వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై కెసిఆర్ ఆశలు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధపడిన వైయస్ జగన్ పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆశలు పెట్టుకున్నట్లున్నారు. వైయస్ జగన్ కొత్త పార్టీపై కెసిఆర్ గానీ తెరాస నాయకులు గానీ ఏమీ స్పందించడం లేదు. గతంలో తెలంగాణ వ్యతిరేకిగా ఆయనపై తెరాస నాయకులు దుమ్మెత్తిపోశారు. వరంగల్ జిల్లా మహబూబా బాద్ ఓదార్పు యాత్రను అడ్డుకున్నారు. ఇప్పుడు మాత్రం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. వైయస్ జగన్ పార్టీ విధివిధానాలు చూసిన తర్వాత మాత్రమే మాట్లాడుతామని గతంలో కెసిఆర్ తాజాగా తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అనడాన్ని బట్టి అది మనకు అర్థమవుతోంది. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వారు భావిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తుందనే ఆశలు సన్నగిల్లినట్లు అనిపిస్తోంది. కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్ ను మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని కూడా అణచేయడానికి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందని, అందుకు అవసరమైన వ్యూహరచన చేసి అమలు చేస్తోందనే అభిప్రాయం బలపడుతూ వస్తోంది. కాంగ్రెసుకు కెసిఆర్ దూరమవుతున్నట్లున్నారు. దాదాపుగా కెసిఆర్, కాంగ్రెసు ఒక్కటైపోయిన వాతావరణం కూడా ఒక సందర్భంలో ఏర్పడింది. కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావుతో కెసిఆర్ భేటీ అయిన సమయంలో ఆ అభిప్రాయం బలపడింది. అయితే, తెలంగాణ శాసనసభ్యులు, మాజీ మంత్రులు మంత్రి పదవులకు అర్రులు సాచిన వైనం, తెలంగాణ అంశాన్నిపక్కన పెట్టినట్లు కనిపించడం వంటి కారణాలతో కెసిఆర్ కాంగ్రెసుకు దూరమైనట్లే కనిపిస్తున్నారు. ఇంత కాలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మాత్రమే ఆయన లక్ష్యంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెసుపై ప్రధానంగా తన వాగ్బాణాలను ఎక్కుపెట్టారు.

తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా కాంగ్రెసుపై కూడా పోరాటం చేయాల్సిన స్థితిలో వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా తీసుకునే పరిస్థితి ఉంటుందేమోనని కెసిఆర్ ఆశిస్తున్నారు. అందువల్ల తొందరపడి వ్యాఖ్యలు చేసి వైయస్ జగన్ ను శత్రువుగా మార్చుకోకూడదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్దన్, గోనె ప్రకాశరావు వంటి నాయకులు వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా వైఖరిని ప్రదర్శించే అవకాశాలున్నట్లు సూచనలు ఇస్తున్నారు. ఈ స్థితిలో అవసరమైతే కాంగ్రెసును దెబ్బ తీయడానికి వైయస్ జగన్ కూడా తెలంగాణలో పనికి వస్తారని కెసిఆర్ భావిస్తూ ఉండవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X