తెలంగాణ ఇష్యూ: చంద్రబాబుపై 'గులాం' గురి

తెలంగాణ అంశం మళ్లీ మొదటికి వచ్చిందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. పార్టీలో సంప్రదింపులు జరగాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సంప్రదింపులు పార్టీలోని తెలంగాణ, సీమాంధ్ర నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించిన తర్వాత పార్టీ అధిష్టానానికి తాము ఏ విధమైన వైఖరి ప్రకటించాలో ఓ స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా వ్యవహరించేందుకు వీలు పడుతుంది.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనేది కూడా కాంగ్రెసు అధిష్టానం వ్యూహంలో భాగమని కూడా చెబుతున్నారు. తమ పార్టీలోని ఇరు ప్రాంతాల నాయకులతో పాటు ఇతర పార్టీలను కూడా సంప్రదిస్తామని ఆయన చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా జరిగే ఈ సంప్రదింపుల ప్రక్రియలో చంద్రబాబు తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మరోసారి ఇరు ప్రాంతాల నాయకుల భిన్న ప్రకటనలతో తెలుగుదేశం పార్టీ స్ఫష్టమైన వైఖరి ప్రదర్శించలేకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు వైఖరిని ప్రకటించాల్సి వస్తే ఇరకాటంలో పడవచ్చు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు ఏ వైఖరి ప్రకటించాలో తేల్చుకోలేకపోతారని, దానివల్ల ఇప్పటికే తెలంగాణలో తీవ్రంగా దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో కూడా దెబ్బ తింటుందని భావిస్తున్నారు. ఈ రకంగా కూడా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానానికి తప్పించుకోవడానికి మరోసారి అవకాశం చిక్కుతుంది.