్ అయినట్లుగా రాస్తూ వస్తోంది. సాక్షి, ఈనాడుల వైరాన్ని పాలక వర్గాల్లోని వైరుధ్యంగానే చూడాల్సి ఉంది. వాటితో ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేదు. అయితే, ఓ లాభం మాత్రం జరుగుతోంది. పాలకవర్గాల్లోని ఇరు పక్షాలు వనరులను దిగమింగడంలో ఎవరికి ఎవరు తీసిపోలేదనే విషయం మాత్రం బయటపడుతూ వస్తోంది. ఈ రకంగా ప్రజలకు మరింత చైతన్యం పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు యాజమాన్యాల టీవీ న్యూస్ చానెళ్లు కూడా అదే పని చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications