తప్పు ఒప్పుకున్న చంద్రబాబు

ఇటీవల మహానాడులో తాను మారానని బాబు చెప్పారు. గతంలో బాబు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కాదనే వాదనలు ఉన్నాయి. దానిపై ఆయన స్పందిస్తూ తాను ఇక నుండి సాధారణ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. చెప్పినట్లుగానే బాబు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నారట. 2014 ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి ఆయన తన సర్వశక్తులూ ఇప్పటి నుండే ఒడ్డుతున్నారు. గతంలో చదువుకునే వారికి రాజకీయాలు వద్దని టిఎన్ఎస్ఎఫ్ రద్దు చేసిన బాబు పునరుద్ధరించారు. యువతకు మరింత దగ్గర కావడానికి తెలుగు యువతలో ముప్పై అయిదేళ్లకు పైబడిన వారికి నో వేకెన్సీ అనే రూల్ తీసుకు వచ్చారు.
అలాగే పార్టీకి దూరమైన సీనియర్ నేతలను, దూరమవుతారనుకున్న నేతలతో మాట్లాడి వారిని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నారు. టిడిపి హయాంలో ఉద్యోగులకు బాబు అంటే హడల్. ఇప్పుడు వారిని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైటెక్ హంగులకు మురిసిపోయి రైతులను ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు బాబు మీద ఇంతా అంతా కాదు. రైతులకు దగ్గరయ్యేందుకు ఆయన ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఓ ఎత్తైతే బాబు తాను మారానని, తాను తప్పు చేశానని చెబుతూ తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా ఫణంగా పెట్టడం విశేషం.












Click it and Unblock the Notifications