చిరంజీవి పొలి'ట్రిక్స్' ఏమిటి?

రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు చిరంజీవి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ బాధితులను నిర్లక్షం చేస్తుందని, బాధితులకు సహాయక చర్యలు ఏమాత్రం లేవని, పునరావాస కేంద్రాలు కూడా అంతంత మాత్రమేనని రోశయ్య ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఆంతకుముందు కూడా చాలాసార్లు ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. అయితే అదే సమయంలో ఆయన కొన్నిమార్లు రోశయ్య ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని, ప్రభుత్వానికి ఏదైనా సమస్య ఏర్పడితే అప్పుడు చూద్దామని, స్నేహహస్తం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడాడు.
రాష్ట్రంలో ఉన్నప్పుడు సమస్యలపై రోశయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చిరంజీవే మంగళవారం ఢిల్లీ పర్యటనలో కూడా రోశయ్య సమర్థుడన్నారు. రోశయ్య ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదన్నారు. రోశయ్య తన అనుభవంతో ప్రభుత్వాన్ని సమస్యలనుండి పారద్రోలుతారన్నారు. ఆయన పాలనపై పూర్తి విశ్వాసాన్ని కనబరిచినట్లు వ్యాఖ్యానించారు. ఇలా రెండు నాల్కలతో మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో ముంచెత్తుతున్నారు. అయితే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు కు దూరమయి కొత్త పార్టీ పెడుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు కు చిరంజీవి అవసరం, అలాగే చిరంజీవి తన భవిష్యత్తు కోసం కాంగ్రెసు పంచన చేరుతారనే ఊహాగానాలకు ఆయన వ్యాఖ్యలు కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications