ఆస్తుల ప్రకటనతో చంద్రబాబు సెల్ఫ్ గోల్?

హైదరాబాదులోని అత్యంత సంపన్నమైన ప్రాంతంలో గల చంద్రబాబు ఇల్లు కేవలం 23 లక్షల పైచిలుకు విలువ మాత్రమే చేస్తుందని చెప్తే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. తాను మూడింతలు, నాలుగింతలు ఇస్తాను, ఆ ఇల్లు చంద్రబాబు ఇస్తారా అని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలోని ఆంతర్యం అందరికీ అర్థమయ్యే విషయమే. ఈ విషయం జెసి దివాకర్ రెడ్డి వంటివారికే కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా తెలుసు. హైదరాబాదులోని అతి సాధారమైన ప్రాంతాల్లో రెండు గదుల ఫ్లాట్ (ఇల్లు కాదు) 950 ఫ్లింత్ ఏరియాతో దాదాపు 20 లక్షల రూపాయలు పలుకుతోంది. అలా చూసినప్పుడు చంద్రబాబు ఇల్లు కోట్లలోనే ఉంటుందని ఎవరైనా అంచనాకు రావచ్చు.
అటువంటి విమర్శలు వస్తాయనే ముందుచూపుతోనే తాను కొనుగోలు చేసిన సమయంలో పలికిన ధర ఆధారంగానే విలువ కట్టినట్లు చంద్రబాబు చెప్పారు. మార్కెట్ విలువ ఎప్పటికప్పుడు మారుతుందని, అందుకే తాను ఆ విలువను ఇస్తున్నానని చెప్పారు. అందువల్ల చంద్రబాబు ఆస్తుల విలువ ఎంత ఉటుందో చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల విలువను బట్టి ఎవరైనా దాదాపుగా అంచనాకు రాగలరు. దీనివల్ల చంద్రబాబు తాను నిజాయితీపరుడనని చెప్పుకోవడానికి, వైయస్ జగన్‌పై దాడి చేయడానికి ఎక్కువ పనికి వస్తుందని భావించి ఆస్తుల విలువ ప్రకటించారనే అభిప్రాయం వినిపిస్తోంది. తాను ఆదర్శంగా ఉన్నట్లు చాటుకునే ప్రయత్నం తప్ప చంద్రబాబు ఆస్తుల వెల్లడిలో నిజాయితీ లేదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. ఏమైనా, రాజకీయ నాయకుల ఆస్తులపై ప్రజలకు ఉజ్జాయింపుగా ఓ అంచనా ఉంది.
తనపై పాత ఆరోపణలనే కొత్తగా తీస్తూ ఎప్పటికప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం విమర్శలు చేస్తోంది. సాక్షి దినపత్రికలో పాత వార్తాకథనాలనే కొత్త మళ్లీ మళ్లీ రాస్తోంది. వాటికి అడ్డుకట్ట వేయడానికి తన ఆస్తుల వెల్లడి పనికి వస్తుందని కూడా చంద్రబాబు భావించి ఉండవచ్చు. కానీ, ఆస్తుల ప్రకటన ద్వారా చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications